"మన్మథుడు" మ్యాజిక్ రిపీట్ చేయడంలో.. తడబడ్డ నాగార్జున (మన్మథుడు 2 మూవీ రివ్యూ )

"మన్మథుడు" మ్యాజిక్ రిపీట్ చేయడంలో.. తడబడ్డ నాగార్జున (మన్మథుడు 2 మూవీ రివ్యూ )

మన్మథుడు 2 మూవీ రివ్యూ (Manamadhudu 2 review)

17 ఏళ్ళ క్రితం వచ్చిన "మన్మథుడు" చిత్రంలో  నాగార్జున (Nagarjuna) ఎలా ఉన్నాడో.. ఈ రోజు విడుదలైన "మన్మథుడు 2"లో హీరో నాగార్జున కూడా అలాగే ఉన్నాడు.. ఈ ఆశ్చర్యం కాసేపు పక్కన పెట్టేస్తే.. అసలు ఈ కథకి.. 17 ఏళ్ళ క్రితం వచ్చిన కథకి ఏమైనా పోలికలు ఉన్నాయా?.. అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన పాయింట్.

ఆ సినిమాలో 'ఆడాళ్లంటే కచ్చి' అంటే.. ఇప్పుడేమో ఈ సినిమాలో 'హీ లవ్స్ విమెన్' అంటూ మన ముందుకు వచ్చేశాడు నాగ్.

'ఐ ఓన్లీ మేక్ లవ్' అంటోన్న నాగార్జున

ఇంత వైవిధ్యం కనిపిస్తుండగా.. ఈ సినిమా ఎలా ఉంది? సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఏం ఉన్నాయి? అభిమానులు తమ "మన్మథుడు" నాగార్జున నుంచి ఎలాంటి అంశాలు ఇందులో ఆశించవచ్చు?? అనే వివరాలు మనం కూడా తెలుసుకుందాం

ముందుగా మన్మథుడు 2 కథలోకి వెళితే ...

1920 ప్రాంతంలో.. భారతదేశం నుంచి పోర్చుగల్‌కి వెళ్లిన ఒక కుటుంబానికి సంబంధించిన కథ ఇది. ఆ కుటుంబంలో ఏకైక మగ సంతానమైన సాంబశివరావు అలియాస్ సామ్‌కి పెళ్లి అన్నా.. పిల్లలు అన్నా.. ఏదో తెలియని భయం. అందుకే ఆడవాళ్ళతో దీర్ఘకాలిక బంధంలో ఉండే కన్నా.. స్వల్ప కాలిక బంధంలో ఉండటానికి ఇష్టపడుతుంటాడు. అలా దాదాపు పెళ్లి వయసు దాటి పోయి.. దాదాపు అయిదు పదుల వయసులోకి చేరుకుంటాడు.

ఆ తరుణంలో సామ్ తల్లి (లక్ష్మి) & అక్కచెల్లెలు - (ఝాన్సీ, దేవదర్శిని & నిశాంతిలు) ఎలాగైనా సామ్‌ పెళ్లి చేసుకోవాలని.. లేదంటే తమకి దూరంగా ఉండాలని షరతు పెడతారు. ఆ సమయంలోనే సామ్‌కి అవంతిక (రకుల్ ప్రీత్) పరిచయం అవుతుంది. ఆమెని ఉపయోగించుకొని.. పెళ్లి గండం నుండి బయటపడాలనుకుంటాడు సామ్. మరి సామ్ ప్లాన్ ఫలించిందా? పెళ్లి గండం నుంచి తప్పించుకున్నాడా? అనేది వెండితెర పైన చూడాల్సిందే.

ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకి బాగా నచ్చే అంశాలు

* వెన్నెల కిషోర్ - ఈ సినిమాలో నాగార్జున పాత్రతో పాటుగా సినిమా మొత్తం ఉండే పాత్ర 'కిషోర్' ది. అసలు కిషోర్ అభినయం ఈ సినిమాకి ఒక పిల్లర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. కథనం ఎక్కడ కాస్త నెమ్మదిస్తున్నా.. దర్శకుడు కిషోర్‌ని ఉపయోగించుకుని మళ్ళీ కథనాన్ని ముందుకి నడిపించాడు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. ఈ చిత్రం కూడా ఆయన కెరీర్‌లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోతుంది.


* నాగార్జున - ఇంకొక 20 రోజుల్లో 60ల్లోకి అడుగుపెడుతున్నా.. అసలు ఆ వయసు తాలూకా ఛాయలు ఎక్కడా కూడా ఆయనలో కనిపించకపోవడం విశేషం. అదే సమయంలో ఆయన ఈ సినిమాలో ధరించిన కాస్ట్యూమ్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇక ఆయన మార్క్ రొమాన్స్‌ని ఈ సినిమాలో బాగానే పండించాడు. లిప్ లాక్స్ & అమ్మాయిలని ఫ్లర్ట్ చేసే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి.

అవంతిక అనే బోల్డ్ & బ్యూటిఫుల్ అమ్మాయిగా..  రకుల్ ప్రీత్


* మాటలు - దర్శకుడు రాహుల్ రవీంద్రన్, కిట్టు విస్సాప్రగడలను మనం ముందుగా అభినందించాలి. ఈ చిత్రంలో చాలా చురుకైన సంభాషణలు ఉన్నాయి. ఇవి ప్రేక్షకులని కచ్చితంగా నవ్విస్తాయి. ముఖ్యంగా 'దూరదర్శన్ తెలుగు' అంటూ వార్తల్లో వాడే తెలుగుని.. పాత్రల చేత పలికిస్తూ వాటి ద్వారా హాస్యాన్ని పండించే ప్రయత్నం బాగుంది. వీటితో పాటు అక్కడక్కడా - అమ్మ గురించి రాసిన సెంటిమెంట్ డైలాగ్స్ కూడా బాగున్నాయి.


* ఛాయాగ్రహణం -  ఈ సినిమా సింహభాగం పోర్చుగల్‌లో చిత్రీకరించబడింది. దానితో అక్కడి లొకేషన్స్‌ని ఛాయాగ్రాహకుడు సుకుమార్ చాలా అందంగా తన కెమెరాలో బంధించాడు. సినిమా కూడా అందుకే కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అదే సమయంలో నటీనటులని కూడా చాలా అందంగా చూపించగలిగాడు.


* దర్శకుడు రాహుల్ రవీంద్రన్, తన రెండవ సినిమాలో ఇంతమంది తారాగణంతో షూటింగ్ చేయాల్సి రావడం నిజంగా ఒక టాస్క్ అని చెప్పాలి. అదే సమయంలో ఇది తన కథ కాకపోయినప్పటికీ, కథనాన్ని సొంతంగా సమకూర్చుకోవడమే కాకుండా.. మాటలు కూడా రాయడం అభినందనీయం. మొదటి సినిమా హిట్ గాలివాటం కాదని, తనలో ఒక మంచి దర్శకుడు ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నాడు.

ఆఖరుగా... మన్మథుడు చిత్రంతో పోలిస్తే "మన్మథుడు 2"లో హాస్యం పాళ్ళు కాస్త తగ్గినా... ఈ సినిమాలో కూడా నవ్వుకోవడానికి సరిపడా సన్నివేశాలు ఉన్నాయి. అయితే కథపరంగా ఇంకాస్త బలమైన పాయింట్ తీసుకుని ఉంటే, మన్మథుడు 2 ఇంకా బాగుండేది.

"ఒక్కపూట భోజనం కోసం వ్యవసాయం చేయను" - 'మన్మథుడు 2'లో నాగార్జున