తల్లి కావడమనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక మరుపురాని సంఘటన. అదే సమయంలో తల్లి కాలేకపోయిన స్త్రీలు కూడా ఎంతో బాధను, ఆవేదనను అనుభవిస్తుంటారు. అలాంటి వారి బాధని తీర్చేందుకు సంతాన సాఫల్య పద్ధతులు ఎన్నో ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి ఒక పద్దతే – ఐవీఎఫ్ (IVF). ఈ పద్ధతి ద్వారా ఎంతోమంది స్త్రీలు మాతృత్వపు మాధుర్యాన్ని పొందగలుగుతున్నారు.
అయితే ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా 40, 50 వయసులో ఉన్న వారే కాకుండా.. 60 ఏళ్ళు దాటి తల్లి కాలేని వ్యక్తులు కూడా బిడ్డలకు జన్మనివ్వగలుగుతున్నారు. దాంతో ఈ ఐవీఎఫ్ పద్దతికి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగింది. ఆ ఆదరణకి తాజా రుజువు ఆంధ్రప్రదేశ్‌లో మనకి కనిపిస్తోంది.
తల్లి కాబోతున్న “దంగల్ గర్ల్” గీతా ఫోగాట్ .. వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫొటో..!
ఇక వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకి చెందిన మంగాయమ్మ 73 ఏళ్ళ వయసులో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కవల పిల్లలకి (Twins) జన్మనిచ్చింది. వారిద్దరూ ఆడపిల్లలే కావడం విశేషం. ఈ సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1962, మార్చి 22వ తేదిన రాజారావు, మంగాయమ్మలకు వివాహం జరగగా… అప్పటినుండి ఈ ఆలుమగలకు సంతానభాగ్యం లేదు. అయితే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానం కలిగే అవకాశం ఉందని తెలుసుకుని.. ఈ దంపతులు గత ఏడాది గుంటూరులోని ఓ ఆసుపత్రిని సందర్శించారు.
72 ఏళ్లు నిండిన మంగాయమ్మకు ఆరోగ్య పరీక్షలు చేసి.. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఏవి లేవని నిర్ధారణ చేసుకున్న డాక్టర్లు.. ఆమెకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలు కలిగే అవకాశముందని తెలిపారు. అయితే మంగాయమ్మ మెనోపాజ్ దశ దాటిపోవడంతో.. వేరే మహిళ నుంచి అండాన్ని, మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి.. ఆమె గర్భం ధరించేలా చేశారు.
వీరి ప్రయత్నాలు ఆదిలోనే సత్ఫాలితాలు ఇవ్వడంతో.. మంగాయమ్మ (Mangayamma) గర్భం దాల్చడం జరిగింది. అయితే ఇందులో విశేషమేమిటంటే – ఆమెకి కవలలు పుట్టడం. దీనితో ఈ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. గర్భం ధరించాక.. మంగాయమ్మ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకున్న వైద్యులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆమె నవమాసాల పాటు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూశారు.
అవాంఛిత గర్భం రాకుండా చేసే.. ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు
అంతా అనుకున్నట్టుగానే జరిగి.. ఈరోజు గుంటూరులోని (Guntur) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 73 ఏళ్ళ మంగాయమ్మ ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చింది. దీంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ పద్థతి ద్వారా లేటు వయసులో మహిళలు..పిల్లలను కనడం తొలిసారేమీ కాదు. 2016లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన దల్ జిందర్ కౌర్ అనే 72 ఏళ్ళ మహిళ.. ఒక మగ బిడ్డకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే జన్మనివ్వడం జరిగింది. అయితే ఆ బిడ్డ ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. సాధారణంగా – 70 ఏళ్ళ వయసులో ఒక బిడ్డకి జన్మనిచ్చేంత శక్తి.. స్త్రీ శరీరానికి తక్కువగా ఉంటుందని అంటారు. బహుశా ఆమె బిడ్డకు అందుకే కాంప్లికేషన్స్ వచ్చి ఉండవచ్చు.
ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే, మంగాయమ్మ విషయంలో.. వైద్యులు అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందట. కానీ డెలివరీ జరిగాక.. తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక 73 ఏళ్ళ వయసులో.. ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనివ్వడాన్ని ప్రపంచ రికార్డుగా చెబుతున్నారు. ప్రపంచ రికార్డు విషయం పక్కన పెడితే.. దాదాపు 58 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ మంగాయమ్మ మాతృత్వంలోని ఆనందాన్ని చవిచూడడం విశేషం.
Featured Image: Pixabay
తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి