క్యాన్సర్ (Cancer).. చాప కింద నీరులా వ్యాపిస్తోన్న మహమ్మారి. మనలోని రోగ నిరోధక వ్యవస్థను క్రమంగా బలహీనపరుస్తూ మెల్లగా ప్రాణాలను కబళించే వ్యాధి ఇది. బాలీవుడ్ ప్రముఖులైన మనీషా కొయిరాలా (Manisha Koirala), ఇర్ఫాన్ ఖాన్ (Irrfan Khan), అనురాగ్ బసు (Anurag Basu), లీసా రే (Lisa Ray).. తదితరులు ఈ వ్యాధి కోరల్లో చిక్కుకొని సురక్షితంగా బయటపడినవారే! ఇక అందాల నటీమణి సోనాలీ బింద్రే (Sonali Bendre) గతేడాది జూలైలో తాను హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఈ వ్యాధికి సంబంధించిన వార్తలు మరింతగా వినిపించడం మొదలయ్యాయి. వాస్తవానికి సోనాలీ క్యాన్సర్ బారిన పడడం అభిమానులను షాక్‌కి గురిచేసినా.. ఆ వ్యాధి గురించి మరింత లోతుగా అందరూ తెలుసుకునేలా కూడా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ సుందరి తన చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్న విషయం విదితమే. కిందటి సంవత్సరం ఆమె అనారోగ్యానికి గురైన నేపథ్యంలో, వైద్యులను సంప్రదించిన సోనాలీ మెడికల్ టెస్ట్స్ చేయించుకోగా వాటిలో క్యాన్సర్ సోకినట్లు వెల్లడైంది. అది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని తెలిసి నిర్ఘాంతపోయింది. అలా అనుకోకుండా క్యాన్సర్ బారిన పడిన ఆమె.. అమెరికాకు వెళ్లి అక్కడే ఆరు నెలల పాటు ఉండి చికిత్స కూడా తీసుకుంది. అలా తన చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకున్న సోనాలీ ఇటీవలే భారతదేశానికి చేరుకుంది. క్యాన్సర్ చికిత్స తీసుకునే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, భర్త, కుమారుడు అందించిన సహాయసహకారాల గురించి ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అందరితోనూ పంచుకుంటూనే వచ్చింది సోనాలీ. యూఎస్‌లో చికిత్స పూర్తి చేసుకున్న ఆమె తరచూ చెకప్స్ మాత్రం చేయించుకుంటూ ఉండాలట!
ఇలా ఓ వైపు సోనాలీ క్యాన్సర్ చికిత్స గురించి అప్ డేట్స్ వస్తున్న క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా (Aayushmann Khuraana) భార్య, దర్శకురాలు అయిన తహిరా కశ్యప్‌కు రొమ్ము క్యాన్సర్ (Breast cancer) సోకినట్లు తేలింది. అయితే ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడంతో వెంటనే చికిత్స తీసుకోవడం ప్రారంభించారామె. మీకు తెలుసా.. తహిరాకు క్యాన్సర్ సోకిందని గతేడాది ఆయుష్మాన్ పుట్టినరోజు (సెప్టెంబర్ 14) నాడు తెలిసింది. ఈ విషయమై ఎలాంటి ఆందోళన లేకుండా సానుకూలంగా స్పందించాలని నిర్ణయించుకున్నారీ దంపతులిద్దరూ. అంతేకాదు.. ఆ రోజు సాయంత్రం మన్మర్జియాన్ (Manmarziyaan) సినిమాకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత చికిత్స తీసుకోవడం ప్రారంభించిన తహిరా ఈ క్రమంలో తన జుట్టును పూర్తిగా తొలగించుకుంది. ఇటీవలే తన చికిత్సను పూర్తి చేసుకున్న ఆమె ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అందరితోనూ పంచుకుంది.
వీరిద్దరు మాత్రమే కాదు.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ (Rakesh Roshan) కూడా గొంతు క్యాన్సర్ (Throat Cancer) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స అందించడం ప్రారంభించే కొద్ది నిమిషాల ముందు అతని తనయుడు హృతిక్ రోషన్ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రస్తుతం అంతా హాయిగా వూపిరి పీల్చుకున్నారు.
క్యాన్సర్‌ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్సతో దానిని నివారించడం సాధ్యమే. అదీకాకుండా ఆరోగ్యరమైన జీవనశైలి, అలవాట్లతో ఈ వ్యాధిని నియంత్రించడం కూడా సాధ్యమే. తరచూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండడం,హెల్తీ లైఫ్‌స్టైల్‌ని అనుసరించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి చేయడం ద్వారా దీనికి ఆదిలోనే చరమగీతం పాడేయచ్చు.
ఇవి కూడా చదవండి
కమల్ “భారతీయుడు” చిత్రానికి.. వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి..?
సోషల్ మీడియాలో #10YearChallengeకి సై అంటోన్న సెలబ్రిటీలు..!