ఈ సంవత్సరపు సెక్సీయెస్ట్ ఉమన్ 'అలియా భట్'... రెండో స్థానంతో సరిపెట్టుకున్న 'దీపిక' ..!

ఈ సంవత్సరపు సెక్సీయెస్ట్ ఉమన్ 'అలియా భట్'... రెండో స్థానంతో సరిపెట్టుకున్న 'దీపిక' ..!

ఈస్టర్న్ ఐ.. యూకేకి చెందిన ప్రఖ్యాత పత్రిక. ఈ పత్రిక ప్రతి ఏడాది ముగింపులో.. ఆ సంవత్సరానికి సంబంధించి వివిధ రంగాలలో గుర్తింపు పొందిన వ్యక్తుల జాబితాలను విడుదల చేస్తుంది. అందులో వినోద రంగం కూడా ఒకటి.  ఈ రంగానికి సంబంధించి ఈస్టర్న్ ఐ తరఫున ప్రతి ఏటా.. సెక్సీయెస్ట్ మేల్, సెక్సీయెస్ట్ ఫీమేల్ కేటగిరీలలో టాపర్ల లిస్టును విడుదల చేయడం ఆనవాయతీగా వస్తోంది. ఇటీవలే సెక్సీయెస్ట్ ఏషియన్ మేల్ జాబితాను విడుదల చేసిందీ పత్రిక. అందులో..

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నంబర్ 1 స్థానంలో నిలవగా.. షాహిద్ కపూర్, హిందీ టీవీ స్టార్ వివియన్ డిసేనా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా ఈ పత్రిక సెక్సీయెస్ట్ ఏషియల్ ఫీమేల్ (Sexiest Asian Female) జాబితాను కూడా విడుదల చేసింది.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న దీపికను (Deepika Padukone) వెనక్కి నెట్టి.. ఈ ఏడాది మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది అందాల అలియా భట్ (Alia Bhatt). 

గత సంవత్సరం వరకూ ఈ లిస్టులో టాప్ స్థానంలో ఉన్న దీపిక.. ఈ ఏడాది 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక 3వ స్థానంలో హిందీ టీవీ తార హీనా ఖాన్.. 4వ స్థానంలో పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ నిలవడం విశేషం. ఇక 5వ స్థానంలోనూ మరో టీవీ నటి సురభి చందన నిలవడం అనేది.. టీవీ నటీమణులకు ఉండే ఫాలోయింగ్‌ని వివరిస్తోంది. అలాగే 6వ స్థానంలో కత్రినా కైఫ్ నిలవగా.. 7, 8 స్థానాల్లోనూ టీవీ నటులు శివాంగీ జోషి, నియా శర్మ నిలిచారు.

పాకిస్థానీ నటి మెహ్విష్ హయత్ 9వ స్థానంలో నిలవగా.. గ్లోబల్ స్టార్ ప్రియాంక 10వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో టాప్ 50 జాబితాలో ఉన్న భారతీయుల వివరాలను ఒకసారి చూస్తే.. భారతీయ అమెరికన్ యూట్యూబ్ సంచలనం లిల్లీ సింగ్ 14వ స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో మొదటిసారి అడుగుపెట్టిన వారిలో ఆమెదే అత్యధిక స్థానం అని చెప్పుకోవచ్చు. అలాగే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' సినిమాతో ఆకట్టుకున్న అనన్యా పాండే 36 స్థానాన్ని సంపాదించుకుంది. ఇక అందాల నటి ఐశ్వర్యా రాయ్ ఈ జాబితాలో 39వ స్థానంలో నిలవడం గమనార్హం.

ఇక తను మొదటి స్థానంలో నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఓట్లు వేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది అలియా. 'నేను నిజమైన అందం అంటే కేవలం కంటికి కనిపించేది మాత్రమే కాదు.. మనసుకి కనిపించేదని ఎప్పటి నుంచో నమ్ముతాను. ఇప్పుడు అది నిజమని నా అభిమానులు నిరూపించారు. మన వయసు పెరుగుతుంది. శరీరం మారుతుంది. కానీ మంచి మనసు మాత్రం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. అదే మనల్ని ఎప్పటికీ అందంగా ఉండేలా చూపుతుంది. అందుకే దాని గురించే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది' అని చెప్పుకొచ్చింది అందాల అలియా.

'అలియా స్త్రీ శక్తికి మాత్రమే కాదు.. నేటి తరం అమ్మాయిలకు ప్రతినిధి' అని ఈస్టర్న్ ఐ మ్యాగజైన్ వ్యాఖ్యానించడం విశేషం. సెక్సియెస్ట్ పాకిస్థానీగా ఈ లిస్టులో 4వ స్థానంలో నిలిచిన మహిరా ఖాన్ మాట్లాడుతూ ' ప్రతి సంవత్సరం ఓట్లు వేసి.. నన్ను పాకిస్థాన్‌లోనే మొదటి స్థానంలో నిలుపుతున్న నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ దశాబ్దం పాటు నా ఎత్తుపల్లాలు, నా అభిమానులు అందించిన సపోర్ట్ అన్నింటికీ ఇది ఓ నిదర్శనం' అంటూ చెప్పుకొచ్చింది.

కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే కాదు.. ఈ దశాబ్దానికి కూడా 'సెక్సీయెస్ట్ ఏషియన్ ఫీమేల్ లిస్ట్'ని ఈస్టర్న్ ఐ విడుదల చేసింది. 2019తో ఈ దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా.. ఈ దశాబ్దంలోనే 'సెక్సీయెస్ట్ పీపుల్'గా పేరొందిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది.

ఇందులో దీపిక మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా.. రెండో స్థానంలో ప్రియాంకా చోప్రా, మూడో స్థానంలో మహిరా ఖాన్, నాలుగో స్థానంలో కత్రినా కైఫ్, ఐదో స్థానంలో టీవీ నటి ద్రష్టి ధామి నిలవడం గమనార్హం.ఈ జాబితాలో ఫ్రిదా పింటో, అలియా భట్‌లు ఆరు, ఏడు స్థానాల్లో నిలవగా.. బాహుబలితో అందరి చూపు తన వైపు తిప్పుకున్న అనుష్క ఎనిమిదో స్థానంలో నిలిచింది. టీవీ నటి నియా శర్మ తొమ్మిదో స్థానంలో నిలవగా.. సోనమ్ కపూర్ పదో స్థానంలో నిలిచింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.