ఈ హోట‌ల్స్ పేర్లు విభిన్నం.. కానీ రుచి మాత్రం అద్భుతం..!

ఈ హోట‌ల్స్ పేర్లు విభిన్నం.. కానీ రుచి మాత్రం అద్భుతం..!

ఎక్కడికైనా వెళ్లినప్పుడు లేదా కొత్త ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించిన‌ప్పుడు ఆ చుట్టుప‌క్క‌ల ఉన్న‌ రెస్టారెంట్లు, హోటళ్ల గురించి మనం కచ్చితంగా వెతుకుతాం లేదా వాటి గురించి తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తాం. వాటిలో కొన్ని పేర్లు మనల్ని బాగా ఆకర్షిస్తాయి.


వైవిధ్యంగా ఉండటంతో పాటు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పేర్లతో ఉన్నవి మనల్ని తమ వైపు తిప్పుకొంటాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి భిన్న‌మైన పేర్ల‌తో హోటళ్లున్నాయి. అచ్చ తెలుగు వంటకాల పేర్లతో ఏర్పాటైన ఆ రెస్టారెంట్లు.. పసందైన వంటకాలతో భోజనప్రియులను సైతం ఆకట్టుకొంటున్నాయి. అలాంటి వాటిలో కొన్ని హోట‌ల్స్ (hotels) గురించి చూద్దాం.


ఎప్పుడైనా, ఎక్కడైనా ఇంటి రుచి దేనికీ రాదు. ఈ విషయం మనం కూడా చాలా సార్లు అనుకొంటాం. అందుకేనేమో విశాఖపట్నంలోని ఓ రెస్టారెంట్‌కు ‘మీ ఇంటి కూర’ అని పేరు పెట్టారు. విశాఖపట్నం మద్దిలపాలెం డబుల్ రోడ్డులో ఈ భోజనశాల ఉంటుంది. పేరుకు తగ్గట్టే ఇక్కడ కమ్మని భోజనం దొరుకుతుంది. 


పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. ఇంట్లో శుభకార్యం జరిగినా.. అరిటాకుల్లో భోజనం చేయడం మన తెలుగింటి సంప్రదాయం. ఈ విషయాన్ని మనకు గుర్తు చేయాలనుకొన్నారో ఏమో కానీ.. తమ రెస్టారెంట్‌కు హోటల్ అరిటాకు అని పేరు పెట్టారు. ఇది కూడా విశాఖపట్నంలోనే ఉంది.ఎన్‌ఏడీ కొత్త రోడ్డులో ఉన్న మరో భోజనశాల వంటిల్లు. విశాఖ వాసులకు వంటిల్లు అనే కంటే.. రత్నవారి వంటిల్లు అంటే బాగా అర్థమవుతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు ఇక్కడ భోజనప్రియుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మనం తినే ఆహారం అంతా వంటింట్లోనే తయారవుతుంది. దాని ఆధారంగానే వంటిల్లు అని పేరు పెట్టారు.


అచ్చ తెలుగు పండగ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే పిండివంటలు, ఘుమఘుమలాడే వంటకాలు. మరి, అలాంటి రుచులు అందిస్తున్నామని చెప్పడానికేనేమో.. విజయవాడలోని ఓ హోటల్‌కు సంక్రాంతి అని పేరు పెట్టారు. నగరంలోని బెంజ్ సర్కిల్‌లో ఉంటుంది ఈ రెస్టారెంట్. సింగపూర్‌లో సైతం ఇదే పేరుతో రెస్టారెంట్ ఉండటం విశేషం.


kakka-buvva-1


కక్క బువ్వ.. చిన్న పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు ఇదుగో కక్క.. ఇదుగో బువ్వ అని పెడుతుంటాం. దాన్నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొన్నారో ఏమో.. వైజాగ్‌లోని ఎన్ ఏడీ జంక్షన్లో ఓ హోటల్‌కు కక్క బువ్వ అని పేరు పెట్టారు నిర్వాహకులు.


