ADVERTISEMENT
home / Family
ఈ యువకుడు అమ్మ కు రెండో పెళ్లి చేశాడు.. ఎందుకో తెలుసా..?

ఈ యువకుడు అమ్మ కు రెండో పెళ్లి చేశాడు.. ఎందుకో తెలుసా..?

అమ్మ (Mother).. ఈ లోకంలో బిడ్డకు ఏమాత్రం కష్టం రాకుండా చూసుకునే దేవత ఆమె.. పిల్లల కోసం తాను ఎన్ని కష్టాలు పడినా.. వారికి మాత్రం ఏ లోటూ రాకుండా చూసుకుంటుంది. తన పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఎదురైందంటే చాలు.. తనకే ఆ బాధ వచ్చినట్లుగా భావిస్తుంది. అలాంటి అమ్మ కోసం మనమేం చేస్తున్నాం? అని ఎవరైనా ఆలోచించారా? అమ్మ ఆనందం కోసం తనకు రెండో పెళ్లి చేశాడో యువకుడు. కేరళకు చెందిన ఆ వ్యక్తి ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రెండో పెళ్లి (Second marriage) గురించి అందరిలో ఉన్న అపార్థాలను తొలగించడం మాత్రమే కాదు.. తల్లీకొడుకుల ప్రేమకు కొత్త అర్థం చెప్పాడు. మరి, ఈ వ్యక్తి కథ మనం కూడా తెలుసుకుందాం రండి..

కేరళలోని కొల్లమ్ ప్రాంతానికి చెందిన గోకుల్ శ్రీధర్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చదువుతున్నాడు. చదువుతో పాటు స్టూడెంట్ లీడర్ గా కూడా పనిచేస్తున్నాడు. తాజాగా తన తల్లికి రెండో పెళ్లి చేసి జీవితాంతం వారిద్దరూ సంతోషంగా ఉండాలంటూ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని తెలియజేస్తూనే సమాజంలో ఉన్నవారందరికీ తమ కథను చెప్పి.. అమ్మ నిర్ణయాన్ని.. రెండో పెళ్లిని తప్పుబట్టవద్దని చెప్పుకొచ్చాడు. తన తల్లి రెండో పెళ్లి చేసుకుందని తెలిస్తే స్నేహితులు, బంధువులు ఆమె గురించి తప్పుగా మాట్లాడతారని భయపడిన గోకుల్, దాని వెనుక ఉన్న కారణాల గురించి కూడా ఈ పోస్ట్ లో పంచుకున్నాడు. మలయాళంలో తన భావాలన్నింటినీ పరచిన ఆ పోస్ట్ లో గోకుల్ చుట్టూ ఉన్నవారు తమని అర్థం చేసుకోవాలని కోరాడు.

ఇది మా అమ్మ రెండో పెళ్లి.. నేను తన పెళ్లి గురించి ఈ పోస్ట్ పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాను. ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోవడం అనేది సమాజంలో ఒప్పుకోలేని విషయంగా ఉంది. అందుకే అమ్మ రెండో పెళ్లి చేసుకుందని మమ్మల్ని ద్వేషించవద్దని కోరుకుంటున్నా. మీరు మమ్మల్ని ద్వేషించినా మేం పెద్దగా ఇబ్బందిపడం. మా అమ్మ నా కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి. తన వివాహ జీవితంలో తను ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఎన్నో దెబ్బలు తింది, రక్తం కార్చింది. అయినా అన్నింటినీ తట్టుకొని అలాగే ఉండేది. ఓసారి నేను తనని అడిగాను. నువ్వు ఎందుకు ఇలా ఇవన్నీ భరిస్తూ ఉన్నావు? అని.. అప్పుడు అమ్మ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తే.. నేను నీ కోసం జీవిస్తున్నా. నీ కోసం ఎంతైనా భరిస్తా అని చెప్పింది. ఒక రోజు అమ్మ చేయి పట్టుకొని ఆ ఇంటి నుంచి బయటకొచ్చేశాను. అలాంటి ఒక రోజు వస్తుందని, రావాలని నేను కోరుకునేవాడిని. ఆ రోజే నేను తన జీవితంలో ఆనందం నింపాలని నిర్ణయించుకున్నా. మా అమ్మ నా కోసం తన యవ్వనాన్ని మొత్తం త్యాగం చేసింది. నేను ఎత్తుకు ఎదగాలని తన ఆనందాన్ని దూరం చేసుకుంది. తను జీవితంలో ఆనందంగా ఉండేందుకు నేను ఇది చేశాను. ఈ విషయాన్ని నేను రహస్యంగా ఉంచాలని భావించలేదు. అందుకే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నా అంటూ పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. తల్లిపై ఓ కొడుకు ఇంత ప్రేమ చూపగలడా? అని ప్రతిఒక్కరూ గోకుల్ ని అభినందించడం ప్రారంభించారు. మరికొందరైతే ఇలాంటి కొడుకులు ఇంకా చాలామందికి ఉండాలని కోరుకున్నారు. ఆ తర్వాత ఈ పోస్ట్ గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ పెళ్లికి కేవలం మా ఇంటి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మా అమ్మతో పాటు అందరూ దీని గురించి అందరికీ నెమ్మదిగా తెలియాలని భావించారు. కానీ ఎవరో చెప్పడం కంటే అందరికీ ఈ విషయం గురించి మేమే చెబితే బాగుంటుందని నేను భావించాను. మన సమాజంలో మగవాళ్లు రెండో పెళ్లి చేసుకుంటే ఎలాంటి తప్పు ఉండదు. కానీ ఆడవాళ్లు అలా చేసుకుంటే దాన్ని పెద్ద సమస్యగా భావిస్తారు. అలా ఎందుకో నాకు అర్థం కాదు.. అని చెప్పాడు.

