నేచురల్ స్టార్ నానీ (Nani) .. జెర్సీ సినిమా సాధించిన విజయాన్ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. హీరోగా అంచెలంచెలుగా ఎదిగి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ యువ హీరో.. గతేడాది నిర్మాతగా కూడా తన లక్ పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ (Wall Poster) పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించి తొలిప్రయత్నంగా ఆయన ‘అ’ (Awe) అనే సినిమాని తీశారు.
ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) , నిత్యా మేనన్ (Nithya Menen), ఈషా రెబ్బా (Eesha Rebba).. వంటి ప్రముఖ తారలు నటించిన విషయం మనకు విదితమే. చక్కని సామాజిక సందేశం అందించే ఉద్దేశంతో తీసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ చిత్రానికి కథకుడిగా, దర్శకుడిగా కూడా వ్యవహరించారు. కాకపోతే బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఊహించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయిందనే చెప్పాలి. అయినా సరే.. ఒక నిర్మాతగా మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించినందుకు సంతోషంగా ఉందని తన హర్షాన్ని నాని వ్యక్తం చేశారు.
తన నిర్మాణ సంస్థ ద్వారా నూతన నటీనటులకు అవకాశం ఇస్తానని, అలాగే వినూత్న కథాంశం ఉంటే తప్ప.. సినిమా తీయనని నిర్మాణ సంస్థ ప్రారంభించిన తొలిరోజునే ప్రకటించారు నాని. ‘అ’ చిత్రాన్ని నిర్మించిన ఏడాది కాలం తర్వాత మరో చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
ఇటీవల జరిగిన ఫలక్ నుమా దాస్ (Falaknuma Das) ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో నాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే నాని నిర్మించే చిత్రం గురించి ప్రకటించడానికి ఈ వేదికనే ఎందుకు ఎంచుకున్నారు? అనేగా మీ సందేహం.
అక్కడికే వస్తున్నామండీ.. “ఈ నగరానికి ఏమైంది” సినిమా ఫేమ్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రూపొందిన చిత్రం “ఫలక్ నుమా దాస్”. ఈ నెల 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ- రిలీజ్ వేడుకకు నాని ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలోనే తాను తన రెండో చిత్రాన్ని నిర్మించనున్న విషయాన్ని నాని ప్రకటించారు. ఆ సినిమాకు హీరోగా విశ్వక్ సేన్‌ని సెలెక్ట్ చేశానని.. నాని ప్రకటించడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అయితే నాని తన సినిమాలో హీరో గురించి ప్రస్తావించారు తప్ప.. సినిమాకు సంబంధించిన మిగతా విశేషాలేవీ చెప్పకపోవడం గమనార్హం. ఆ సినిమా కథానాయిక ఎవరు? దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు? ఏ నేపథ్యంతో సినిమా రూపొందుతోంది.. వంటి వివరాలేవీ ఆయన ప్రకటించలేదు. అయితే తన మొదటి చిత్రం పెద్ద ఫలితాన్ని తీసుకురాకపోయినా.. నాని తన రెండవ చిత్రంలో ఓ కొత్త హీరోకి అవకాశం ఇవ్వడం వెనుక కారణం ఏమై ఉంటుందా? అన్న సందేహం కూడా సినీ అభిమానులకు కలుగుతోంది.
కష్టపడే తత్వంతో పాటు తనకంటూ ఒక విభిన్నమైన స్టైల్ కలిగిన విశ్వక్ సేన్ పై.. నానికి గల నమ్మకమే తనని హీరోగా పెట్టి సినిమా తీసేలా చేసిందని పలువురు అంటున్నారు. పైగా నాని కొత్తవాళ్లతోనే సినిమా తీస్తానని తొలుతే చెప్పారు కాబట్టి.. ఈ క్రమంలో విశ్వక్ సేన్ నటన నచ్చి కూడా ఈ ప్రాజెక్టుకి ఆయనను తీసుకున్నారని టాక్.
“ఈ నగరానికి ఏమైంది” చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ కథానాయకుడు విశ్వక్ సేన్. ఆయన నటించిన తాజా చిత్రం ఫలక్ నుమా దాస్. ఈ సినిమా టీజర్ విడుదలైన క్షణం నుంచే ఆయనపై ఉన్న నమ్మకంతో పాటు, సినిమాపై అంచనాలు కూడా మరింత పెరిగాయి. ఇప్పుడు హీరోగా ఓ చిత్రం విడుదలవుతుండగానే.. తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ప్రకటన రావడంతో మరింత సంతోషిస్తున్నాడు విశ్వక్ సేన్.
భిన్నమైన కథలను ఎంపిక చేసుకునే నాని.. ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యువ కథానాయకుడు విశ్వక్ సేన్.. వీరిరువరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఎలా ఉండనుందో తెలియాలంటే.. ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఆసక్తికర ప్రకటన
సీత అని కాకుండా.. శూర్ఫణక అని పేరు పెట్టాలా: టైటిల్ కాంట్రవర్సీలో కాజల్ సినిమా
సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!