విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ, నటరత్న.. తెలుగింటి ఆడపడుచులంతా ఎంతో ఆప్యాయంగా అన్నా అని పిలుచుకునే నందమూరి తారక రామారావు (NTR) జయంతి ఈ రోజు (మే 28). ఆయన ఈ లోకం విడిచి దాదాపు 23ఏళ్లు గడుస్తున్నప్పటికీ నట, రాజకీయ రంగాల్లో ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగనివి. అంతేకాదు.. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానం కూడా అంతే పదిలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందరూ ఆయన్ని స్మరించుకుంటూ గుర్తుచేసుకుంటూ ఉంటే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు మాత్రం తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఆయన ఎవరో మీరు ఊహించగలరా?? తెలుగు ప్రజలంతా దర్శకేంద్రుడు అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే కె. రాఘవేంద్ర రావు (Raghavendra rao) తన తదుపరి చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు.
ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో 108 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకేంద్రుడిగా పేరు సంపాదించుకున్న రాఘవేంద్రరావు తన తదుపరి చిత్రం గురించి ఫేస్ బుక్ వేదికగా ప్రకటించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం విశేషం. వీరిద్దరి కలయికలో 11 చిత్రాలు విడుదల కాగా వాటిలో సింహభాగం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచినవే. ఎన్టీఆర్ – రాఘవేంద్ర రావుల ప్రయాణం 1977లో విడుదలైన అడవి రాముడు (Adavi Ramudu) చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత విడుదలైన డ్రైవర్ రాముడు (Driver Ramudu), వేటగాడు (Vetagadu), గజదొంగ (Gajadonga), తిరుగులేని మనిషి (Tiruguleni Manishi), కొండవీటి సింహం (Kondaveeti Simham), జస్టిస్ చౌదరి (Justice Chowdary) & మేజర్ చంద్రకాంత్ (Major Chandrakanth) చిత్రాలు కూడా వీరికి హిట్ సాధించి పెట్టిన చిత్రాలే.
ఆ అనుబంధానికి గుర్తుగానే తన తదుపరి చిత్ర ప్రకటనను రాఘవేంద్రరావు ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా పంచుకున్నారు.
“నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR”
నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR pic.twitter.com/pJoD8vSFYD
— Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2019
ఈ ట్వీట్ తో పాటుగా విడుదల చేసిన పోస్టర్ లో “ముగ్గురు డైరెక్టర్స్ తో… ముగ్గురు హీరోయిన్స్ తో … దర్శకేంద్రుడి సినిమా! హీరో??” అంటూ కాస్త వెరైటీగా.. కాస్త కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది. ఈ పోస్టర్ ని బట్టి ఇందులో దర్శకేంద్రుడితో పాటు మరో ఇద్దరు దర్శకులు ఉంటారా? లేక ఈ సినిమాని రాఘవేంద్ర రావు నిర్మిస్తూ వేరే వాళ్లకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించనున్నారా?? లేక ఈ చిత్రంలో హీరో పాత్ర దర్శకుడిదై ఉంటుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రస్తుతానికి ఈ వివరాలు ప్రకటించిన రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని కూడా చెప్పుకొచ్చారు. 1975లో బాబు చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన రాఘవేంద్ర రావు 2017లో ఓం నమో వెంకటేశాయ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఇంటింటా అన్నమయ్య చిత్రాన్ని రూపొందించినప్పటికీ అది విడుదల కాలేదు. ఆ తర్వాత అభిమానులంతా తమ అభిమాన దర్శకుడు ఎప్పుడెప్పుడు మెగాఫోన్ పట్టుకుంటారా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఆయన కెరీర్ లో ఎన్నో హిట్లు కొట్టిన రాఘవేంద్ర రావు అన్నగారితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ చేసిన ఈ తదుపరి చిత్ర ప్రకటనలానే సినిమా కూడా ఆసక్తికరంగా ఉంటుందా? ఆయన కెరీర్ లో మరో మైలు రాయిగా నిలుస్తుందా?? ఇందులో నటించే నటీనటులు ఎవరు?? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.. ఏమంటారు??
ఇవి కూడా చదవండి
సీత అని కాకుండా.. శూర్ఫణక అని పేరు పెట్టాలా: టైటిల్ కాంట్రవర్సీలో కాజల్ సినిమా
సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!
మాస్ మసాలా… పూరి జగన్నాధ్ – రామ్‌ల “ఇస్మార్ట్ శంకర్” టీజర్..!