గుంటూరు, కృష్ణా జిల్లా వాసులు ఉలవచారుని బాగా ఇష్టపడతారు. దాని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇతర ప్రాంతాల్లో సైతం పెళ్లిళ్లలో ప్రత్యేకంగా ఉలవచారును వండి వడ్డిస్తున్నారు. ఈ ఉలవచారు పేరుతోనే జూబ్లీహిల్స్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ రెండూ దొరుకుతాయి. పైగా రుచికరంగా కూడా ఉంటాయి.‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాల వారి విందు హ్హహ్హహ్హ నాదే ముందు..’ అంటూ మాయాబజార్‌లో కమ్మని వంటకాల రుచిని ఆస్వాదిస్తూ ఎస్వీయార్ గారు పాట పాడతారు. ఆయనలానే మనమూ ఆస్వాదిస్తూ తినాలనుకొన్నారో ఏమో తెలియదు కానీ.. ‘వివాహ భోజనంబు’  పేరుతో తెలుగింటి రుచులు అందిస్తున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం 10లో ఉంది ఈ వివాహ భోజనంబు రెస్టారెంట్. ఇంతకూ ఈ రెస్టారెంట్ ఎవరిదో తెలుసా? ఇంకెవరదీ టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌ది.


అలాగే హైదరాబాదులోని షేక్ పేట ప్రాంతంలో కనిపించే "దిబ్బరొట్టె" రెస్టారెంట్ కూడా చాలా ఫేమస్. బహుశా ఇంత వెరైటీ పేరును హోటల్‌కి పెట్టడం ఇదే ప్రథమం.


dibbarotti-restaurant


అర్థరాత్రి అల్పాహారం. పేరేమిటి విచిత్రంగా ఉందనుకొంటున్నారా? మాదాపూర్ కావూరి హిల్స్‌లో ఉంది ఈ అల్పాహార శాల. సాధారణంగా హోటల్స్, భోజన శాలలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంటాయి. కానీ ఈ అల్పాహార శాల మాత్రం రాత్రి తొమ్మిదిన్నర నుంచి తెల్లవారుజాము నాలుగున్నర వరకు తెరిచి ఉంటుంది. హోటల్‌కి తగ్గ పేరు పెట్టారు కదా..!


ఇక కొండాపూర్‌లో కూడా "ఉప్పూ కారం" పేరుతో ఒక హొటల్ నిర్మించారెవరో. బిర్యానీ, పులావ్, స్టార్టర్స్ అన్నీ ఈ స్పెషల్‌గా దొరుకుతాయంట.


uppu-karam


తెలుగు వంటకాల్లో గోంగూరది ప్రత్యేకమైన స్థానం. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, మటన్ గోంగూర, గోంగూర చికెన్, గోంగూర రొయ్యలు.. ఇలా గోంగూరను రకరకాలుగా వండుకొని దానిపై మక్కువ చాటుకొంటారు భోజ‌న ప్రియులు. అందుకేనేమో  విశాఖ పట్టణంలోని ఎన్ ఏడీ కొత్త రోడ్డులో ఓ భోజనశాలకు గోంగూర అని పేరు పెట్టారు. విశాఖలో మాత్రమే కాదు  ఏలూరు, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా ఈ పేరుతో రెస్టారెంట్స్ ఉన్నాయి.చిట్టి‌గారెలను కోడికూరలో నంజుకొని తింటే ఆ రుచే వేరు. అసలు ఆ టేస్ట్‌కు సాటి మరేదీ రాదు. అందుకేనేమో తమ రెస్టారెంట్‌కు ‘కోడికూర చిట్టి గారె’ అని పేరు పెట్టారు నిర్వాహకులు. గచ్చిబౌలిలో ఉన్న ఈ రెస్టారెంట్ దక్షిణ భారత వంటకాలను స్పైసీగా అందిస్తోంది.


aritaku-1


ఇవే కాకుండా  మా ఊరి వంటకాలు, తాలింపు, తాంబూలం, ఇస్తరాకు, వంటకం.. వంటి విభిన్నమైన తెలుగు పేర్లతో తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి. ఇలాంటి తెలుగు పేర్లతో మీకు తెలిసిన రెస్టారెంట్లు ఏవైనా ఉంటే వాటిని మాతో పంచుకోండి.


Featured Image: Pixabay.com


ఇవి కూడా చ‌ద‌వండి


తన జీవితంలో జరిగే ఈ సంఘటనలను ఏ ఆడపిల్ల ఎప్పటికీ మరచిపోదు..


ఇంట్లో ఒంటరిగా ఉంటే.. అమ్మాయిలు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో తెలుసా?


అల్లరి పిడుగు బుడుగు.. మనింట్లో చిచ్చర పిడుగైతే..?