ADVERTISEMENT
home / Family
అంతా వేలెత్తి చూపారు.. అయినా కష్టపడి అనుకున్నది సాధించా : స్వప్న

అంతా వేలెత్తి చూపారు.. అయినా కష్టపడి అనుకున్నది సాధించా : స్వప్న

స్వప్న (Swapna).. ఈ పేరు చెబితే మనకు ఎవరూ గుర్తురాకపోవచ్చు. కానీ న్యూస్ ప్రజెంటర్ స్వప్న (Swapna) అంటే తెలుగు లోగిళ్లలో అందరికీ సుపరిచితమే. ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుతో.. హుందాగా, వైవిధ్యమైన రీతిలో సెలబ్రిటీలందరినీ ఇంటర్వ్యూలు చేయడంతో పాటు తాను అడగాలనుకున్న ప్రశ్నలన్నింటినీ ధైర్యంగా అడిగే ఆమె మనందరికీ తెలిసిన వ్యక్తే. బుల్లితెరపై చిరునవ్వులు విరబూయిస్తూ మాట్లాడే స్వప్న.. తన గుండెల్లో కొండంత బాధను దాచుకుందన్న విషయం మనలో చాలామందికి తెలీదు. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ పేజీలో తన కథను పంచుకొని తన పిల్లలకు తనే తల్లీ తండ్రీగా మారి పెంచిన విధానం గురించి చెప్పుకొచ్చిందామె. తన కథ ఆమె మాటల్లోనే విందాం రండి..

Facebook

ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి నా పిల్లలే  కారణం. వాళ్లే నాకు ఆత్మస్థైర్యాన్ని అందించారు. జీవితం మా ముందు ఉంచిన సమస్యలన్నింటిలోనూ వారే నాకు తోడు, నీడగా నిలిచారు. నా జీవితం చిన్నతనం నుంచి కష్టాలతోనే సాగింది. బాల్యం నుండీ సమస్యల మధ్యనే పెరిగాను. ఎంతో ఒత్తిడిని కూడా భరించా. నాకు పదహారేళ్లు ఉన్నప్పుడే మా అక్క అనుకోకుండా ఓ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత రెండేళ్లకే నా కుటుంబ సభ్యులు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. వాళ్లు చూపించిన అబ్బాయినే వివాహమాడా.

ADVERTISEMENT

పెళ్లయ్యాక అమెరికాకి వెళ్లిపోయాను. ఆ తర్వాత వెంటవెంటనే ఇద్దరు పిల్లలు పుట్టారు. అలా పెళ్లయిన కొన్నేళ్లకే ఇద్దరు పిల్లల తల్లినయ్యా. మా పెళ్లయ్యా ఏడు సంవత్సరాలు కాకముందే.. నా భర్త నన్ను, పిల్లలను వదిలించుకోవాలనుకున్నాడు. ఏవేవో కారణాలు చెప్పి వదిలేశాడు. ఓ వివరణ, ఓ క్షమాపణ వంటివేవీ లేవు. కేవలం లేని కారణాలను చూపించి.. వాటిని నిజాలుగా నిరూపించి మమ్మల్ని వదిలేశాడు. దాంతో ఇద్దరు పిల్లలతో నేను ఇండియా చేరుకున్నా. మా కాళ్ల పై మేం నిలబడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇద్దరు పిల్లలతో నేను ఒంటరిగా జీవించడం అప్పట్లో అందరినీ మా వైపు వేలెత్తి చూపేలా చేసింది. మా గురించి పట్టించుకున్నవారు లేరు. సరి కదా.. మాపైనే నిందలు వేయడం ప్రారంభించారు. నేను ఎదుర్కొన్న సమస్యలు, దానివల్ల మేం పడుతున్న బాధ, ఇవేవీ వారికి అవసరం లేదు. అందుకే మేం కూడా మా జీవితానికి సంబంధించిన ప్రతి సమస్యతోనూ ధైర్యంగా పోరాడాం. నేను కష్టపడి ఉద్యోగం చేసి నా పిల్లలను పోషించడం మాత్రమే కాదు.. చుట్టుపక్కల వారి నుంచి వచ్చే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతూ అన్ని కష్టాలను ఒంటరిగానే భరించాను.

