60వ బర్త్‌డే స్పెషల్: కింగ్ & బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గురించిన ఆసక్తికర విషయాలు..!

60వ బర్త్‌డే స్పెషల్:  కింగ్ & బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గురించిన ఆసక్తికర విషయాలు..!

"విక్రమ్" సినిమాతో యువ కథానాయకుడిగా.. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైనప్పటికి.. ఆ తర్వాత తనకంటూ నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి నాగార్జున (Nagarjuna). హీరోగా తనను తాను నిరూపించుకున్నాక.. పలు చిత్రాలని నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా కూడా పేరు గడించాడు. ఈరోజుతో 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నప్పటికి... ఎక్కడా కూడా ఆయనలో స్పీడ్ లేదా గ్లామర్ ఇసుమంతైనా తగ్గలేదనే చెప్పాలి. 

"మన్మథుడు" మ్యాజిక్ రిపీట్ చేయడంలో.. తడబడ్డ నాగార్జున (మన్మథుడు 2 మూవీ రివ్యూ)

ఇక యువ సామ్రాట్‌గా మొదలైన ఆయన సినీ జీవితం ఎన్నో మైలురాళ్లను చూసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో 'కింగ్'గా సుపరిచితుడయ్యాడు నాగ్. దాదాపు 33 ఏళ్ళ సినీ కెరీర్‌లో.. ఆయన ఒక నటవారసుడిగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకొని..   తాజాగా 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' కి వ్యాఖ్యాతగా కూడా మారాడు. 

ఈ 33 ఏళ్ళ కెరీర్‌లో ఆయన సినీ జీవితంలో కొన్ని కీలక మలుపుల గురించి.. ఆయన 60వ జన్మదినం (Birthday) సందర్భంగా  తెలుసుకుందాం.

* సహజంగా ఏ నటుడైనా పెళ్ళికి ముందు హీరోగా కెరీర్ ప్రారంభించాలని అనుకుంటాడు. అలాంటిది.. నాగార్జున తన పెళ్ళైన రెండేళ్ళకి.. 1986లో హీరోగా 'విక్రమ్' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు.

* 1989 సంవత్సరం... అనగా నాగ్ కెరీర్‌లో మూడవ సంవత్సరం. దీనిని ఆయన తన సినిమా కెరీర్‌ని ఒక మలుపు తిప్పిన సంవత్సరంగా చూస్తారు. కారణం - ఆ సంవత్సరమే శివ చిత్రం విడుదలవ్వడం... రాంగోపాల్ వర్మ వంటి అద్భుతమైన దర్శకుడిని.. నాగ్ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది.

* అలాగే 1989 సంవత్సరంలో మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక తెలుగు చిత్రం.. అలాగే నాగార్జునతో తీసిన ఒకేఒక్క చిత్రం 'గీతాంజలి' విడుదలైంది. ఆ చిత్రంతో నాగార్జున ఒక లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకోగలిగాడు. ఆ చిత్రంలో ఉన్న లిప్ లాక్ సన్నివేశం అప్పటిలో హాట్ టాపిక్‌గా మారింది.

* 1994లో నాగ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం హలో బ్రదర్'. ఈ చిత్రంతో ఆయన మాస్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోగలిగాడు. ముఖ్యంగా ఈ చిత్రం ఎంత భారీ హిట్టయింది అని అంటే.. హిందీలో ఈ సినిమా రీమేక్ అయి అక్కడ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?


* 1996లో నాగార్జున హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా చేస్తూ నిర్మించిన 'నిన్నే పెళ్లాడతా' చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.


* 1997 సంవత్సరం నాగార్జున సినీ కెరీర్‌లో ఎప్పటికి మరిచిపోలేని సంవత్సరం అని చెప్పాలి. 'అన్నమయ్య' చిత్రంలో ఆయన నటనకి అభిమాని కానివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన ఈ చిత్రంలో ప్రదర్శించిన నటనకి.. స్వయంగా అక్కినేని నాగేశ్వర రావు సైతం తన నట వారసుడు 'అక్కినేని నాగార్జున' అని ప్రకటించారు.

* 2000లలో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా చిత్రాలతో మంచి ఫ్యామిలీ హీరోగా మరోసారి ప్రేక్షకులకి దగ్గరయ్యాడు నాగ్.


* 2002లో సంతోషం, మన్మథుడు చిత్రాలతో నాగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాక ... తన స్క్రీన్ టైటిల్‌ని సైతం మన్మథుడిగా మార్చుకునేంతగా ఈ సినిమాలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి.


* 2004లో మాస్ అనే ఒక పక్కా కమర్షియల్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు నాగ్. అలాగే అప్పటివరకు తనకున్న మార్కెట్‌ని ఈ సినిమా బాగా పెంచింది అని చెప్పాలి.


* 2006లో మరోసారి ఆధ్యాత్మిక చిత్రమైన 'శ్రీరామదాసు' చిత్రంలో టైటిల్ పాత్రని పోషించి... ఆ తరహా పాత్రల్లో ఆయన తనకి తానే సాటి అని నిరూపించుకున్నాడు.

* 2014లో విడుదలైన 'మనం' చిత్రమనేది కేవలం నాగార్జునకే కాకుండా.. యావత్ అక్కినేని కుటుంబానికి కూడా ఎన్నో భావోద్వేగాలను పంచిన చిత్రం. ఆ చిత్రం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు  ఆఖరి చిత్రం. ఈ చిత్రంలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటించగా.. అదే చిత్రంలో ఆఖరున అఖిల్ తళుక్కుమని మెరుస్తాడు.

* 2014లో టెలివిజన్ రంగంలోకి వ్యాఖ్యాతగా అడుగుపెట్టి.. విజయవంతంగా "మీలో ఎవరు కోటీశ్వరుడు" ప్రోగ్రామ్‌ని నిర్వహించారు నాగ్. ఆ ప్రోగ్రామ్ 1, 2, 4 సీజన్స్‌కి  ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. ఇది ఆయన కెరీర్‌లో ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు.


* 2016లో నాగార్జున చేసిన మరొక ప్రయోగం "ఊపిరి" చిత్రం. ఈ చిత్రం మొత్తం కూడా ఆయన వీల్ చైర్‌కే పరిమతమయ్యే పాత్రలో నటించాడు. తెలుగు సినిమాలలో ఇటువంటి ప్రయోగాలు చేయాలంటే కేవలం అది నాగార్జునకే చెల్లింది.


* 2019లో మరోసారి టెలివిజన్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించి.. బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగు వెర్షన్‌కి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి సైన్ చేశారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఇచ్చిన సక్సెస్‌తో..  మరోసారి కూడా నాగ్ వ్యాఖ్యాతగా దూసుకుపోయాడనే చెప్పాలి. 

ఇవి కింగ్ నాగార్జున కెరీర్‌లో జరిగిన కీలక సంఘటనలు... ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా వీటిని మరలా ఒకసారి పాఠకులకి గుర్తుచేయడం జరిగింది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జునకి  POPxo తెలుగు తరపున జన్మదిన శుభాకాంక్షలు.

కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున .. తీవ్ర హెచ్చరికలు జారీ