ఎంఐ 17 హెలికాప్టర్ నడపడంలో.. సూపర్ రికార్డ్ సాధించిన మన మహిళలు

ఎంఐ 17 హెలికాప్టర్ నడపడంలో.. సూపర్ రికార్డ్ సాధించిన మన మహిళలు

తాము ఏ రంగంలోనైనా నెగ్గుకురాగలమని ప్రతిరోజు ఈ ప్రపంచానికి తెలియచేస్తూనే ఉంది నారీ లోకం. అందులో భాగంగానే భారతీయ వైమానిక దళానికి (Indian Air Force) చెందిన నలుగురు లేడీ ఆఫీసర్లు ఒక చరిత్రని లిఖించారు. ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియచేసింది.


ఇంతకీ ఆ నలుగురు మహిళలు ఏం చేశారు? ఇప్పటివరకు ఏ లేడీ ఆఫీసర్ కూడా చెయ్యని సాహసాన్ని వీరు ఏం చేశారు? మొదలైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..!


వివరాల్లోకి వెళితే - శత్రుదేశాలతో యుద్ధంలో పాల్గొనే సమయంలో మన సైన్యం ఉపయోగించే శక్తిమంతమైన Mi - 17 హెలికాప్టర్‌ని నడపడం చాలా కష్టం. దీనిని నడపాలంటే.. ఎంతో శారీరక శ్రమతో పాటు సాంకేతిక పద్థతుల్లో శిక్షణను తీసుకోవడం చాలా అవసరం. అలాంటిది ఈ హెలికాప్టర్‌ని ఎవ్వరి సహాయం లేకుండా.. కేవలం నలుగురు లేడీ ఆఫీసర్స్ మాత్రమే విజయవంతంగా నడిపి రికార్డు సృష్టించారు. తద్వారా వార్తల్లో నిలిచారు. 


ఈ సాహస రికార్డును నమోదు చేసిన వారిలో ఫ్లయిట్ లెఫ్టినెంట్ కెప్టెన్ పారుల్ భరధ్వాజ్ (Parul Bharadwaj), ఫ్లైయింగ్ ఆఫీసర్ మరియు కోపైలట్ అమన్ నిధి (Aman Nidhi), ఫ్లయిట్ లెఫ్టినెంట్ మరియు ఫ్లయిట్ ఇంజనీర్ హీనా జైస్వాల్ ( Hina Jaiswal) ఉన్నారు. స్క్వాడ్రన్ లీడర్ రిచా అధికారి (Richa Adhikari) ఈ హెలికాప్టర్‌ నడపడానికి ప్రీ ఫ్లయిట్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఇక ఈ ముగ్గురు హెలికాప్టర్ నడిపేందుకు శిక్షణను హకీంపేట్‌లోని హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్‌లో తీసుకున్నారు. తరువాత బెంగుళూరు‌లోని యెలహంకలో  పూర్తిస్థాయి శిక్షణను తీసుకోవడం జరిగింది.


వీరు నడిపిన Mi - 17 Helicopter ని భారత వాయుసేన,  పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో (Kargil War)  వినియోగించింది. ఈ హెలికాప్టర్లను సాధారణంగా భారత్, రష్యా నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది.ఈ హెలికాప్టర్స్ ద్వారా దాదాపు 28 బెటాలియన్ల సైన్యాన్ని.. ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సులువుగా తరలించవచ్చు. అదే సమయంలో 4000 కిలోలు బరువు కలిగిన యుద్ధ సామాగ్రిని కూడా సునాయాసంగా తరలించవచ్చు.


రాకెట్ లాంచర్లు కూడా ఈ హెలికాప్టర్లకి ఉండే అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టే ఈ హెలికాప్టర్లని కార్గిల్ యుద్ధ సమయంలో విరివిగా వినియోగించడం జరిగింది.


తాజాగా ఈ హెలికాప్టర్లను నడిపిన నలుగురు లేడీ ఆఫీసర్ల జట్టును డ్రీమ్ టీమ్ అని, సూపర్ విమెన్ టీమ్ అని నెటిజెన్స్ పొగుడుతున్నారు. ఇక ఈ Mi - 17 హెలికాప్టర్‌ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా పారుల్ భరధ్వాజ్ రికార్డు సృష్టించగా.. కో  పైలట్‌గా వ్యవహరించిన అమన్ నిధి ఝార్ఖండ్  రాష్ట్రం నుండి భారత వాయుసేనలో చేరిన తోలి మహిళా పైలట్‌గా వార్తల్లోకెక్కింది.


ప్రస్తుతం మన దేశంలో దాదాపు అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగమిస్తున్నారనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ.  అసలు ఒకప్పుడు సైన్యంలో ఆడవారి సంఖ్య చాలా తక్కువ శాతం ఉండేది. అటువంటిది ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా.. యుద్ధరంగంలో ఉపయోగించే హెలికాప్టర్లను తామే స్వయంగా నడుపుతుండడం నిజంగా గర్వించే విషయమే.


ఇవి కూడా చదవండి


ఆర్మీ ప‌టాలానికి తొలి మ‌హిళా నాయ‌కురాలు భావ‌నా క‌స్తూరి ..!


గ్లామర్ ప్రపంచాన్ని వదిలి.. ఇండియన్ ఆర్మీకి సేవలందిస్తున్న బ్యూటీ క్వీన్..!


"రిపబ్లిక్ డే" ప్రత్యేక కథనం: చరిత్రను తిరగరాసిన మన మహిళా దళాలు.. !