Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, రాహుల్, వరుణ్‌.. వీరిలో హౌస్ కొత్త కెప్టెన్ ఎవరు?

Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, రాహుల్, వరుణ్‌.. వీరిలో హౌస్ కొత్త కెప్టెన్ ఎవరు?

"బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3"లో (Bigg Boss Telugu) ప్రస్తుతం ఆరో వారం నడుస్తోంది. ఇప్పటివరకు ఇంటి నుంచి 5 సభ్యులు వెళ్లిపోయారు. ఇంకా ఇంటిలో 11 మంది సభ్యులు బిగ్‌బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇక ఈ సీజన్ ఆరో వారానికి చేరుకున్నప్పటికీ.. ఇప్పటివరకు బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా కేవలం ముగ్గురుని మాత్రమే ఎంపిక చేశారు. వారే - వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతి.

బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?

అయితే ఈ రోజు ఎపిసోడ్‌లో ఇంటికి మరో కొత్త కెప్టెన్ రానున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ బీబీ ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా ఇచ్చిన టాస్క్‌లో బాగా పెర్ఫార్మ్ చేసిన ముగ్గురు సభ్యుల పేర్లని ఇంటి సభ్యులంతా ఏకగ్రీవంగా చెప్పమని బిగ్‌బాస్ కోరారు. దాంతో రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌ల పేర్లను ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌కి సూచించారు. ఈ ముగ్గురు సభ్యులకూ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించి అందులో గెలిచిన వారిని ఇంటి కొత్త కెప్టెన్‌గా ప్రకటించనున్నారు బిగ్‌బాస్.

ఇక ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ పేరుని - మట్టిలో ఉక్కు మనిషిగా చెప్పడం జరిగింది. ఈ ముగ్గురికీ మట్టిలో ఉన్న రంగు రాళ్ళని వెలికి తీయడాన్ని టాస్క్‌గా ఇవ్వనున్నారు బిగ్‌బాస్. ఈ తరుణంలో ఇంటికి కొత్త కెప్టెన్‌‌గా.. ఈ ముగ్గురిలో ఎవరు ఎంపికవుతారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే ఒకసారి వరుణ్ సందేశ్ ఇంటి కెప్టెన్ అయిన కారణంగా... రాహుల్, బాబా భాస్కర్‌లలో ఎవరు కెప్టెన్ అయినా.. వారు తొలిసారిగా కెప్టెన్ అయినట్టే లెక్క. ఈ రోజు టాస్క్‌లో గెలిచిన వారు హౌస్‌కి కెప్టెన్ అవ్వడమే కాకుండా.. వచ్చే వారం నామినేషన్స్ నుండి కూడా సేఫ్ అవ్వొచ్చు.

ఇదిలావుండగా.. మొన్న మొదలైన బీబీ ఎక్స్‌ప్రెస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిన్నటి వరకు కొనసాగింది. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులంతా కలిసి ఫన్నీగా చేసిన 'ఎర్రగడ్డలో ప్రేమకథ' సినిమా షూటింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే సమయంలో బాబా భాస్కర్ ఈ టాస్క్‌లో దర్శకుడిగా.. అందరిచేత నవ్వుల పువ్వులు పూయించాడనే చెప్పాలి.

ఇక ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో షూటింగ్‌తో పాటుగా; చిన్న చిన్న టాస్క్‌లు కూడా ఇవ్వడం జరిగింది. అవేంటంటే - స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న బొమ్మ చేపలను బయట ఉన్న బుట్టలో వేయడం, లస్సీ తాగడం, యాపిల్స్‌ని నోటితో తీసి బాస్కెట్‌లో వేయడం, ముత్యాలను దండలుగా గుచ్చడం, వేగంగా కొబ్బరి పీచు తీయడం.. వంటి వాటిలో కూడా ఇంటి సభ్యులు సరదాగా పాల్గొన్నారు.

బిగ్ బాస్‌తో డీల్ కుదుర్చుకున్న వరుణ్, రాహుల్, రవికృష్ణ

ఈ టాస్క్‌లలో బాబా భాస్కర్, మహేష్ విట్టా రెండేసి గెలవగా.. రవికృష్ణ, అలీ రెజాలు చెరొక గేమ్‌లో గెలిచారు. వీటిని అనుసరించే బాబా భాస్కర్‌ని లగ్జరీ టాస్క్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇంటి సభ్యుడిగా ఎంపిక చేశారు. మరి, ఈ రోజు బిగ్‌బాస్ హౌస్‌లో జరిగే కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు గెలవనున్నారు?? లగ్జరీ బడ్జెట్ టాస్క్ మాదిరిగానే ఇందులో కూడా బాబా భాస్కర్ మాస్టర్ విజయం సాధిస్తారా?? ఇంటికి కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారా??

చూద్దాం.. ఏం జరుగుతుందో.. బిగ్ బాస్ షోలో ప్రతి ఎపిసోడ్ దేనికదే ప్రత్యేకం కదా.. అందులోనూ ఈ వారాంతం కూడా వచ్చేసింది.. మరి, బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఏం ఆర్డర్స్ జారీ చేస్తారో అని కూడా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏదేమైనా.. "బిగ్‌బాస్ సీజన్ 3"లో ప్రస్తుతం ఉన్న సభ్యులంతా కూడా టైటిల్‌ని సాధించే సత్తా కలిగిన వారే కావడంతో.. రోజురోజుకీ అందరి మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో నేడు జరగనున్న కెప్టెన్సీ టాస్క్ ఇంటి వాతావరణాన్ని ఎంతమేర మార్చనుందో చూడాలి.

బిగ్‌బాస్ ఇంటిలో సీక్రెట్ వీడియోస్ రేపిన చిచ్చు!