సల్మాన్ ఖాన్ కోసం.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక నిర్ణయం..!

సల్మాన్ ఖాన్ కోసం.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక నిర్ణయం..!

సబ్ కి ఆన్ ... సబ్ కి షాన్ ... సబ్ కా ఏక్ భాయ్ జాన్ - సల్మాన్ ఖాన్. ఈయన తెరపై కనిపిస్తే చాలు.. ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. అటువంటి సల్మాన్ ఖాన్ (Salman Khan) కోసం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒక కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ & బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే - సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం భారత్ (Bharat). ఈ చిత్రం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఈ చిత్రాన్ని హిందీతో పాటుగా తెలుగు & తమిళ భాషల్లో కూడా అదే రోజున విడుదల చేయాలని నిర్మాతలు గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే భారత్ చిత్రం తెలుగు వెర్షన్‌కి సంబంధించి సల్మాన్ ఖాన్ పాత్రకి తెలుగులో.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చేత డబ్బింగ్ చెప్పించేందుకు ఆయనని సంప్రదించారట.


అలాంటి ఒక ప్రొపోజల్ తన వద్దకి రాగానే ఎటువంటి సంకోచం లేకుండా తాను సల్మాన్ ఖాన్ పాత్రకి డబ్బింగ్ చెప్తాను అని అంగీకారం తెలిపాడట చెర్రీ. దీంతో భారత్ చిత్రం తెలుగు వెర్షన్‌లో సల్మాన్ పాత్రకి రామ్ చరణ్ గొంతుని వినే అవకాశం మనకు లభించింది. అయితే చెర్రీ సల్మాన్ ఖాన్‌కి గాత్రదానం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. 2016లో విడుదలైన ప్రేమ్ రతన్ ధన్ పాయో (Prem Ratan Dhan Payo) చిత్రం తెలుగు వెర్షన్‌లో కూడా సల్మాన్ ఖాన్ పాత్రకి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు.


అలాగే సల్మాన్ ఖాన్ కుటుంబం, మెగా ఫ్యామిలీకి ఉన్న బంధం చాలా బలమైంది. ఎన్నో ఏళ్ళుగా ఈ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న విషయం మనందరికీ విదితమే. రామ్ చరణ్ హిందీ‌లో చేసిన జంజీర్ చిత్ర షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ ముంబయిలో చెర్రీకి అన్నివిధాలుగా సహాయపడ్డాడు. అలాగే సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్ళి హైదరాబాద్‌లో జరిగినప్పుడు మెగా కుటుంబానికి ప్రత్యేక ఆహ్వానం పంపించారు.


మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi) 60వ పుట్టినరోజు వేడుకలకు ముంబయి నుంచి ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ రావడం.. మొదలైన ఘటనలన్నీ అందరికీ ఆనందాన్ని పంచడం మాత్రమే కాదు.. అందరి చూపునీ తమవైపు తిప్పుకున్నాయి.


 

ఈ మధ్య కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ అంటూ భాషాపరమైన తారతమ్యాలు లేకుండా చక్కని స్నేహబంధాలు కొనసాగిస్తున్నారు నేటితరం హీరో- హీరోయిన్స్. అలాగే తెలుగు, తమిళ భాషల్లో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేయడం.. హిందీలో హిట్ అయిన చిత్రాలను ఇక్కడ రీమేక్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.


ఇక భారత్ చిత్రం విషయానికి వస్తే.. కొరియాలో వచ్చిన ఓడ్ టు మై ఫాదర్ చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. సల్మాన్ ఖాన్‌తో సుల్తాన్ (Sultan) & టైగర్ జిందా హై (Tiger Zinda Hai).. వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్ జఫర్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ (Katrina Kaif) నటిస్తుండగా దిశా పటాని (Disha Patani) కూడా మరొక ముఖ్య పాత్రలో మెరవనుంది.


ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా జూన్ 5, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే తెలుగులో విడుదలయ్యే భారత్ చిత్రంతో మాత్రం ప్రేక్షకులకు డబుల్ ధమాకాను అందిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇటు తెరపై అభిమాన నటుడు సల్మాన్ నటనను చూస్తూనే.. మరోవైపు మరొక అభిమాన నటుడు రామ్ చరణ్ గొంతుని వినే అవకాశాన్ని అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి


శృతి హాసన్ "లవ్ లైఫ్"కి బ్రేక్ పడిందా..?


మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!


నా ముద్దు "ఆ" యువ హీరోకే: జాన్వీ కపూర్