home / Education
హిందీ తప్పనిసరి కాదంటూ తమిళంలో ట్వీట్ చేసిన కేంద్ర మంత్రులు..

హిందీ తప్పనిసరి కాదంటూ తమిళంలో ట్వీట్ చేసిన కేంద్ర మంత్రులు..

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ (Hindi) తప్పనిసరి నియమానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలో అక్కడక్కడా మాత్రమే నిరసనలు కనిపిస్తున్నా.. పక్కనే ఉన్న తమిళనాడు(Tamilnadu)లో మాత్రం ఇవి పెద్దఎత్తున కనిపిస్తున్నాయి. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దితే సహించేది లేదని పార్టీలన్నీ చెబుతున్నాయి. అయితే ఇవి కేవలం కమిటీ చేసిన సిఫార్సులేనని హిందీ మాత్రమే కాదు.. ఏ భాషనూ ఎవరిపై బలవంతంగా రుద్దేది లేదని ఈ రోజు ఇద్దరు మంత్రులు ట్వీట్ చేయడం విశేషం.

ప్రస్తుతం అమలులో ఉన్న విద్యావిధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు. 1992లో దానిలో కొన్ని మార్పులు- చేర్పులు చేశారు. మరో సరికొత్త విద్యావిధానాన్ని తీసుకురావడానికి ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరీ రంగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. తొమ్మిది మందితో కూడిన ఈ నిపుణుల కమిటీ మానవ వనరుల శాఖకు నివేదికను సమర్పించింది. దీని ప్రకారం దేశమంతా ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ఈ కమిటీ ప్రకటించింది. నిర్భంధ హిందీ అమలు చేయాలని చెప్పింది. ఇప్పటివరకూ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, పశ్చిమ బంగ, అసోం వంటి రాష్ట్రాల్లో హిందీ తప్పనిసరి అన్న నియమం లేదు. పాఠశాలలు తమ ఇష్టప్రకారం ఈ నిబంధనను పాటించే వీలుంటుంది.

ఈ కమిటీ నిబంధనలు కాదని చెప్పి.. కేంద్ర ప్రవేశపెట్టే ఈ త్రిభాషా విధానాన్ని తాము అనుమతించమని తమిళనాడుకి చెందిన మంత్రులు, విపక్ష నేతలు స్పష్టం చేశారు. హిందీని తమపై రుద్దడం సరికాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ట్విట్టర్ లోనూ  #HindiIsNotTheNationalLanguage అనే  హాష్ ట్యాగ్ తో కొన్ని లక్షల మంది తమ నిరసనను వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల వారు హిందీ నేర్చుకుంటే ఉత్తరాది వారు తమిళం, మలయాళం నేర్చుకుంటారా? అని కూడా ప్రశ్నించారు. దీనికి తాజాగా ప్రభుత్వం దీని గురించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం గురించి తమిళం (tamil)లో ట్వీట్ చేశారు. కొత్తగా అనుకుంటున్న విద్యా విధానాలు ఇప్పుడే అమలు చేసేది లేదని.. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే వాటిని అమలు చేయాలా ? వద్దా? అన్నది నిర్ణయిస్తామని ఆమె చెప్పారు. అంతేకాదు.. ప్రాచీన భాష అయితే తమిళాన్ని విద్యావిధానంలో కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతునిస్తుందని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని ఆమె తమిళంలో చేయడం విశేషం.

కేవలం నిర్మలా సీతారామన్ మాత్రమే కాదు.. తమిళనాడుకి చెందిన మరో కేంద్ర మంత్రి జైశంకర్ కూడా ఈ అంశం పై స్పందించారు. విదేశాంగ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన దీని గురించి స్పందిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖకు సమర్పించిన ఈ జాతీయ విద్యా విధానం ఒక రిపోర్టు మాత్రమేనని.. దాన్ని అమలు చేసే ముందు సామాన్య ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు సదరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సంప్రదించడం జరుగుతుందని .. ఆ తర్వాతే ఏం చేయాలి? ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అని నిర్ణయించి రిపోర్టును రూపొందిస్తారని చెప్పారాయన. అంతేకాదు.. భారత ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తుందని.. ఏ ఒక్క భాషను కూడా ఎవరిపై రుద్దే ప్రయత్నం చేయదని ఆయన ఇంగ్లిష్ తో పాటు తమిళంలోనూ ట్వీట్ చేశారు.

అయితే ఈ ఇద్దరు మంత్రులకు మానవ వనరుల శాఖతో సంబంధం లేదు.. విద్యా శాఖతో ప్రమేయం లేదు. కానీ తమిళనాడుకి చెందిన మంత్రులు కాబట్టి వీరిద్దరూ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై తమిళనాడులో దుమారం రేగకుండా వీరు ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి.

ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన జేసీబీ.. ఎందుకో తెలుసా?

వాట్సాప్ వల్ల మీ ఫోన్ హ్యాక్ కాకుండా.. ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?

#ToMaaWithLove అమ్మ సోషల్ మీడియాలో ఉంటే.. ఎలా ఉంటుందంటే..?

03 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this