ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట

అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట

నీలిమ పూదోట.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి అమ్మాయి. ‘ఫ్రం ఎవరెస్ట్ విత్ లవ్’ పుస్తక రచయిత. పింకథాన్ అంబాసిడర్. యోగా ట్రైనర్. ఆమె ప్రత్యేకత అంతేనా? కానే కాదు.. ఆమె గురించి తెలుసుకోవాలంటే.. ఆమె మాటల్లోని లోతుల్లోకి దిగి తెలుసుకోవాల్సిందే. వ‌ర్తమాన అంశాల‌కు సంబంధించి నిర్మొహమాటంగా, నిజాయతీగా ఆమె వెలిబుచ్చే ప్ర‌తి అభిప్రాయం మన చెంప మీద చాచి కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే.. తను మాట్లాడే ప్రతి మాట వాస్తవమే. అవి మన సమాజం అసలు సిసలు ముఖాన్ని మనకు చూపిస్తాయి. అలా మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. ధైర్యమే కాదు నీలిమకు తెగువ కూడా ఉంది. ‘మహిళా దినోత్సవం సందర్భంగా మీ ఇంటర్వ్యూ కావాలండి’ అని అడిగితే..  నిర్మొహమాటంగా ‘ఒక్క రోజు సెలబ్రేషన్స్ నాకు ఇష్టం ఉండవండి’ అని చెప్పారు.

నిజమే కదా.. ఏడాదిలో ఒక్క రోజు మహిళా దినోత్సవం అని చెప్పి.. మహిళలు అంత గొప్ప.. ఇంత గొప్ప అని చెప్పేస్తే సరిపోదు కదా.. ఆ మాటలు ఆచరణలో చూపించాలి. నిజంగా మహిళలు సాధికారత సాధించాలంటే.. ప్రత్యేకించి ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. వారిని వెనక్కి లాగకుండా ఉంటే చాలు. ఎవరెస్ట్, కిలిమంజారో, కాంగ్రి, మీరా వంటి పర్వతశిఖరాలను అధిరోహించడమే కాకుండా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం 350 కి.మీ. కాలికి చెప్పులు లేకుండా నడిచిన నీలిమ మాటల్లోని ధైర్యం, స్ప‌ష్ట‌త‌.. నన్ను మరింత ఆకర్షించాయి. అంతేకాదు.. మహిళా దినోత్సవానికి నేను సరైన వ్యక్తినే ఇంటర్వ్యూ చేస్తున్నాననే తృప్తినిచ్చింది.

1-neelima-pudota

మహిళా దినోత్సవం గురించి  మీ అభిప్రాయం చెప్పమంటే.. నీలిమ ఏమన్నారో తెలుసా? ‘ఏడాదిలో ఒక్క రోజు అమ్మాయిలను ఆకాశానికి ఎత్తేసి ఆ మర్నాడే వారిని పక్కన పడేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకొంటున్నారో ఎంతమందికి తెలుసు? అమ్మాయిల కోసం ఎవరూ ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. వారిని మనుషులగా చూడండి. సరిపోతుంది. అబ్బాయిలు.. అమ్మాయిలు సమానమని తెలుసుకొంటే చాలు’ అంటారు నీలిమ.

ADVERTISEMENT

నిజమే కదా.. ఆడ‌పిల్ల‌లు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరు వారిపై ఆధిపత్యం చెలాయించడానికే చూస్తారు. తినే తిండి నుంచి కట్టుకొనే బట్ట వరకు.. చదివే కోర్సు నుంచి చేసే ఉద్యోగం వరకు మరొకరు ఆమెకు దిశానిర్దేశం చేయాలని ప్రయత్నిస్తుంటారు. ‘వారిని కాదని ఆ అమ్మాయి తన పని తాను చేసుకొంటే.. తన ఇష్టాన్ని చేరుకొనే ప్రయత్నం చేస్తే.. ఆమెను కిందకి లాగడానికే ప్రయత్నిస్తార’ని నీలిమ తెలిపారు.

ఈ కాలంలో కూడా.. అమ్మాయిల విషయంలో.. కొంత వయసు వచ్చాక.. తొలుత  పెళ్లి చేసేయాలనే చూస్తారు తల్లిదండ్రులు. ఒకవేళ వారు ఏ మాత్రం ఆలస్యం చేసినా చుట్టుపక్కల వారు ర‌క‌ర‌కాలుగా వారిని ఎత్తి చూపుతుంటారు. పెళ్లయిపోగానే.. “హమ్మయ్య  మా అమ్మాయికి పెళ్లి చేసేశాం. ఇక గుండెలపై కుంపటి చల్లారిపోయింది” అని అనుకొంటారు. అదే అమ్మాయి ‘నేను పెళ్లి చేసుకోను’ అంటే చాలు ఆమె మనసుని గాయపరిచేలా మాట్లాడుతుంటారు.

