అమ్మకు ప్రేమతో: 50 ఏళ్ళ తన తల్లికి.. వరుడిని వెతుకుతున్న 20 ఏళ్ళ కూతురు ..!

అమ్మకు ప్రేమతో:  50 ఏళ్ళ తన తల్లికి.. వరుడిని వెతుకుతున్న 20 ఏళ్ళ కూతురు ..!

(Indian daughter Aastha Varma posts 'ad' to find 50-year-old mother a Bridegroom on Twitter)

ఆ రోజుల్లోనే కాదు.. ఈ రోజుల్లో కూడా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి కావాల్సిన వధూవరులని అన్వేషించడం కోసం సంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్ల పేరయ్యలనే సంప్రదిస్తున్నారు. ఇక ఆధునికంగా ఆలోచించే పేరెంట్స్ అయితే..  ఆన్‌లైన్ వివాహ వేదికలలో కూడా తమ పిల్లల వివరాలను పెడుతున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు వధు, వరులను వెతకడం సర్వ సాధారణమైన విషయం. కానీ తల్లిదండ్రుల కోసం పిల్లలే సంబంధాలు వెతికితే.. అది ఆశ్చర్యమే కదా..

ఇదే అంశంపై ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఓ వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆ వార్త పూర్వాపరాల్లోకి వెళితే, ఆస్తా వర్మ  అనే ఒక లా విద్యార్థిని తన 50 ఏళ్ళ తల్లి  కోసం 'వరుడు కావాలి'  అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.

ఆ చిత్రం.. నాలుగేళ్ల చిన్నారి జీవితాన్ని మలుపు తిప్పింది.. ఎలాగో తెలుసా..?

అలా తన ట్విట్టర్ ద్వారా పెట్టిన పోస్ట్‌కి విపరీతమైన క్రేజ్ రావడం విశేషం. ఒకరకంగా వరుడి కోసం వెతికే వినూత్న ప్రక్రియగా ఇది కనపడింది. అందులోనూ ఒక అమ్మాయి తన తల్లికి "వరుడు కావాలి" అని పోస్ట్ పెట్టడం మరింత ట్రెండింగ్ అయిన వార్తగా మారింది. ఇక ఆ పోస్ట్‌లో తన తల్లికి 50 ఏళ్ళ వయసు గల ఒక హ్యాండ్ సమ్ వ్యక్తి  కావాలని ఆస్తా వర్మ పేర్కొంది. అతను శాకాహారి అయ్యుండాలని.. మద్యం  సేవించే అలవాటు లేని వాడై ఉండాలని ఆమె చెప్పడం గమనార్హం. పైగా దీనికి #GroomHunting అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. 

ఇలా ఆమె పెట్టిన పోస్ట్ కొద్ది గంటల్లోనే ట్రెండ్ అయ్యింది. ఈ పోస్ట్ పై నెటిజెన్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  కొందరు ఆస్తా వర్మ చేసిన ప్రయత్నం చాలా కొత్తగా ఉందని అభినందించగా.. మరికొందరు ఇటువంటి పోస్ట్ ఏదైనా మ్యాట్రిమోని సైట్‌లో పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకొంతమంది మాత్రం అసలు ఇటువంటి పోస్టులు పెట్టడం దారుణమని.. ఇటువంటివి ట్రెండింగ్ కోసం తప్ప.. సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడవని కామెంట్స్ పెట్టారు.

ఇక ఈ కామెంట్స్‌కి ఆస్తా వర్మ తనదైన రీతిలో సమాధానమిచ్చారు. తాను తన తల్లికి ఒక మంచి భాగస్వామిని వెతికేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు ముగిసిన తరువాతనే.. ఇలా ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ పోస్ట్ ఏదో ఒక సంచలనం కోసం పెట్టింది మాత్రమే అనుకొనేవారికి సమాధానమిస్తూ.. "ఈ పోస్ట్  సంచలనం కోసం ఏ మాత్రం కాదు.  నా ప్రయత్నంలో నిజాయితీ ఉంది" అని ఆమె పేర్కొన్నారు.

ఆమె తొలి చిత్రమే "స్వలింగ సంపర్కం"పై : హైదరాబాద్ నటి శ్రీదేవి చౌదరి డేరింగ్ నిర్ణయం

ఈ పోస్టుతో పాటు తన తల్లి వివరాలు కూడా పంచుకున్నారు ఆస్తా వర్మ. తన తల్లి ఒక ఉపాధ్యాయురాలు అని.. ఆమెకు తగిన పెళ్లి సంబంధాలు ఉంటే సంప్రదించమని ఆమె కోరారు. వరుని వయసు 45 నుండి 55 వరకు ఉంటే సరిపోతుందని.. అలా కాని పక్షంలో దయచేసి సంప్రదించవద్దని ఆమె తెలిపారు.

ఇక ఆస్తా వర్మ పెట్టిన ఈ పోస్ట్‌కి సంబంధించి కొంతమంది ఫన్నీ మీమ్స్ తయారు చేయడం.. వాట్సాప్ గ్రూప్స్‌లో చర్చించడం.. లేదా హేళన మాట్లాడడం గమనార్హం. వారందరినీ సున్నితంగా హెచ్చరించారు ఆస్తా వర్మ. కాగా అధిక శాతం మంది నెటిజన్లు.. ఆస్తా ట్వీట్‌ను సమర్థించారు. తనని పెంచి పెద్ద చేసిన తన తల్లికి భర్త చనిపోయాక.. ఒక తోడు అవసరమని గుర్తించి ఆమె ఇలా చేయడం నిజంగానే అభినందించదగ్గ విషయమని తెలిపారు.

ఈ కాలంలో తమని ఒక స్థాయికి తీసుకువచ్చిన తల్లిదండ్రుల గురించి వారి పిల్లలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, వారి జీవితం పైనే దృష్టి పెడుతుండగా.. ఓ కూతురు తన తల్లికి ఒక తోడుని వెతికేందుకు చేస్తున్న ప్రయత్నాలను మనం నిజంగా మెచ్చుకోవలసిందే. అలాగే ఈమె ప్రయత్నం ఫలించి.. ఆమె తల్లికి ఒక మంచి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరకాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఏదేమైనా.. ఈరోజుల్లో మనం అనుకున్నది సాధించాలంటే.. పట్టుదలతో పాటు కాస్త సృజనాత్మకత కూడా అవసరమే కదా. మీరేమంటారు??

హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలివే...