రాములో రాములా.. అంటూ మరో పాటతో ఆకట్టుకుంటోన్న అల్లు అర్జున్

రాములో రాములా.. అంటూ మరో పాటతో ఆకట్టుకుంటోన్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ (allu arjun).. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరొందిన ఈ హీరో మెగా కుటుంబం నుంచే వచ్చినా కుటుంబం ఇమేజ్ ప్రభావం తనపై పడకుండా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం అల వైకుంఠపురంలో (AlaVaikunthapurramuloo).. పూజా హెగ్డే ఇందులో కథానాయిక. సుశాంత్, నవదీప్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ విడుదల నుంచి అభిమానులు చిత్రానికి బ్రహ్మరథం పలుకుతున్నారు.

హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాలోని సామజవరగమనా అనే పాట విడుదలై కొన్ని రోజుల్లోనే నాలుగు కోట్లకు పైగా వ్యూస్ సంపాదించిందంటే ఈ పాటకున్న క్రేజ్ గురించి ఆలోచించుకోవచ్చు. ఇది కేవలం యూట్యూబ్ వ్యూస్ మాత్రమే.. అంతేకాదు.. విడుదలైన కొన్ని రోజుల్లోనే లక్షలాది లైక్స్ సంపాదించిన పాటగా కూడా ఇది రికార్డుల్లోకెక్కింది. సామజవరగమనా అంటూ క్లాస్ ఆడియన్స్ కోసం అప్పుడు పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు రాములో రాములా అంటూ మాస్ సాంగ్ ని విడుదల చేయనుంది. దీనికి సంబంధించి కొంత భాగాన్ని టీజర్ గా ఈరోజు (మంగళవారం) సాయంత్రం విడుదల చేశారు. పూర్తి పాటను దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని.. ఈ పాట అందరినీ ఆకర్షించేదిగా ఉంటుందని సినిమా యూనిట్ వెల్లడించింది. వారు చెప్పినట్లుగానే ఈ పాట ఎనర్జిటిక్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ పాటలో భాగంగా పసుపు రంగు సూట్ ధరించి మందు గ్లాస్ పట్టుకొని కనిపించాడు అల్లు అర్జున్. ఓ పార్టీకి సంబంధించినట్లుగా అనిపిస్తున్న ఈ పాటలో పూజా హెగ్డే నలుపు రంగు డ్రస్ ధరించింది. రాములో రాములా.. నన్నాగం చేసిందిరో.. రాములో రాములా నా పానం దీసిందిరో.. అంటూ సాగే లిరిక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ పాటను నిన్న సాయంత్రం నాలుగింటికి విడుదల చేస్తామని ముందు ప్రకటించినా.. అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని.. ఒకరోజు తర్వాత అదే సమయానికి విడుదల చేస్తామని హారిక హాసినీ క్రియేషన్స్ సంస్థ తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఏది విడదుల చేసినా సరే.. అది పెద్ద హిట్ గా మారుతోంది. అల్లు అర్జున్ ఆఖరి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత ఈ సినిమా చేయడానికి చాలా కాలం పట్టింది. ఈ నేపథ్యంలో మొదటి డైలాగ్ టీజర్ గా అల్లు అర్జున్, మురళీ శర్మ కి మధ్య వచ్చే డైలాగ్ ని విడుదల చేశారు. ఇందులో భాగంగా మురళీ శర్మ 'ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావు?' అని అడగ్గానే 'ఇవ్వలేదు.. వచ్చింది' అంటూ బన్నీ చెప్పడం కనిపిస్తుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్లు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నాలుగు నెలల పాటు కసరత్తులు చేసి బరువు తగ్గాడట. దీనికోసం అలీ అనే ఓ పర్సనల్ ట్రైనర్ ని నియమించుకున్న బన్నీ.. ఆయన ఆధ్వర్యంలో రోజుకి రెండు గంటల పాటు జిమ్ లో వర్కవుట్స్ చేశాడట. ఈ రెండు నెలల పాటు కేవలం కీటోజెనిక్ డైట్ మాత్రమే పాటించి నాలుగు నెలలు పూర్తయ్యేసరికి 14 కేజీల బరువు తగ్గాడట మన స్టైలిష్ స్టార్. వీటన్నింటితో పాటు హెయిర్ స్టైల్ కూడా మార్చడంతో కొత్త లుక్ లో బన్నీ అదుర్స్ అనిపించేలా ఉన్నాడని అభిమానులు ఆనందపడిపోతున్నారు. మరి, చాలా కాలం తర్వాత తెరపై కనిపించనున్న అల్లు అర్జున్ అభిమానులను ఏ మేరకు అలరిస్తాడో సంక్రాంతికి చూడాల్సిందే.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.