ఈ విషయం నీలిమ దగ్గర ప్రస్తావిస్తే.. అమ్మాయికి పెళ్లి అవసరమే లేదంటారామె. ‘అమ్మాయిలు శక్తిమంతులు. వారు ఏ పనైనా చేయగలరు. దేని కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ అబ్బాయిలు అలా కాదు. ఏదో సంపాదించి తెస్తున్నామని గొప్పలు పోతారు కానీ.. ఇంట్లో ఏది కావాలన్నా అమ్మానాన్నలపై ఆధారపడతారు. నేను పెళ్లి చేసుకోను అని ఎవరైనా అంటే.. ఆ అమ్మాయి ర్యాడికల్‌గా ఉందంటారే తప్ప.. తనకు నచ్చినట్టు జీవిస్తుందని అనుకోరు. అది ఆ అమ్మాయి ఇష్టమని సరిపెట్టుకోరు’.

4-neelima-pudota

ADVERTISEMENT

సాధికారత ఒకరు ఇస్తే మనకు వచ్చేది కాదు. అది మనంతట మనమే సాధించుకోవాలి. అలా చేయాలంటే.. మనం అనుకొన్న పని ఎంత కష్టమైనా చేయాల్సిందే. నలుగురికీ భిన్నంగా ఓ అమ్మాయి తన ప్రయాణం కొనసాగిస్తోందంటే.. ఆమె నడిచే దారిలో ముళ్లు వేయాలని చూస్తారు. కొన్ని సందర్భాల్లో అవి మనల్ని బాధపెడతాయి. అయినవాళ్లు సైతం అలాగే ఉంటే.. ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది.

‘మనం మాత్రం ఎంత వరకు పోరాడతాం. పోరాడి పోరాడి అలసిపోతాం. లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేయాలనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితే మీకెదురయితే… ముందు మిమ్మల్ని వెనక్కి లాగేవారికి దూరంగా ఉండండి. మీలా ఆలోచించేవారికి దగ్గరగా ఉండండి. వారితో సమయాన్ని గడపండి. అప్పుడే మీరు కోరుకొన్నది సాధించగలుగుతారు’ అని చెబుతారు నీలిమ.

అమ్మాయిలు ఎలాంటి పరిస్థితిల్లో నివసిస్తున్నారో వివ‌రించ‌డానికి తనకెదురైన అనుభవాలనే ఉదాహరణగా చెబుతారు నీలిమ. ‘రొమ్ము క్యాన్సర్ అవగాహన కోసం నేను విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కి.మీ. బేర్ ఫుట్ తో పరిగెత్తా. విజయవాడలో నా పరుగు ప్రారంభించినప్పుడు నన్ను మెచ్చుకొన్నవారిలో అబ్బాయిలు కూడా ఉన్నారు. అదే రోజు విజయవాడ శివారు ప్రాంతానికి చేరుకొనే సరికి నన్ను వేధించడానికి చూసిన వారు కూడా ఉన్నారు. అప్పుడు నా వెంట నా టీం ఉంది. వారి వల్ల నేను సేఫ్‌గా ఉండగలిగాను. వారే నా వెంట లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది?’ అంతేకాదు మన దేశంలో అమ్మాయిల సంరక్షణ కోసం ఎన్నో చట్టాలున్నా వాటి అమలు సరిగ్గా లేదంటారు నీలిమ. 

ఒక‌ర‌కంగా చెప్పాలంటే అది నిజమే. ‘అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే.. న్యాయం చేయాల్సిన‌ చట్టాలు సైతం సరిగ్గా అమలవ్వవు. వాటిలో ఉన్న‌ లొసుగులు నేరస్థులకు బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే.. ఇక అమ్మాయిలకు సురక్షితమైన వాతావరణం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నిస్తున్నారు

ADVERTISEMENT

2-neelima-pudota

ఆమె చెప్పిన వాటిల్లో నన్ను ఆకర్షించిన.. కాదు కాదు నన్ను ఆలోచింపచేసిన మరో మాట ‘ మన దేశాన్ని మాతృభూమి అనే కంటే పితృభూమి అనండి. సరిగ్గా సరిపోతుంది’ అని బోల్డ్‌గా తన మ‌న‌సులోని మాటను చెప్పారు. ఆమె చెప్పింది కరెక్టే. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు అలానే ఉన్నాయి. ‘పితృస్వామ్య భావ‌జాలం మన నరనరాల్లోనూ ఇంకిపోయి ఉంది. పురుషాధిక్యం మనల్ని అణగదొక్కుతోంది. దీనిలో మార్పు రావాలంటే చాలా సమయం పడుతుంది. ఆ మార్పు కోసం ప్రయత్నించిన వారిలో నేను సముద్రంలో నీటి బిందువు మాదిరిగానైనా చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉంది’ అని చెబుతారు నీలిమ.

Images: Neelima Pudota facebook

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

ఈ భూమి మీద అస‌లు మ‌హిళ‌ లేక‌పోతే.. ఎలా ఉంటుందో మీరు ఊహించ‌గ‌ల‌రా?

ఇంట్లో ఒంటరిగా ఉంటే.. అమ్మాయిలు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో తెలుసా?

రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..?

 

ADVERTISEMENT
03 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT