సంగీతం నుండి నటన వైపు.. (నాడు ఎస్పీ బాలు, ఆర్పీ పట్నాయక్.. నేడు రఘు కుంచె)

సంగీతం నుండి నటన వైపు.. (నాడు ఎస్పీ బాలు, ఆర్పీ పట్నాయక్.. నేడు రఘు కుంచె)

సినిమా అంటేనే 24 క్రాఫ్ట్స్ అంటుంటారు. ఆ 24 క్రాఫ్ట్స్‌లో సంగీతానికి చాలా ప్రాధాన్యముంది. ఇక ఆ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో కొందరు అనూహ్యంగా నటన వైపు మొగ్గు చూపడం ఒకరకంగా మనకు ఆశ్చర్యం కలిగించినా.. అదే సమయంలో కచ్చితంగా ఆసక్తిని కూడా కలిగిస్తుంది. 

మన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకులుగా రాణించి కూడా..  నటులుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అలాంటివారిలో - చక్రవర్తి, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఆర్ఫీ పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్ లాంటివారు తెలుగు తెరపై నటులుగానూ రాణించారు. ఒకవైపు సంగీత దర్శకులుగా వారి ప్రతిభను కనబరుస్తూనే.. నటనతో సైతం.. అందరిని ఆకట్టుకుని ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు.

"ప‌ల్లె కోయిల" ప‌స‌ల బేబీ నోట.. రఘు కుంచె పాట

ఇక తాజాగా ఇదే జాబితాలోకి ప్రముఖ వ్యాఖ్యాత, సంగీత దర్శకుడు, గాయకుడు, నిర్మాత రఘు కుంచె (Raghu Kunche) కూడా చోటు సంపాదించుకున్నారు. 

Raghu Kunche in Palasa 1978 (Twitter)

వివరాల్లోకి వెళితే, పలాస 1978 అనే పేరుతో తెరకెక్కిన ఓ చిత్రంలో ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నారు రఘు కుంచె. తొలుత ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా సైన్ చేసిన రఘు కుంచెకు.. చిత్ర దర్శకుడు కరుణ కుమార్ ఓ చిత్రమైన షాక్ ఇవ్వడం జరిగింది. ఆ షాకే - ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి ఆఫర్ ఇవ్వడం.

ఇక ఆ చిత్రంలో రఘు పోషించే ప్రతినాయక పాత్ర కూడా.. దాదాపు నాలుగు రూపాల్లో మనకి తెరపై కనిపిస్తుందట. 30, 40, 50, 70 ఏళ్ళ గెటప్స్‌లో మనకి రఘు కుంచె ఈ సినిమాలో కనపడతారు. ఈ పాత్రని ఓ నిజ జీవిత పాత్ర నుండి స్ఫూర్తిని పొంది తీర్చిద్దిదడం జరిగింది. ఇక ఈ పాత్ర కోసం రఘు కుంచె కూడా.. పాత్ర ఆహార్యానికి సరిపోయేలా దాదాపు 10 కిలోల వరకు బరువు పెరిగారట.

కొద్దిసేపటి క్రితమే ఆ చిత్రంలో ఆయన లుక్‌కి సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రఘు కుంచె అభిమానులే కాకుండా.. సగటు సినీ అభిమానులు కూడా ఈ ఫోటోలలో రఘు కుంచెని చూస్తూ ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అలాగని రఘుకి నటన కొత్తేమీ కాదు. గతంలో ఆయన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కిన "ఎడారి వర్షం" అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ.. యండమూరి దర్శకత్వంలో రూపొందిన "తులసీదళం" సీరియల్‌లోనూ నటించారు.  

అయితే తొలిసారి ఓ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కాస్త తటపటాయించినప్పటికీ.. ఆ తరువాత పాత్ర పరిధి ఏంటి? అనే విషయాన్ని రఘు ఆలోచించారట. ఆ తర్వాత పాత్ర కోసం హోమ్ వర్క్ బాగా చేసి, తనపై దర్శకుడు కరుణ కుమార్ పెట్టిన నమ్మకానికి 100 శాతం న్యాయం చేయాలన్న తపనతో నటించానని ఆయన తెలిపారు. మరి ఆయన కష్టానికి తగ్గ ఫలితం ఎలా ఉంటుందనేది  సినిమా విడుదలయ్యాక కాని చెప్పలేం. అయితే విడుదలైన లుక్స్ చూస్తుంటే కచ్చితంగా ఆయన తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశారనే తెలుస్తోంది. 

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ టాక్ - పూరి జగన్నాధ్ మార్క్ హీరోగా రామ్

Raghu Kunche Palasa 1978

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలవ్వగా... చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ప్రముఖ నిర్మాత-దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, సుధా మీడియా పతాకం పై ధ్యాన్ అట్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. అంతే సహజంగా చిత్రీకరించారు ఛాయాగ్రాహకుడు అరుళ్ విన్సెంట్. అలాగే ఈ సినిమాలో ప్రతినాయకునిగా రఘు కుంచె కనిపిస్తుంటే.. లండన్ బాబులు మూవీ ఫేమ్ రక్షిత్, నక్షత్రలు హీరో & హీరోయిన్స్‌గా నటించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చేశారట. అదే సమయంలో కథ కూడా పలాస ప్రాంతానికి  చెందింది కావడంతో,. అక్కడ కూడా కొంత భాగం షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. 

కాగా.. సినిమాల్లో అందరికి ఒక్కసారిగా స్వీట్ షాక్ ఇచ్చిన రఘు కుంచెకి.. ఈ సినిమాలో పాత్ర ద్వారా మంచి బ్రేక్ రావాలని మనమూ కోరుకుందాం. అలాగే ఈ సినిమాకి ఆయన అందించిన స్వరాలు కూడా ప్రేక్షకులని అలరించాలని ఆశిద్దాం.

 

దొరసాని ట్రైలర్ టాక్ - ప్రేమ కూడా ఒక ఉద్యమమే..!