మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi ) – ఈ పేరు వింటేనే కొందరికి స్ఫూర్తి.. మరికొందరికి అభిమానం. ఇంకొందరికి ఆయన జీవితమే ఒక పాఠ్యపుస్తకం. ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన ఓ వ్యక్తి పలు విధాలుగా సమాజాన్ని ప్రభావితం చేయడమనేది నిజంగానే గొప్ప విషయం. “చిరంజీవి”… ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. 1978లో తెలుగు తెరకు పరిచయమైన నాటి నుండి నేటి వరకు.. ఆయనకి ప్రజల్లో అభిమానం పెరుగుతూ వచ్చిందే తప్ప… ఏనాడూ కూడా తరగలేదు.
మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి” (Sye Raa Narasimha Reddy) హైలైట్స్ ఇవే..!
సినీరంగం నుండి మొదలైన ఆయన ప్రయాణం… ఆ తరువాతి కాలంలో స్వచ్ఛందంగా స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ల వరకూ కొనసాగింది. ఆ తర్వాత సినీ కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన చిరు.. రాజకీయాల్లోకి సైతం వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత పదేళ్ళ గ్యాప్ తీసుకొని.. మళ్లీ చలనచిత్ర రంగంలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఆయన జీవితం మొత్తం అనేక మలుపులతోనే సాగింది. ఈ క్రమంలో మనం కూడా.. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన 40 ఏళ్ళ సినీ జీవితంలోని ఒక 10 కీలక మైలురాళ్ల గురించి అవలోకనం చేసుకుందాం
* 1978లో చిరంజీవి సినీ కెరీర్ మొదలైంది. పునాదిరాళ్ళు చిత్రంతో ఆయన తొలిసారిగా కెమెరా ముందుకి వచ్చినప్పటికీ.. ముందుగా విడుదలైన చిత్రం మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ చిత్రం ద్వారానే కొణిదెల శివశంకర వర ప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా మారారు. అలా ఆయన ప్రస్థానం మొదలైంది.
* 1982లో విడుదలైన ‘శుభలేఖ’ చిత్రం.. చిరంజీవిలోని గొప్ప నటుడిని ప్రేక్షకులకి పరిచయం చేసింది. ఆ చిత్రంలో నటనకి గాను తొలిసారిగా ఆయన ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు.
* 1983 – ఈ సంవత్సరం చిరంజీవి ఒక స్టార్ హీరోగా ఎదిగిన సంవత్సరం. ‘ఖైదీ’ చిత్రం ఇదే సంవత్సరం విడుదల కావడం.. ఆ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకి యాక్షన్ హీరోగా పరిచయమైన నటుడు.. ఆ తర్వాత మెగాస్టార్‌గా ఎదగడం విశేషం. పున్నమినాగు, రుద్రవీణ, స్వయంకృషి, గ్యాంగ్ లీడర్ మొదలైన చిత్రాలు చిరంజీవి నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.
* 1990లో చిరంజీవి హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ‘ప్రతిబంధ్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఆ తరువాతి కాలంలో మరొక రెండు హిందీ చిత్రాలు – ఆజ్ కా గుండా రాజ్ & ది జెంటిల్‌మేన్‌లలో కూడా నటించారు.
“సైరా” టీజర్‌లో .. టాప్ 10 ఆసక్తికర విశేషాలు ఇవే..!
* 1992లో చిరంజీవిని ‘బిగ్గర్ ద్యాన్ బచ్చన్’ అని పలు ప్రముఖ సినీ మ్యాగజైన్స్ పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. దానికి కారణం – ఘరానా మొగుడు చిత్రం ద్వారా ఆ సమయంలో ఉన్న వసూళ్ళ రికార్డులన్నిటిని తిరగరాయడంతో పాటుగా… అప్పుడు మొత్తం భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా మెగాస్టార్ ఒక ప్రత్యేక రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు.
* 1995 నుండి దాదాపు రెండేళ్ళ పాటు హీరోగా చిరంజీవి ఒడిదుడుకులని చవిచూశారు. ఎందుకంటే, ఆ సమయంలో వచ్చిన రిక్షావోడు, బిగ్ బాస్ వంటి చిత్రాలు తీవ్ర నిరాశని మిగిల్చాయి.
* 1997లో విడుదలైన హిట్లర్ చిత్రంతో మళ్లీ.. ఓ పెద్ద హిట్‌ని అందుకున్నారు చిరంజీవి. మలయాళంలో వచ్చిన ‘హిట్లర్’ అనే చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం, ఆ సంవత్సరంలో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
* 1999 – ఆ సమయంలో చిరంజీవికి ఒక హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం రావడం.. ఆ చిత్రం కోసం కొంత షూటింగ్ కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దానితో చిరంజీవికి హాలీవుడ్ వెళ్ళే అవకాశం చేజారిపోయింది.
* 2002, 2003 – ఈ రెండేళ్లలో మెగాస్టార్ చిరంజీవి.. రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలతో తన అభిమానుల దాహార్తిని తీర్చాడు. 2002 విడుదలైన ‘ఇంద్ర’ .. అలాగే 2003లో విడుదలైన ‘ఠాగూర్’.. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీసుని షేక్ చేశాయి.
* 2017 – దాదాపు చిత్రసీమ నుండి రాజకీయాల్లోకి వెళ్ళి పదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్నారు చిరంజీవి. మళ్ళీ సినిమాల్లోకి పునరాగమనం చేసింది 2017లో మాత్రమే. ఈ సంవత్సరం విడుదలైన ‘ఖైదీ నెం 150’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి.. మరోసారి తన చరిష్మా ఏమాత్రం కూడా తగ్గలేదు అని నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
“సైరా” చిత్రంలో.. కథను మలుపు తిప్పే మెగా డాటర్..?
* 2019 – దాదాపు 150 చిత్రాల కెరీర్‌లో తొలిసారిగా ఒక కాస్ట్యూమ్ డ్రామా చిత్రంలో నటించాడు చిరంజీవి. ఆ చిత్రం మరేదో కాదు – సైరా నరసింహారెడ్డి. చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో.. అమితాబ్ బచ్చన్ నుండి మొదలుకుని సుదీప్, రవికిషన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి ఇలా ఎందరో ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రం.. అక్టోబర్ 2, 2019 తేదిన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మొన్ననే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకుల అభిమానం చూరగొంది.
ఇవి చిరంజీవి ఒక సాధారణ నటుడి స్థాయి నుండి.. ఈ దేశం గర్వించదగ్గ ఒక గొప్ప మెగాస్టార్‌గా ఎదిగిన క్రమంలోని ఒక 10 కీలక మైలురాళ్ళు.
POPxo తెలుగు తరపున ఆ మేటి నటుడికి జన్మదిన శుభాకాంక్షలు