సమంత 'ఓ బేబీ' ట్రైలర్ విడుదలైంది... మరి అదెలా ఉందంటే!!

సమంత 'ఓ బేబీ' ట్రైలర్ విడుదలైంది... మరి అదెలా ఉందంటే!!

సమంత (Samantha) ... ఈ పేరు చెప్పగానే మనకి ఠక్కున గుర్తొచ్చే అంశాలు... చూడచక్కని అందం, అలరించే అభినయం. వీటితో పాటుగా చక్కటి పాత్రలని ఎంపిక చేసుకునే తెలివైన నటి సమంత అనడంలో సందేహం లేదు. హీరో నాగ చైతన్యని వివాహం చేసుకున్న తరువాత కేవలం ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటానని.. లేని పక్షంలో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా ఆమె గతంలో తెలిపింది. ఆమె గతేడాది చేసిన చిత్రాలు - రంగస్థలం, మహానటి బాక్స్ ఆఫీస్ వద్ద విజయఢంకా మోగించాయి. అలాగే ఈ సంవత్సరం చేసిన మజిలీ, సూపర్ డీలక్స్ చిత్రాలు కూడా ప్రేక్షకుల అంచనాలని అందుకున్నాయి.

ఇప్పుడు మరోమారు తన సత్తా చాటడానికి - 'ఓ బేబీ' అంటూ ట్రైలర్‌తో మన ముందుకి వచ్చేసింది సమంత. ఇంతకి ఈ 'ఓ బేబీ'  టైటిల్ వెనకున్న కథ ఏంటి? అసలు ఈ ఓ బేబీ ట్రైలర్‌లో ఏముంది? సమంత ఇందులో 70 ఏళ్ళ ముసలావిడ పాత్రలో ఏం చేస్తుంది? అనే విషయాలు మనం కూడా తెలుసుకుందాం...

కొరియన్ భాషలో వచ్చిన "మిస్ గ్రానీ" అనే చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తున్న చిత్రం ఈ "ఓ బేబీ" (Oh Baby)

ఇక ఓ బేబీ ట్రైలర్ విషయానికి వస్తే ..

ఓ రోజు ఉదయాన్నే "శ్రీమన్నారాయణ ఫోటో స్టూడియో"కి వెళ్ళి ఓ ముసలావిడ ఫోటో తీయించుకుంటుంది. ఏదో మహాత్యం వల్ల 70 ఏళ్ళ ఆ బామ్మ కాస్త.. 24 ఏళ్ళ సమంతగా మారిపోతుంది. అసలు కలలో కూడా ఊహించని విధంగా.. ఇలా 24 ఏళ్ళ యువతిగా మారిన సమంత షాక్‌కి గురవుతుంది. అలా తనకి తెలియకుండానే వచ్చిన యవ్వనంతో.. తాను యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడు ఎలా జీవించాలనుకుందో... మళ్లీ అదే విధంగా బ్రతకడానికి నిర్ణయించుకుంటుంది. 

ఆ నిర్ణయంతో తాను ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు.. మరోసారి జీవితంలో ప్రేమని ఎలా పొందడం.. ఒకనాడు అనూలించని పరిస్థితుల వల్ల వదిలేసిన సంగీత సాధనను ఆమె మళ్లీ ప్రారంభించడం ఈ ట్రైలర్‌లో మనకి కనిపిస్తాయి. ఇక ఈ బేబీని గమనిస్తూ ఉండే పాత్రను నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోషించారు. ఆమెలా తను కూడా యవ్వనాన్ని పొందాలని.. " బేబీలా మారిపోవాలి ... కుర్రాడిని అయిపోవాలి" అని కష్టపడిపోతూ ఉంటారు. ఈ పాత్ర కూడా చాలా వినోదంగా సాగుతుంది.  అయితే ఈ ట్రైలర్‌లో సమంత చెప్పే "దేవుడు మళ్ళీ వయసు ఇచ్చాడు.. ఆ వయసు మళ్ళీ రెక్కలిప్పుకుంటుంది" అనే డైలాగ్ మాత్రం చాలా బాగుంది. 

Samantha Akkineni As Baby in Oh Baby Movie

ఇక ఈ ట్రైలర్‌లో మనకి సమంతని ప్రేమించే యువకుడి పాత్రలో హీరో నాగ శౌర్య కనిపిస్తారు. 70 ఏళ్ళ సమంత పాత్రలో నటి లక్ష్మి, లక్ష్మి కొడుకు పాత్రలో రావు రమేష్‌లు కనిపిస్తారు. వీరివి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలే. ట్రైలర్ ఆఖరిలో.. ఈ చిత్రాన్ని జులై 5వ తేదిన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 

ఇక ఈ చిత్ర సాంకేతికవర్గం విషయానికి వస్తే, యువ దర్శకురాలైన నందిని రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మి భూపాల మాటలు అందించగా.. మిక్కీ జే మేయర్ స్వరాలూ సమకూర్చారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణాన్ని అందించారు. 

ప్రస్తుతం ఈ 'ఓ బేబీ' చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించుకుని..  విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని నలుగురు నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తుండగా.. అందులో ఓ కొరియన్ నిర్మాత కూడా ఉండడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈ చిత్రానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు. 

70 ఏళ్ళ ముసలావిడ అనుకోకుండా.. 24 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయిన క్రమంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులేమిటి ? తాను యుక్త వయసులో చేయలేని పనులను.. మరోసారి చేసే అవకాశం వస్తే.. ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్ర కథ. ఇటువంటి ఆసక్తికరమైన కథని.. మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది వచ్చే నెల తేలిపోతుంది.

ఇవి కూడా చదవండి

కెరీర్ బాటకు వివాహాలు ప్రతిబంధకాలు కావు: సమంత సినీ ప్రస్థానం

అత్తా కోడళ్లు ఇద్దరూ మ్యాచింగ్ మ్యాచింగ్ : సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్

స‌మంత మేక‌ప్ సీక్రెట్లు తెలుసుకుందాం.. మ‌న‌మూ సెలబ్రిటీ లుక్ పొందేద్దాం..!