సోనాలీ బింద్రే (Sonali bendre).. నిర్మా గర్ల్‌గా మనకు పరిచయమై మనందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న సుందరి. మురారి, మన్మథుడు, ఖడ్గం చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంది. గతేడాది తనకు క్యాన్సర్ (Cancer) ఉందని సోనాలీ మనందరితో వార్తను పంచుకున్నప్పుడు.. చాలామంది తమ కుటుంబ సభ్యులకే ఆ సమస్య వచ్చినంతగా బాధపడ్డారు.
తొందర్లోనే క్యాన్సర్ బారి నుండి బయటపడి ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని చాలామంది ఆకాంక్షించారు. అందరి ఆదరాభిమానాలతో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ పూర్తి చేసుకొని తిరిగి స్వదేశంలో అడుగుపెట్టింది సోనాలీ. అంత ప్రాణాంతకమైన వ్యాధి ఎదురైనా గుండెనిబ్బరంతో ఆమె నిలిచిన తీరు స్పూర్తిదాయకం.
గతేడాది జులైలో హైగ్రేడ్ మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన సోనాలీ అమెరికాలోని స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంది. కొన్ని నెలల ట్రీట్‌మెంట్ తర్వాత భారత్‌కి తిరిగొచ్చిన ఆమె.. తన ట్రీట్‌మెంట్ గురించి మాట్లాడుతూ – ఇది కేవలం ఇంట్రవెల్ మాత్రమే అని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు రోజుల క్రితమే సోనాలీ తిరిగి అమెరికాకి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోవడం ప్రారంభించింది. క్యాన్సర్ గురించి తెలియకముందు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. టీవీ షోలు, ప్రకటనలతో సోనాలీ బిజీగా ఉండేది. ట్రీట్‌మెంట్ సమయంలోనూ పుస్తకాలు చదువుతూ, స్నేహితులతో సమయం గడుపుతూ ధైర్యంగా తన జీవితాన్ని కొనసాగించింది సోనాలీ.
క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తర్వాత జుట్టు వూడిపోయినా.. ధైర్యంగా దాన్ని కూడా ఫ్యాషన్‌గా మార్చింది సోనాలీ. తాజాగా ఓ ప్రకటనలో కనిపిస్తూ అమ్మలందరికీ ఓ చక్కటి సందేశాన్ని సోనాలీ అందించింది. ఆల్ అవుట్ ఇండియా వారు రూపొందించిన “ముఝే సబ్ నహీ పతా #mujhesabnahipata (నాకు అన్ని విషయాలూ తెలీవు)” అనే ప్రకటనలో నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా ఈ సంస్థ ప్రమోషన్లలో భాగంగా సోనాలీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకర్షిస్తోంది.
ఇందులో భాగంగా.. “చిన్నతనంలో మా బామ్మ తన చీరకొంగును ముడివేసుకునేది. ఎందుకని నేను అడిగితే “నాకు అన్నీ గుర్తుండవు కదా. అందుకే నేను చేయాల్సిన పనులు మర్చిపోకుండా నాకు గుర్తు చేసేందుకు ఇలా కొంగును ముడివేస్తూ ఉంటానని” చెప్పింది. ఇప్పుడు మీరు కూడా ఇలా కొంగును ముడివేసుకొని ముఝే సబ్ నహీ పతా #mujhesabnahipata (నాకు అన్ని విషయాలూ తెలీవు) అంటూ మీకు తెలియని విషయాలను పంచుకోండి.
ఇది మరో తల్లి మీలాంటి సందర్భం ఎదుర్కోకుండా ముందుజాగ్రత్త పడేలా వారికి తోడ్పడుతుంది. ఈ రక్షణ ముడి వేసి మన పిల్లలనే కాదు.. మన పిల్లల్లాంటి మరికొందరిని కూడా కాపాడేందుకు కంకణం కట్టుకుందాం. “నాకు తెలీదు ” అని చెప్పడం ఓ తల్లికి కాస్త కష్టమే.. కానీ ధైర్యం ఉంటేనే కానీ నాకు ఈ విషయం తెలీదు, అని మనం ఒప్పుకోలేం కాబట్టి ధైర్యంగా ముందడుగు వేద్దాం” అని చెప్పుకొచ్చింది సోనాలీ. అంతేకాదు.. ఇలాంటి కథలను పంచుకోమని తన స్నేహితులను కూడా నామినేట్ చేసింది.
ఆల్ అవుట్ సురక్ష ప్రమోషన్స్‌లో భాగంగా ఇదంతా చేసింది సోనాలీ.. కొన్ని రోజుల ముందు విడుదలైన ఈ ప్రకటన కూడా మంచి స్పందనని సంపాదించుకుంది.
“అమ్మంటే సూపర్ విమెన్ అని.. బిడ్డకు ఏం జరిగినా అమ్మకి తెలిసిపోతుందని.. అమ్మకు అన్నీ తెలిసి ఉండాలని అనడం సరికాదు. అమ్మ కూడా మనిషే కాబట్టి.. తనకు తెలియని విషయాలు కూడా ఎన్నో ఉంటాయని చెబుతుందీ ప్రకటన. మనకు తెలియని చాలా విషయాలు మన బిడ్డలకు సమస్య ఎదురయ్యాకే తెలిసొస్తాయి. కానీ మన బిడ్డకు జరిగినట్లు ఇతరులకు జరగకుండా ఉండాలని భావించేవాళ్లే మంచి తల్లులు.
అందుకే మీ జీవితంలో మీకు తెలియని విషయాల వల్ల.. మీరు లేదా మీ పిల్లలు ఏవైనా సమస్యలు ఎదుర్కొని ఉంటే వాటిని మాతో పంచుకోండి. దీనివల్ల మీలా ఇంకొందరు తల్లులు బాధపడకుండా మీరు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే జీవితం చాలా విలువైనది. బతుకు విలువేంటో నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఈ విషయం చెబుతున్నా” అంటూ సోనాలీ ఆ ప్రకటనలో చెబుతుంది. కీర్తి అనే యువతికి తన బాబుకి డెంగ్యూ వచ్చేవరకూ.. ఆ వ్యాధికి కారకాలైన దోమలు మంచినీళ్లలోనూ పెరుగుతాయని, పగటిపూటే కరుస్తాయని తెలీదు. ఆ అవగాహన లోపమే తన బాబుని ఆసుపత్రి వరకూ చేర్చిందని ఆమె చెబుతూ.. తనలా ఇంకెవరికిీ ఇలా జరక్కూడదని ఈ విషయాన్ని పంచుకుంటున్నట్లు తెలిపింది. ఎలాంటి హృదయాన్నైనా ఇట్టే కరిగించే ఈ ప్రకటన ఇటీవలి కాలంలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఈ సంగతి పక్కన పెడితే మరోసారి ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లిన సోనాలీ తన గత రోజులను గురించి.. తనకు జరిగిన ట్రీట్‌మెంట్ గురించి చెబుతూ “ఇదిప్పుడు నాకు రోజువారీ సాధారణ విషయంగా మారిపోయింది” అని ప్రకటించింది. తన చికిత్సను పూర్తిచేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో సోనాలీ తిరిగి స్వదేశానికి రావాలని కోరుకుందాం.
ఇవి కూడా చదవండి.
అమ్మాయిలూ.. వీటి గురించి అసలు బాధ పడాల్సిన అవసరమే లేదు..!
డియర్ మమ్మీ… నా మనసు చెప్పే మాటలు వింటావా ప్లీజ్..?
ఈ బిడ్డ మా ప్రేమకు ప్రతిరూపం.. కులాలకు అతీతం: అమృత ప్రణయ్