A Photo changed the life of a small girl Divya in Gudimalkapur, Hyderabad
హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం ఏరియా గుడిమల్కాపూర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఎంతోమంది హృదయాలని కదిలించిందనే చెప్పాలి. ఆ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, దివ్య అనే పాప గుడిమల్కాపూర్ ఏరియాలోని నవోదయ కాలని గుడిసెలలో తన తల్లిదండ్రులతో జీవిస్తోంది. అయితే ఆమె ప్రతిరోజూ అదే ప్రాంతంలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్‌కి సరిగ్గా ఒంటిగంట సమయంలో చేతిలో ఒక గిన్నెతో వెళ్తుందట.
అలా వెళ్ళడానికి కారణం – ఆ పాఠశాలలో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడమే. వారు భోజనం చేయగా.. మిగిలిన ఆహారాన్ని తినడానికి ఆమె రోజూ ఆ బడికి వెళ్తుండేది. అయితే ఈ విషయం ప్రపంచానికి తెలియడానికి కారణం, ఆమె భోజనం కోసం ఓ రోజు తరగతి బయట గిన్నెతో నిలుచుని చూస్తున్న సమయంలో ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో. సదరు జర్నలిస్టు, ఆ పాఠశాలలో డెంగ్యూ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారనే విషయం తెలుసుకునేందుకు వెళ్ళగా.. అతనికి ఈ దృశ్యం కనపడడంతో.. వెంటనే ఫోటో తీసి ఆ తరువాత ఆమె వివరాలు కనుగొని ‘ఆకలి చూపులు’ అనే శీర్షికతో ఈ ఫోటోని ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురించాడు.
ఆమె తొలి చిత్రమే “స్వలింగ సంపర్కం”పై : హైదరాబాద్ నటి శ్రీదేవి చౌదరి డేరింగ్ నిర్ణయం
ఈ ఫోటో & కథనాన్ని తెలుసుకున్న మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ వారు వెంటనే ఆ పాప ఎవరు? ఎక్కడ ఉంటుంది? అనే వివరాలు సేకరించి ఆమెని వెళ్లి కలిశారు. అలా కలిసినప్పుడు వారికి అనేక ఆసక్తికరమైన వివరాలు తెలిసాయి.
ఆ పాప తల్లిదండ్రులు.. ఆ చుట్టూ పక్కన ప్రాంతాల్లో చెత్త ఎత్తుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వారు ఉదయం ఆరు గంటలకి బయటకు వెళ్ళి.. మధ్యాహ్నం తరువాతే ఇంటికి వస్తుంటారు. ఆ సమయంలో వారు నివసించే గుడిసెలో దివ్య మాత్రమే ఒంటరిగా ఉంటుంది. అదే సమయంలో మధ్యాహ్నం వేళ తనకు ఆకలి వేస్తే.. ఇలా పక్కనే ఉన్న స్కూల్‌కి ఆహారం కోసం వెళ్తూ ఉంటుంది.
ఇక ఈ విషయమై దివ్య తల్లిదండ్రులని ప్రశ్నించగా.. వారు తమ కూతురిని స్కూల్లో చేర్పించేందుకు ప్రయత్నించామని తెలిపారు. అయితే ఇంకా అయిదేళ్ళు నిండని కారణంగా పాఠశాల వారు అనుమతించలేదని వారు బదులిచ్చారు. అలాగే తమకి ఇంకొక అమ్మాయి కూడా ఉందని, ప్రస్తుతం ఆమె గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటుందని చెప్పారు. ఇప్పుడు దివ్యని కూడా పాఠశాల యాజమాన్యం.. బడిలో చేర్చుకుంటే తమకి ఎంతో ఆనందంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఓ ఎన్.జీ.ఓ నిర్వాహకులు పాఠశాలలోని ఉపాధ్యాయులతో మాట్లాడి.. వెంటనే దివ్యని బడిలో చేర్పించారు.
సదరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని.. ఆమెని పాఠశాలలో చేర్చుకునేందుకు అనుమతిచ్చారు. అలాగే ఆమెకి స్కూల్ యూనిఫార్మ్‌తో పాటుగా పుస్తకాలు కూడా అందించారు. ఇప్పుడు ఆ పాప రోజు ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లడంతో పాటు.. అక్కడ విద్యార్ధులతో కలిసి హాయిగా చదువుకుంటోంది. అలాగే ఆమెకు మధ్యాహ్న భోజనం కూడా లభిస్తోంది.
హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలివే…
ఇక దివ్య స్కూల్‌కి మొదటిరోజు వెళ్లిన తరువాత, ఎన్.జీ.ఓ సంస్థ ఫౌండర్ ఆమె ఉండే ఇంటికి వెళ్లి.. అక్కడి పరిసరాలని చూసి విస్తుపోవడం జరిగిందట. అసలు ఏమాత్రం నివాసయోగ్యం కాని పరిస్థితుల్లో వారు జీవిస్తుండడం తనకు బాధను కలిగించిందట. అయితే దివ్య మాత్రం స్కూల్‌కి వెళ్లడం .. అలాగే తరగతిలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకోవడం.. మధ్యాహ్నం కడుపునిండా భోజనం చేయడంతో తను ఆనందపడ్డారట. ఆమెని చూసి తల్లిదండ్రులు సైతం చాలా సంతోషించడంతో.. సదరు ఎన్.జీ.ఓ వారు కూడా తాము చేసిన పని విజయవంతమైందని భావించారు.
ఒకరకంగా ఆ జర్నలిస్ట్ తీసిన ఒక్క ఫోటో ఆ చిన్నారి జీవితాన్నే మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. కాకపోతే దివ్య లాంటి ఇంకెందరు అమ్మాయిలు.. ఇలా సరైన పోషకాహారం లభించక అనారోగ్యంతో, అర్ధాకలితో జీవిస్తున్నారో ఊహిస్తేనే ఏదోలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే ఎన్.జీ.ఓ లు, బాధ్యత కలిగిన జర్నలిస్టులు చేస్తున్న కృషి ఎంతోమంది అభాగ్యుల జీవితాలని నిలబెడుతుందనే ఆశాభావం కలుగుతుంది.
హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!