Facebook

ADVERTISEMENT

ఉద్యోగం చేసే చోట కూడా అందరూ నన్ను పెళ్లి కాని అమ్మాయి అనుకునేవాళ్లు. కానీ నేను నా పిల్లల గురించి చెప్పగానే వాళ్లందరి ముఖాల్లో ఎన్నో సందేహాలు కనిపించేవి. వారికి ఎదురయ్యే ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేకపోయేదాన్ని. నా పిల్లల కోసం నేను ఎంతో కష్టపడి పనిచేసేదాన్ని. మా ముగ్గురి కోసం నేను పడే శ్రమ నాకు ఆనందాన్నే అందించేది. నా అభిప్రాయంలో మన మనస్తత్వం ఎలాంటిదో అలాగే వ్యవహరిస్తూ.. ప్రతి ఒక్కరితోనూ నిజాయతీతో వ్యవహరిస్తే చాలని నా భావన.

నేను నా జీవితంలో జరిగిన పాత సంఘటనలను అన్నింటిని  మర్చిపోయి ముందుకు వెళ్లాలనుకున్నా. మనకు హాని చేసిన వారిని కూడా మనం క్షమించగలిగితే చాలు. పాత విషయాలు మనకు గుర్తుండవు. మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అలా చేయడం వల్లే నేను  నా పిల్లల జీవితంపై దృష్టి పెట్టగలిగాను. నా కెరీర్, నా ఉద్యోగంలో పూర్తిగా నిమగ్నమవ్వగలిగాను.

నేను నా ప్రొఫెషన్‌లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పనిచేశాను. పెద్దగా సెలవులు కూడా పెట్టలేదు. లింగ వివక్ష, లైంగిక హింస వంటివి కూడా ఎదుర్కొన్నా. నా శ్రమతో నాకు దక్కిన సక్సెస్ పైన కూడా ఇతరులు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ నేను నా చుట్టూ ఉన్న నెగిటివిటీని పెద్దగా పట్టించుకోకుండా కేవలం పాజిటివ్ విషయాలపైనే దృష్టి సారించి ముందుకు వెళ్లాలనుకున్నా. దైవ మార్గం ఎంచుకున్నా. నాకు ఏ సమస్య ఎదురైనా దేవుడే చూసుకుంటాడని భావించాను. న్యూస్ ఇండస్ట్రీలో చాలాకాలం పాటు పనిచేసిన తర్వాత తితిదే కోసం భక్తి గీతాల ఆల్బమ్ చేశాను. ఆ అనుభవం నన్ను పూర్తిగా మార్చేసింది.

ADVERTISEMENT

Facebook

ఇప్పుడు నాకు సొంత ఇల్లుంది. నా పిల్లలు కష్టపడి చదువుకుంటున్నారు. తమ జీవితంలో ఏదో సాధించాలనే తపన వారికి ఉంది. నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి సమస్యలోనూ.. నా పిల్లలు నాకు తోడు నిలిచారు. వారు ఎదగడం చూస్తూనే మనిషిగా నేను ఎదిగాను. నా పిల్లల సరైన ఎదుగుదలలో నాకు నా తల్లిదండ్రులు కూడా ఎంతో సహకారం అందించారు. వీరందరితో పాటు నాకు, నా పిల్లలకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నందుకు దేవుడికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.

జీవితంలో నేను ఇప్పటివరకూ ఎన్నో నేర్చుకున్నా. ఇప్పటికీ నేను ఏ విషయం గురించి బాధపడట్లేదు. ప్రేమలో పడేందుకు కొత్తవ్యక్తులతో నా జీవితాన్ని పంచుకునేందుకు కూడా ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. జీవితం నాకు ప్రతి ఒక్కటీ తనదైన రీతిలో అందించింది. దాని ద్వారా నేర్చుకున్న పాఠాలకు గాను.. నేను నా జీవితానికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈరోజు కూడా భవిష్యత్తులో జీవితం నాకోసం ఏది సిద్ధం చేసి ఉంచిందో వేచిచూస్తూ రోజులు గడిపేందుకు సిద్ధమవుతాను.

జీవితం తనవైపు విసిరిన సవాళ్లనే రాళ్లను.. తన కాళ్లకింద మెట్లుగా మార్చుకొని పైకి ఎదిగింది స్వప్న. తాను ఎదగడం మాత్రమే కాదు.. తాను వెళ్లిన మార్గంలో, సాధించిన సక్సెస్‌తో చాలామందికి ఆదర్శంగా నిలిచింది స్వప్న. తను జీవితంలో ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి. 

పెళ్లి తర్వాత నాకు సినిమా ఆఫర్లు తగ్గాయి : సమంత

ఈ యువకుడు అమ్మ కు రెండో పెళ్లి చేశాడు.. ఎందుకో తెలుసా..?

ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించిన ఏక్తా.. సింగిల్‌గా ఎందుకు మిగిలిందో తెలుసా?

ADVERTISEMENT
17 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT