బాలీవుడ్ దివా కరీనా కపూర్ (Kareena Kapoor) తన నటనతో అందరి మనసులను దోచుకొంది. సాధారణంగా సినీరంగంలో ఉన్నవారు వివాహమై.. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నటనకు దూరంగా ఉంటారు. కానీ కరీనా అలా కాదు.
బ్రేక్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగిపోతుంది. నటిగా, భార్యగా, తల్లిగా తాను పోషించే పాత్రలను చక్కగా బ్యాలెన్స్ చేసుకొంటూ అందరికీ రోల్ మోడల్‌లా మారింది.
కెరీర్లో దెబ్బతిన్న ప్రతిసారి లేచి నిలబడటానికే ప్రయత్నించింది. అంతేతప్ప ఇక నా వల్ల కాదులే అని చేతులెత్తేయలేదు. సాధారణంగా వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా కరీనా చర్చించదు. కానీ తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ఆమె మాటల్లోనే అవేంటో తెలుసుకుందాం.
స్కూలింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేటప్పటికి కరిష్మా నటనలో తొలి అడుగులు వేయడం ప్రారంభించింది. అప్పుడు ఆమెను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ‘దిల్ తో పాగల్ హై’ సినిమాలో నటించేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది. తాను ఏ పని చేసినా అలాగే చేస్తుంది. తనను చూస్తూ పెరగడం వల్లే నాకు నటనపై ఆసక్తి పెరిగింది. నేను యాక్టింగ్ మొదలుపెట్టేటప్పుడు తను నాకు చాలా నేర్పించింది. సినీ పరిశ్రమలో మహిళగా ఎలా ఉండాలో తను నాకు వివరించింది. నటిగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి.
మంచి సినిమాలు చేశాను. అయినా ఓ ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇక బాలీవుడ్‌లో నా కెరీర్ ముగిసిపోయిందనే నేను భావించాను. ఆ తర్వాతే నేను బరువు తగ్గి సైజ్ జీరోకు చేరుకొన్నాను. ప్రతి ఒక్కరూ తమ కెరీర్లో ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు.
కానీ నేను నటిని కావడంతో అందరి దృష్టి నా వైపు ఎక్కువగా ఉంటుంది. అలా అందరి చూపూ మన మీదే ఉండటం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నన్ను ప్రేమించే, అభిమానించే వారు నా జీవితంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. వారు అన్ని విషయాల్లోనూ నాకు తోడూనీడగా నిలిచారు.
నేను పాతాళంలోకి పడిపోతున్నాననుకొంటున్న సమయంలో సైఫ్ నాకు చేయి అందించాడు. నన్ను మళ్లీ మనిషిగా నిలబెట్టాడు. మేమిద్దరం కలసి నటించడానికి ముందే సైఫ్ నాకు బాగా తెలుసు. కానీ ‘తషన్’ సినిమా షూటింగ్‌లో మొత్తం పూర్తిగా మారిపోయింది. తను నన్ను బాగా ఆకర్షించేవాడు. అప్పటి అనుభవాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. లడఖ్, జైసల్మేర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మేమిద్దరం బైక్ పై లాంగ్ డ్రైవ్‌కి వెళ్లేవాళ్లం. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకొనేవాళ్లం.
నిజమే.. తను నాకంటే పదేళ్లు పెద్దవాడు. అప్పటికే అతనికి ఇద్దరు పిల్లలున్నారు. అయినా తను మాత్రం నాకు జస్ట్ సైఫ్ అంతే. నన్ను నేను ప్రేమించుకొనేలా.. నా బాధని మరచిపోయేలా చేశాడు. మా ఇద్దరి వ్యక్తిత్వాలు కూడా వేరు. ఇతర బాలీవుడ్ యాక్టర్లలా తను ఉండడు. ఏకాంతంగా ఉండటానికే ఎక్కువ ఇష్టడుతుంటాడు. కానీ నేను తనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాను. తన దగ్గరి నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకొన్నాను. నేను చేసే పనుల ప్రభావం.. నా వ్యక్తిగత జీవితంపై పడకుండా ఉండటం నేర్చుకొన్నాను.
వివాహానికి ముందే మేమిద్దరం కొంత కాలం డేటింగ్ చేశాం. ఆ సమయంలో ‘నా వయసు 25 కాదు.. ప్రతిరోజూ ఇంటి దగ్గర నిన్ను దింపడం నా వల్ల కాదని’ చెప్పాడు. ఆ తర్వాత నేరుగా మా అమ్మ దగ్గరికి వెళ్లి ‘నేను తనతో జీవితం గడపాలని కోరుకొంటున్నాను. మేమిద్దరం సహజీవనం చేస్తాం’ అని చెప్పాడు. మా అమ్మ దానికి సంతోషంగా అంగీకరించింది. మా ఇద్దరి మధ్య పెళ్లి ప్రతిపాదన వచ్చినప్పుడు సైతం నేను కరెక్ట్ గానే చేస్తున్నాననే భావనే నాకు కలిగింది.
పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత.. మాకు తైమూర్ జన్మించాడు. మాతృత్వం ఎంత మధురంగా ఉంటుందో నాకు తెలిసింది. తైమూర్ నా శరీరంలో భాగం. తను లేకుండా నేను కాసేపు కూడా ఉండలేను. నేనెక్కడికి వెళ్లినా.. తనను నా వెంటే తీసుకెళ్లిపోతుంటాను. ఇంకా కష్టపడాలనే తాపత్రయం తన వల్ల నాకు కలుగుతోంది.
కెరీరా? కుటుంబమా? అని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో నేను లేను. ఈ బాధ్యతలు రెండింటినీ నేను చక్కగా నిర్వర్తించగలుగుతున్నాను. ఓ నటిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. వ్యక్తిగత జీవితంలోనూ చెల్లి, భార్య, తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. అయితే ఇవేమీ నన్ను ఇబ్బందులకు గురిచేయలేదు. నన్ను సరైన మార్గంలో నడిచేలా చేశాయి. నడిపిస్తున్నాయి. ఇప్పుడు నా కలలు మరింత పెద్దవయ్యాయి. నటిగా, మహిళగా నేను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. వాటిని సాధిస్తాను.
Images: Instagram
ఇవి కూడా చదవండి
ఆ ఆత్మహత్యలకు కారణం ఎవరు? చదువుల ఒత్తిడా? అధికారుల నిర్లక్ష్యమా?
ఈ ట్రెండీ జీన్స్ ప్యాంట్లకు.. మీ వార్డ్రోబ్‌లో కచ్చితంగా చోటు కల్పించాల్సిందే..!
సంతోషంగా ఉండమని తెలిసినా.. బంధంలో ఎందుకు కొనసాగుతున్నారంటే..?