దర్శకుడు పూరి జగన్నాధ్ (Puri Jagannadh) అంటేనే కాస్త వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొనే దర్శకుడు. ఆయన సృష్టించే హీరోలకి కాస్త టెంపరితనంతో పాటు.. మరికాస్త లెక్కలేనితనం కూడా ఉంటుంది. ఆయన సినిమాలలోని పాత్రలను చూస్తే.. ఇలాంటి క్యారెక్టర్లకు కేవలం పూరీ జగన్నాథ్ మాత్రమే రూపకల్పన చేయగలడని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.
కాకపోతే ఈ మధ్యకాలంలో ‘పూరీ’ వరుస ఫ్లాపులతో కెరీర్‌లో సతమతమవుతున్నాడు అన్నది సత్యం. ఈ తరుణంలో ఆయన తీస్తున్న కొత్త చిత్రం తనను ఫ్లాపుల నుండి బయటపడేస్తుందా? లేదా? అనే ఆందోళనలో ఆయన అభిమానులున్నారు.
ఇలాంటి పరిస్థితిలో పూరి జగన్నాధ్ నుండి వస్తున్న తాజా చిత్రమే – ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar). ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. ఇక ఆ చిత్రానికి “ఇస్మార్ట్ శంకర్” అనే వెరైటీ టైటిల్ పెట్టగానే ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. మరి అంతటి భారీ అంచనాలున్న ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
దొరసాని ట్రైలర్ టాక్ – ప్రేమ కూడా ఒక ఉద్యమమే..!
ఇంతకి ఇస్మార్ట్ ట్రైలర్ ఎలా ఉందంటే ..!
ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. పూరి జగన్నాధ్ సినిమాలలో హీరో ఎలాగైతే కాస్త వైవిధ్యంగా ఉంటాడో.. ఈ చిత్రంలో హీరో రామ్ కూడా అచ్ఛం అలాగే ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో కనిపిస్తున్నాడు రామ్. పక్కా హైద్రాబాదీ ఎలాగైతే మాట్లాడతాడో.. అదే రీతిలో రామ్ పలికే సంభాషణలున్నాయి. ఆ పాత్ర వ్యవహారశైలి కూడా అలాగే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఫక్తు కమర్షియల్ ట్రైలర్‌గా ఈ చిత్రం మనకి కనిపిస్తోంది.
అయితే ఈ ట్రైలర్‌లో కాస్త ఆసక్తిని కలిగించే అంశం ఏంటంటే – రామ్‌కి తెలియకుండా అతని తలలో ఓ చిప్‌ని ప్రవేశపెడతారు. ఆ పని చేసేది కూడా పోలీసులే కావడం గమనార్హం. ఇది కాస్త రొటీన్‌కి భిన్నంగా అనిపించే అంశం. ఇక పూరి జగన్నాధ్ సినిమా అంటేనే సంభాషణలకు కేర్ అఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఆ ట్రెండ్ మనకి ఈ సినిమా ట్రైలర్‌లో కూడా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరో పాత్ర హైద్రాబాదీ కావడంతో.. సంభాషణలు కూడా హైద్రాబాదీ యాసలోనే మనకి వినిపిస్తాయి. ఈ స్టైల్ పూరి జగన్నాధ్ సినిమాలకు సంబంధించి కాస్త కొత్తదే అని చెప్పాలి.
ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, నిధి అగర్వాల్‌తో పోలిస్తే నభ నటేష్‌కే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్‌లో నిధి అగర్వాల్ కన్నా నభ నటేషే ఎక్కువగా కనిపించడం గమనార్హం. అయితే ఈ విషయం పైన సినిమా విడుదలైతే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌కి.. సై అంటున్న టాలీవుడ్ లక్కీ హీరో ఎవరు?
ట్రైలర్ లుక్ విషయానికి వస్తే, విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. అదే సమయంలో పూరి జగన్నాథ్ మార్క్ టేకింగ్ కూడా స్పష్టంగా తెలుస్తోంది. నటి ఛార్మి, పూరి జగన్నాధ్ స్వీయ నిర్మాణంలో ‘పూరి కనెక్ట్స్’ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రానికి చాలా కాలం తరువాత.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరిస్తే.. అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిచడం జరిగింది.
మరి సినిమా విషయానికి వస్తే, కచ్చితంగా హీరో రామ్‌కి ఇది ఒక మాస్ ఇమేజ్‌ని తీసుకొస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలారోజులుగా ఒక మంచి కమర్షియల్ చిత్రం కోసం చూస్తున్న రామ్‌కి.. ఈ చిత్రం కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో కాస్త ఆఫ్ బీట్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో.. ఈ ‘ఇస్మార్ట్ శంకర్’ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్నది వేచి చూడాలి. ఇప్పటికే ప్రకటించినట్టుగా ఈ చిత్రం జులై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
చివరగా చెప్పాల్సింది ఏమిటంటే.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సరికొత్త ఇమేజ్ లభిస్తుందన్న ఆలోచనతో.. ఇస్మార్ట్ శంకర్ చేసిన హీరో రామ్ అంచనా తప్పుతుందా? లేదా కరెక్ట్ అవుతుందా? అనేది సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకులే తెలపాలి.
తెలుగు చిత్ర పరిశ్రమలో “కేర్ అఫ్ హాస్పిటల్”గా మారుతున్న యువ నటులు!