అర్జునుడికి పక్షి కన్ను కనిపిస్తే.. వీరికి కనిపించేది 'సాండ్ కీ ఆంఖ్' మాత్రమే..!

అర్జునుడికి పక్షి కన్ను కనిపిస్తే.. వీరికి కనిపించేది 'సాండ్ కీ ఆంఖ్' మాత్రమే..!

సాండ్ కీ ఆంఖ్ (Saand Ki Aankh).. భూమి పెడ్నేకర్ (Bhoomi pednekar) తాప్సీ (Tapsee) ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అటు స్పూర్తిని కూడా అందించే సినిమా ఇది అని ఈ చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్ పాట్ జిల్లాకి చెందిన చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ల కథతో ఈ చిత్రం రూపొందుతోంది. వీరిద్దరూ ప్రపంచంలో అత్యధిక వయసున్న షార్ప్ షూటర్లుగా పేరు సాధించారు. 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత షూటింగ్‌లోకి అడుగుపెట్టిన వీరిద్దరూ.. తాము పాల్గొన్న 30 ఛాంపియన్‌షిప్స్‌లోనూ విజయం సాధించారు.

తాజాగా ఆగస్టు 29 తేదిన 'నేషనల్ స్పోర్ట్స్ డే' సందర్భంగా ఈ సినిమాకి చెందిన టీజర్‌ని విడుదల చేసిందీ చిత్ర యూనిట్. ఈ టీజర్‌లో భాగంగా కుటుంబ కట్టుబాట్ల ప్రకారం కనీసం ముఖంపై చీర కొంగును తీయడానికి కూడా ఒప్పుకోని కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు.. అరవైల్లో తమకు ఇష్టమైన షూటింగ్‌లో కెరీర్‌ని ఎలా ప్రారంభించారు.. దీని కోసం వారు కుటుంబం, సమాజం నుంచి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. వంటివన్నీ చూపించారు.

టీజర్‌లో భాగంగా 'పక్షి కన్ను చూసేందుకు మేం అర్జునులం కాదు.. మాకు కనిపించేది సాండ్ కీ ఆంఖ్ (బుల్స్ ఐ) మాత్రమే' అంటూ షూటింగ్ టార్గెట్‌పై తమకున్న అంకితభావాన్ని తెలిపేలా చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో చంద్రో, ప్రకాశీల చిన్నతనం నుంచి ఇప్పటివరకూ జరిగిన సంఘటనలను చూపించారట. ఈ సందర్భంగా తాప్సీ, భూమి.. ఇద్దరూ ఈ సినిమా గురించి, ఇందులో షూటర్ దాదీ, రివాల్వర్ దాదీలుగా కనిపించడం గురించి మాట్లాడారు.

Instagram

ఈ సందర్భంగా చంద్రో తోమర్ పాత్రలో కనిపించిన భూమి  మాట్లాడుతూ.. "షార్ప్ షూటింగ్ అనేది చాలా ఆసక్తికరమైన ఆట. చంద్రో తోమర్ పాత్రలో కనిపించడం నాకు ఈ ఆట గురించి చాలా నేర్పింది. నేను మీరట్‌లోని ఈ గ్రామంలో నివసిస్తున్న చాలామందితో మాట్లాడాను. అక్కడ ప్రతిఒక్కరూ షార్ప్ షూటింగ్ పట్ల ఎంతటి ఆసక్తి చూపిస్తున్నారో వారి మాటలను బట్టి అర్థం చేసుకున్నా. వాళ్లందరూ ఈ ఆటలో రాణించేందుకు చాలా కష్టపడతారు. వారి కష్టం చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రస్తుతం మన దేశంలో ఈ ఆట పట్ల ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఒకరిని చూసి మరొకరుగా చాలామంది టాలెంట్ ఉన్న క్రీడాకారులు ఈ రంగంలోకి అడుగుపెట్టాలని నేను కోరుకుంటున్నా" అని తెలిపారు. 

Instagram

మరోవైపు ప్రకాశీ తోమర్ పాత్రలో కనిపించిన తాప్సీ మాట్లాడుతూ.. "అన్ని కష్టాలను ఎదుర్కొని తమ వైపుగా వచ్చిన ఇబ్బందులన్నింటినీ దాటుకొని ముందుకెళ్లారు ఈ బామ్మలు. తుపాకీ పట్టుకొని తమదైన రీతిలో ముందుకెళ్లి పేరు ప్రఖ్యాతలు సాధించిన వ్యక్తులు వీళ్లు. వయసుతో సంబంధం లేదనుకుంటూ వారు సాధించిన ఈ విజయాలు ఎందరికో స్పూర్తిని అందిస్తాయి. ఈ షూటింగ్ సమయంలో నేను వారితో పాటు.. వారి ఇంట్లోనే ఉన్నా. వాళ్లు తాము రాణించడంతో పాటు తమలాంటివారిని ప్రోత్సహించడం కూడా నేను గమనించాను.

పల్లెటూరిలో పుట్టి పెరిగినా ఈ ఇద్దరు భారతీయ మహిళలు.. ఎందులోనూ ఎవరికీ తక్కువ కారు అని నిరూపించారు. ఏ రంగంలోనైనా ముందుకు సాగాలంటే పట్టుదల, సంకల్పం, తాము కన్న కల కోసం ప్రపంచంతో పోరాడడం.. వంటివి ఎంతో ముఖ్యం అని వారిని చూసి నేను నేర్చుకున్నా. అలా చేస్తే ఎవరైనా సరే.. అనుకున్నది సాధించగలరు అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.

తుషార్ హీరానందానీ దర్శకత్వంలో.. అనురాగ్ కశ్యప్ సహ నిర్మాతగా రూపొందిన ఈ "సాండ్ కీ ఆంఖ్" సినిమా ఈ ఏడాది అక్టోబర్ 25న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.