జయలలిత బయోపిక్‌లో.. నెచ్చెలి 'శశికళ'గా మెప్పించనున్న 'ప్రియమణి'

జయలలిత బయోపిక్‌లో.. నెచ్చెలి 'శశికళ'గా మెప్పించనున్న 'ప్రియమణి'

తలైవి (Thalaivi).. తమిళనాడును ఏలి.. ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న పురుచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న సినిమా ఇది. దర్శకుడు ఏ ఎల్ విజయ్ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో జయలలిత పాత్రలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న కథానాయిక కంగన నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.

ఈ సినిమా రూపొందుతున్న విషయం.. అలాగే కంగన అందులో కథానాయికగా ఎంపికైన విషయం గురించి చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఆ రోజు నుంచి అసలు జయలలిత దగ్గరి స్నేహితురాలు శశికళ పాత్రలో ఎవరు నటిస్తారో అన్న ఆలోచన అందరిలోనూ ఉండేది. ఈ క్రమంలో పలు ఊహాగానాలు కూడా వచ్చాయి.

కానీ ఎట్టకేలకు శశికళ పాత్రను పోషించే నటి పేరును బహిర్గతం చేశారు దర్శకుడు ఏ ఎల్ విజయ్. ఆమె కూడా ఓ జాతీయ పురస్కారం అందుకున్న నటే కావడం విశేషం. తను మరెవరో కాదు.. యమ దొంగ, పెళ్లైన కొత్తలో, శంభో శివ శంభో వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక ప్రియమణి (Priyamani). 2016లో విడుదలైన 'మన ఊరి రామాయణం' చిత్రం తర్వాత ఆమె ఇప్పటి వరకూ తెలుగులో నటించలేదు.

ఇప్పుడు 'తలైవి' చిత్రంలో మాత్రం ఈ కాంట్రవర్షియల్ పాత్రలో ప్రియమణి కనిపించనుందన్నమాట. ప్రియమణి నటన గురించి తెలిసిన దర్శకుడు విజయ్.. శశికళ పాత్రకు ఆమె చక్కటి ఎంపిక అని భావించారట. నిర్మాత విష్ణు ఇందూరి ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. కనుక ఈ మూడు భాషలు తెలిసిన కథానాయికతో పాటు.. తన పాత్రలో భారతీయతను చూపించగలిగే హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ వెతికారట. ఈ క్రమంలో వారు అనుకున్నవన్నీ.. ప్రియమణిలో కనిపించడంతో ఆమెను ఎంచుకున్నారని వినికిడి.

ప్రియమణి ఈ పాత్రకు తన సొంత స్టైల్‌తో జీవం పోస్తుందని దర్శకుడు విజయ్ భావించి ఆమెను సంప్రదించారట. ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్ కావడం వల్ల.. దాన్ని చేయడానికి వెంటనే ఒప్పుకుందట ప్రియమణి. ఇక ఈ సినిమాలో నటించేందుకు ఎప్పుడెప్పుడా? అని వేచి చూస్తున్నానని చెబుతోంది ప్రియమణి. శశికళ జయలలితకు చాలా దగ్గరి వ్యక్తి. ఆమె వ్యక్తిగత జీవితంపై శశికళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 

అందుకే ఈ సినిమాలో ప్రియమణి పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మరో ముఖ్యమైన ఎంజీఆర్ పాత్రకి గాను అరవింద్ స్వామిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అలాగే తన తాత పాత్ర పోషించేందుకుగాను జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించగా.. ఆయన 'నో' చెప్పారని టాక్. మొత్తంగా ఇటు సౌత్ ఇండియాతో పాటు.. అటు బాలీవుడ్‌లో కూడా పాపులర్ అయిన వ్యక్తులనే.. సినిమాకి ఎంచుకుంటూ సినిమాపై మరింత క్రేజ్ పెంచుతున్నారు దర్శక నిర్మాతలు.

తాజాగా కంగన పుట్టిన రోజు సందర్భంగా 'తలైవి' చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది అతి పెద్ద జయలలిత కటౌట్‌లా కనిపిస్తోంది. అయితే ఇందులో కంగన ముఖం జయలలితలా లావుగా కనిపించేందుకు.. ప్రోస్థటిక్ మేకప్ ఉపయోగించారని.. ఈ మేకప్ వల్ల ఆమె ముఖం చూసేందుకు మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తోందంటూ కామెంట్లు వచ్చాయి. ఆకుపచ్చ రంగు చీరతో జయలలిత సిగ్నేచర్ విక్టరీ సైన్‌ని చూపుతూ ఉన్న ఈ పోస్టర్‌కి మంచి స్పందనే లభించింది.

ఇక మిగిలిన వారి పాత్రలను అభిమానులు ఎలా స్వీకరిస్తారో కూడా వేచిచూడాల్సిన విషయమే. మనందరికీ తెలిసిన లెజెండ్ జీవితం గురించి ఎవరికీ తెలియని కథ అంటూ చెప్పుకొస్తున్న ఈ సినిమా.. జయలలిత జీవితానికి సంబంధించి ఎలాంటి నిజాలను బయటపెడుతుంది? ఆమె చనిపోవడానికి ముందు ఏం జరిగిందన్న విషయం ఈ సినిమాలో చూపిస్తారా? అన్న సందేహాలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. అయితే వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే మాత్రం వచ్చే ఏడాది జూన్ 26 వరకూ ఆగాల్సిందే. ఈ సినిమా విడుదలయ్యేది అప్పుడే మరి..

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.