ADVERTISEMENT

gokul sreedhar1 4274748

Source : Gulfnews

తన తండ్రి గురించి మాట్లాడుతూ నేను మా నాన్నను పెద్ద విలన్ లా భావించట్లేదు. మా అమ్మానాన్నలిద్దరి మనస్తత్వాలు వేరుగా ఉండేవి. అమ్మ నాన్న వ్యవహార శైలిని భరించలేకపోయేది. ఆయన ఎప్పుడూ అమ్మపై అరుస్తూ, గొడవ పెట్టుకుంటూ, కొడుతూ ఉండేవాడు. 2002లో ఆ పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. నాకు ఆరేళ్లున్నప్పుడు మా అమ్మ నేను అమ్మమ్మగారింటికి వెళ్లిపోయాం. తను ఉద్యోగం చేసేది. మా నాన్న పనిచేయడానికి దుబాయ్ కి వెళ్లిపోయాడు. 2004లో ఆయన తిరిగొచ్చి అమ్మతో కలిసి ఉండాలని అడిగాడు. కానీ తను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోలేదు. ఆయన అమ్మకు ఫ్రెండ్స్, బంధువులు ఎవరూ ఉండకూడదని.. వారితో మాట్లాడకూడదని భావించేవాడు. అలా చేస్తే తనపై చేయి చేసుకునేవాడు. ఆ సమయంలో రెండు మూడు సార్లు నేను తనకు అడ్డువెళ్లాను. నన్ను తోసేసి అమ్మను కొట్టేవాడు. అలా చాలాసార్లు అమ్మను కొట్టడం చూశాను. ఆ సమయంలో తనంటే నాకు ఎంత భయంగా ఉండేది. 2009లో తను మరోసారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. మేమిద్దరం మళ్లీ అమ్మమ్మగారింట్లో ఉండేవాళ్లం. 2013లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. నాన్న కూడా విడాకులు తీసుకోవడానికి ఆసక్తి చూపినట్లే ఉన్నారు. విడాకుల సమయంలో చేసిన సెటిల్ మెంట్ ప్రకారం మా నాన్న నా చదువు కోసం ఖర్చు పెడుతూ.. మా ఇంటికి అద్దె కట్టేవారు. ఇన్నేళ్లపాటు అమ్మ ఉద్యోగం చేస్తూ నన్ను చూసుకుంది. ఇప్పుడు నేను తనకు ఆనందాన్ని అందించాలనుకున్నా. ఇప్పుడు కాలం మారుతోంది. నేను ఫేస్ బుక్ పోస్ట్ పెట్టిన తర్వాత ప్రతిఒక్కరూ ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ నేను వూహించలేదు. నా పోస్ట్ కి వచ్చిన కామెంట్లు చదివి నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

పిల్లల కోసం కష్టమైనా దెబ్బలు తింటూ.. హింసను భరిస్తూ భర్తతో కలిసి ఉంటోన్న తల్లులందరికీ నాది ఒకటే సలహా. మీ పిల్లల కోసం మీరు ఆ బంధంలో కొనసాగాల్సిన అవసరం లేదు. వారిని తీసుకొని బయటకు వచ్చేయండి. చిన్నతనంలో వారు మీ నిర్ణయాన్ని అర్థం చేసుకోలేరేమో.. కానీ మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత మిమ్మల్ని తప్పక అర్థం చేసుకుంటారు. అప్పుడు వారు మీపై చూపే ప్రేమ, గౌరవం మరింత పెరుగుతుంది.. అంటూ మీడియాతో తన ఆనందాన్ని, కథను పంచుకున్నాడు గోకుల్. రెండో పెళ్లి విషయంలో సమాజంలో వస్తున్న మార్పుకి ఇదో చిన్న నిదర్శనం. ఇలా తల్లుల ఆనందం కోసం ఆలోచించే కొడుకులు, కూతుళ్లు మరికొందరు కూడా రావాలని మనమూ కోరుకుందాం.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి.

అలా అయితే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉండేవారు : శ్రుతి హాసన్

ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించిన ఏక్తా.. సింగిల్‌గా ఎందుకు మిగిలిందో తెలుసా?

పెళ్లైన వారి కంటే.. సింగిల్‌గా ఉండేవారే ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారట.. ఎందుకో తెలుసా?

ADVERTISEMENT

Featured Image : Facebook

13 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT