Director Bhagyaraj gets slammed for comments on Crime against Women
భాగ్యరాజ్ .. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోగా, దర్శకుడిగా పేరు సంపాదించిన వ్యక్తి. తాజాగా కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన ‘సీత’ సినిమాలో.. కథానాయిక తండ్రి పాత్రలో కూడా కనిపించారాయన. తాజాగా ఓ తమిళ సినిమా ఆడియా రిలీజ్ వేడుకలో పాల్గొన్న భాగ్యరాజ్.. స్త్రీల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్లు, మహిళా సంఘాల సభ్యులు ఆయనపై ఫైర్ అవుతున్నారు.
‘కరుత్తుగలై పదివుసెయ్’ అనే తమిళ సినిమా ఆడియో విడుదల వేడుకకు అతిథిగా హాజరైన భాగ్యరాజ్.. ఆ కార్యక్రమంలో ప్రసంగించారు. రాహుల్ పరమహంస దర్శకత్వంలో ఆర్యన్, ఉపాసనలు జంటగా నటించిన ఈ సినిమా పొల్లాచ్చి సెక్స్ స్కామ్ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా పాటల వేడుకలో భాగంగా మాట్లాడిన భాగ్యరాజ్ ‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు పూర్తిగా మగవారిదే బాధ్యత అని చెప్పలేమని.. ఇందులో మహిళల తప్పు కూడా ఉందని’ చెప్పడం వివాదానికి దారి తీసింది. మహిళలపై జరుగుతున్న నేరాలు.. ముఖ్యంగా లైంగిక వేధింపులు వారు సరైన పద్ధతిలో వ్యవహరించకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
‘సెల్‌ఫోన్ రాక ముందు మహిళలు కంట్రోల్‌లో ఉండేవారు. సంప్రదాయబద్ధంగా, కట్టుబాట్లతో జీవించేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారు. ఇది చెప్పడం నాకే బాధ కలిగిస్తోంది. కానీ ఎక్కడ చూసినా మహిళలు ఫోన్లు మాట్లాడుతూనే కనిపిస్తున్నారు. రోడ్లపై కూడా ఫోన్ మాట్లాడుతున్నారు. అంత సేపు ఏం మాట్లాడుతుంటారా? అని నాకు అనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల రక్షణ కోసం వారికి ఫోన్ కొనిస్తారు. కానీ అమ్మాయిలు ఆ ఫోన్‌లో ఎంతమందితో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.. అందుకే తమపై జరిగే లైంగిక దాడులకు మహిళలే కారణం.
కేవలం మగవారిని మాత్రమే తప్పుబట్టడం సరికాదు. ఇక పొల్లాచ్చి కేసు విషయానికి వస్తే.. ఆ కేసులో బాధితులైన మహిళలు నైతికంగా తమపై జరిగిన లైంగిక దాడులకు తామే కారణం. వారు చనువు ఇస్తేనే కదా పురుషులు తప్పు చేస్తున్నారు. సూదిలో రంధ్రం ఉంటేనే కదా దారం ఎక్కుతుంది.. అంటూ మహిళలే తమ వ్యవహార శైలితో తప్పులకు కారణమవుతున్నారని’ భాగ్యరాజ్ చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. వివాహేతర సంబంధాల గురించి కూడా భాగ్యరాజ్ మాట్లాడారు. “ఒకవేళ పురుషులు ఎవరైనా మహిళలతో సంబంధం పెట్టుకుంటే.. ఆమెను ఆనందంగా చూసుకోవడంతో పాటు తన భార్యా,పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ ఒకవేళ మహిళలు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మాత్రం.. తమ భర్త, పిల్లలను చంపి ప్రియుడి దగ్గరికే వెళ్లిపోవాలి అని భావిస్తారు. అందుకే మహిళలు కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది. నా సినిమాల్లో స్వశక్తితో ఎదిగిన ఎంతోమంది మహిళలు కనిపిస్తారు. అయితే నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. నాకు ఇలాంటివన్నీ తెలియవు కాబట్టే.. అలాంటి సినిమాలు చేశాను” అంటూ ఆయన చెప్పారు. బెంగళూరులో జరిగిన వేడుకలో భాగ్యరాజ్ మాట్లాడుతుండగా.. అందరూ చప్పట్లు కొడుతూ.. ఈలలు వేస్తూ ఈ మాటలకు స్పందించడం గమనార్హం.
ప్రస్తుతం భాగ్యరాజ్ మాటలపై మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు.. నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. భాగ్యరాజ్ లాంటి పెద్ద దర్శకుడు ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెబుతున్నారు. ‘భాగ్యరాజ్ భార్య, కూతురు, కోడలుకి కూడా ఇలా చెప్పగలరా?’ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
“ప్రస్తుతం ఎన్నో రంగాల్లో మహిళలు గ్లాస్ సీలింగ్‌ని బద్దలు కొడుతున్నారు. సినిమాల్లో కూడా ఎంతోమంది మహిళలు ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్నారు. కానీ భాగ్యరాజ్ లాంటివాళ్లు మాత్రం ఇలాంటి కామెంట్లతో తమ బుద్ధి బయట పెట్టుకుంటున్నారు” అంటూ కొందరు మహిళలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భాగ్యరాజ్ వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడులోని మహిళా సంఘాలు నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించాయి. మహిళల సమస్యలపై గళం విప్పే గాయని చిన్మయి కూడా ఇదే అంశం పై స్పందించారు.
‘కొన్నిసార్లు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న పురుషులు కూడా రేప్ లాంటి అంశాలపై ఇలాంటి మాటలు మాట్లాడడం.. అందుకు మహిళలను కారణంగా చూపడం విచారకరం. ఇలాంటివి మాట్లాడడం సబబు కాదని చెప్పడం కూడా చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. నిజానికి తమపై జరిగే ఘోరాల వల్ల అమ్మాయిలు చనిపోవడం లేదు. నిరంతరం ఎవరో ఒకరు ఇలాంటి వ్యాఖ్యలనే చేస్తూ ఉండడం వల్ల అమ్మాయిలు చనిపోతున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.
సమాజంలో ఉన్నత స్థానంలో ఉండే భాగ్యరాజ్ లాంటి వారు ఇలాంటి కామెంట్లు చేస్తూ స్త్రీలను చిన్న చూపు చూడడం, అక్రమ సంబంధాలను వెనకేసుకురావడం విచారకరమని ఈ సందర్భంగా తెలిపారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.