మేరా భారత్ మహాన్.. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నాకే కాదు.. గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులు వచ్చినప్పుడు అందరికీ ఇలాంటి మాటలు- పాటలు గుర్తు రావడం సహజమే. అంతేనా.. మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన దేశభక్తి ఉప్పొంగే తరుణం ఇది. ప్రస్తుతం అంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో అసలు ఈరోజుకి ఉన్న ప్రాధాన్యత గురించి ఎంతమందికి తెలుసు??
ఈ రోజుల్లో చాలామందికి ఇదొక సెలవు రోజు మాత్రమే. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి ఉక్కు సంకెళ్లలో బానిసలుగా బతికిన తర్వాత ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితంగా స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లభించాయి. వారిని మన దేశం నుంచి వెళ్లగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని రచించారు. ఈ రాజ్యాంగాన్ని 1950, జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారు. అందుకే ఏటా ఈ రోజుని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం.
ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ పర్వదినాన మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించిన మహానాయకులు, వారు చేసిన పోరాటాల గురించి పుస్తకాల్లో చదవడమో, సినిమాల్లో చూడడమో.. పాటల్లో వినడమో కాదు.. స్వయంగా మన కళ్లతో మనం వీక్షిస్తే మన మనసులో కలిగే భావన అనిర్వచనీయం. మరి, స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యాలుగా , అమరవీరుల త్యాగాలకు నిదర్శనంగా నిలిచిన అలాంటి కొన్ని చరిత్రాత్మక కట్టడాలు (Historical places) ఇవే..
జలియన్ వాలాబాగ్
పంజాబ్‌లోని అమృత్ సర్‌లో గల చరిత్రాత్మక ప్రదేశం ఇది. ఇదొక తోట. 1919, ఏప్రిల్ 13వ తేదిన పంజాబీ న్యూ ఇయర్ సందర్భంగా ఈ తోటలో శాంతియుతంగా సమావేశం అయిన ప్రజలను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి నిర్దాక్ష్యిణ్యంగా కాల్పులు జరిపాయి. ఈ ఉదంతంలో వందల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోగా; చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. దీనినే జలియన్ వాలాబాగ్ దురంతం అని కూడా అంటారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం 1951లో ఇక్కడ స్మారక స్థూపాన్ని స్థాపించారు. ఫలితంగా ఈ ప్రదేశం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఝాన్సీ కోట
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో కీలకంగా మారిన ఘట్టం అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి ఝాన్సీ రాజ్యాన్ని రక్షించే క్రమంలో రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన వీరోచిత పోరాటం, ఆ క్రమంలో ఆమె ప్రాణాలు విడిచన ఘట్టం.. మొదలైన సంఘటల గురించి ఆ కోట గోడలపై లిఖించారు. వాటిని చదవడం ద్వారా ఆ రోజుల్లో స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం ప్రజలు ఎంతగా పోరాడారో మన కళ్లకు కడుతుంది.
సబర్మతి ఆశ్రమం..
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ 1917లో సబర్మతీ నదీ తీరాన నిర్మించిన కట్టడం సబర్మతీ ఆశ్రమం. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో దీని పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆశ్రమాన్ని జాతిపిత స్మారకంగా భావిస్తున్నారు. మహాత్మునికి సంబంధించిన ఎన్నో చిత్రాలు, వస్తువులను ఇక్కడ మనం నేరుగా చూడవచ్చు.
ఎర్రకోట
దీనినే లాల్ ఖిలా అని కూడా అంటారు. 15వ శతాబ్దంలో దిల్లీలో చక్రవర్తి షాజహాన్ ఈ కోటను నిర్మించారు. మొఘలుల కాలం నాటి నుంచి భారతదేశ శక్తికి ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తొలిసారి ఎర్రకోటలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం మొట్టమొదటిసారి స్వాతంత్య్ర ఉద్యమం గురించి ప్రసంగించారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోటలో ప్రధాన మంత్రి జెండా ఎగురవేసి ఉపన్యసించడం ఆనవాయితీగా మారింది.
గాంధీ స్మృతి, దిల్లీ
న్యూ దిల్లీలో ఉన్న గాంధీ స్మృతినే బిర్లా హౌస్ లేదా బిర్లా భవన్ అని కూడా అంటారు. 1948, జనవరి 30న గాంధీజీ హత్య గావించబడిన ముందు వరకు 144 రోజుల పాటు ఆయన ఇక్కడే నివసించారు. ప్రస్తుతం దీనిని ఒక మ్యూజియంగా మార్చి ప్రజల సందర్శనార్థం అనుమతిస్తున్నారు.
అగా ఖాన్ ప్యాలెస్
1892లో 3వ ఇమామ్ సుల్తాన్ మహ్మద్ షా అగా ఖాన్ ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. స్వతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులను ఇందులో బంధించేవారు. స్వాతంత్య్రోద్యమంలో ముఖ్యమైన ఘట్టంగా భావించే క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో మహాత్మా గాంధీ, ఆయన సతీమణి కస్తూర్బా గాంధీని సైతం ఇందులో కొద్ది రోజుల పాటు బంధించి ఉంచారు.
Courtesy: Youtube, Instagram, Twitter
ఇవి కూడా చదవండి
“రిపబ్లిక్ డే” ప్రత్యేక కథనం: చరిత్రను తిరగరాసిన మన మహిళా దళాలు.. !
జయహో మహిళ… “నారీ శక్తి”కి అసలైన నిర్వచనం.. ఈ గణతంత్ర దినోత్సవం