మీ ట్రోలింగ్ కోసం నా లైఫ్‌స్టైల్ మార్చుకోను.. అంటోన్న స‌మీర‌..!

మీ ట్రోలింగ్ కోసం నా లైఫ్‌స్టైల్ మార్చుకోను.. అంటోన్న స‌మీర‌..!

స‌మీరా రెడ్డి (Sameera reddy).. రాజ‌మండ్రిలో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్‌గా మారింది. తెలుగులోనూ న‌ర‌సింహుడు, అశోక్‌, సూర్య స‌న్ ఆఫ్ క్రిష్ణ‌న్ వంటి చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను పొందింది. ఆపై త‌న బాయ్‌ఫ్రెండ్ అక్ష‌య్ వ‌ర్దేని పెళ్లాడి వెండితెర‌కు దూర‌మైంది. వీరిద్ద‌రికి హ‌న్ష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు మ‌రోసారి గ‌ర్భం దాల్చిన‌ట్లు (pregnancy) నెల రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంద‌రితో పంచుకుంది స‌మీర.


గ‌ర్భం దాల్చ‌డం అనేది ప్ర‌తి మ‌హిళ‌కు ఒక వ‌రం అని చెప్పిన స‌మీర‌.. మొద‌టిసారి గ‌ర్భం దాల్చిన‌ప్పుడు త‌న శ‌రీరంలో ఎన్నో మార్పులు వ‌చ్చాయని.. అందుకే ఎవ‌రికీ క‌నిపించ‌కుండా ఇంట్లోనే ఉండిపోయాన‌ని చెబుతుంది. కానీ ఈసారి ఎంతో ధైర్యంగా మీడియా ముందుకు వ‌చ్చేందుకు నిర్ణ‌యించుకున్నా అని చెప్పిన స‌మీర గ‌త నెల‌లో గ‌ర్భంతో ఉన్న త‌న ఫొటోని పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోకి ఎంతోమంది నెగ‌టివ్ కామెంట్లు పెట్ట‌డం ఆమెను బాధించింద‌ట‌. దీనికి త‌న పోస్ట్ ద్వారా రిప్లై ఇచ్చింది స‌మీర‌.


డియ‌ర్ ట్రోల‌ర్స్‌.. మీరంద‌రూ భూమ్మీద‌కు ఎలా వ‌చ్చారు? మీ అమ్మ క‌డుపులోంచే క‌దా.. మీరు పుట్టిన‌ప్పుడు మీ అమ్మ చాలా అందంగా, హాట్‌గా కనిపించిందా? లేదు క‌దా..! మ‌రి న‌న్ను ఎందుకు త‌ప్పుబ‌డుతున్నారు? అమ్మ‌త‌నం అనేది ఒక ప్ర‌త్యేక‌మైన అనుభూతి. అవును.. క‌రీనాలా గ‌ర్భం ధ‌రించిన త‌ర్వాత, డెలివ‌రీ త‌ర్వాత హాట్‌గా క‌నిపించేవాళ్లు కొంత‌మంది ఉంటారు. అయితే నాలా గ‌ర్భం ధ‌రించిన త‌ర్వాత బ‌రువు పెరిగి.. దాన్ని త‌గ్గేందుకు కొంత స‌మ‌యం తీసుకునేవాళ్లు కూడా చాలామందే ఉంటారు అని చెప్పిందీ బ్యూటీ. గ‌ర్భం ధ‌రించడం అంటేనే నాలో ఒక సూప‌ర్ ప‌వ‌ర్ ఉన్న‌ట్లు లెక్క‌. అందుకు నేను చాలా అదృష్ట‌వంతురాలిగా ఫీల‌వుతున్నా.. అని ట్రోల‌ర్స్‌కి స‌మాధానం చెప్పింది స‌మీర‌. అప్ప‌టికి నెగ‌టివ్ కామెంట్లు చేసేవారు ఆగిపోయినా.. తాజాగా తిరిగి ఆమె డ్ర‌స్సింగ్ స్టైల్ గురించి కామెంట్లు రావ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా జీక్యూ స్టైల్ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో త‌న భ‌ర్తతో క‌లిసి పాల్గొన్న స‌మీర ఎరుపు రంగు డ్ర‌స్‌లో అద్బుతంగా క‌నిపించింది. ప్రెగ్నెన్సీ స్టైల్‌ని అద్భుతంగా చూపుతూ.. స్టైలిష్‌గా మెరిసిపోయింది. అయితే పొట్ట వ‌ద్ద ఉన్న క‌ట్ వ‌ల్ల ఆమెపై తిరిగి ట్రోలింగ్ ప్రారంభ‌మైంది. గ‌ర్భ‌వ‌తి అయిన ఆమె పొట్ట‌ను బ‌య‌ట‌కు క‌నిపించేలా ఉన్న ఆ డ్ర‌స్ వేసుకోవ‌డ‌మేంట‌ని ట్రోల‌ర్స్ ప్ర‌శ్నించ‌డం ప్రారంభించాడు. వీరంద‌రికీ చెంప‌పెట్టులాంటి స‌మాధానాన్ని చెప్పింది స‌మీర‌.. నేను గ‌ర్భం ధ‌రించిన త‌ర్వాత నా పొట్ట‌ను బ‌య‌ట‌కు చూప‌డం డీసెన్సీ కాద‌ని మీకు అనిపిస్తే.. నేను అలాంటివి ఇంకా ఎక్కువ‌గా చేస్తాను. నేను గ‌ర్భంతో ఉండే ఈ చివ‌రి నెల‌ల‌ను బాగా ఎంజాయ్ చేస్తాను అంటూ వారికి సమాధానం చెప్పింది స‌మీర‌.

స‌మీర ధ‌రించిన డ్ర‌స్సు క‌ల్లోల్ ద‌త్తా లేబుల్ కి చెందిన‌ది. ఈ ట్రోలింగ్‌పై త‌ను కూడా స్పందించ‌డం విశేషం. త‌న స్పంద‌న‌ను కూడా స్క్రీన్ షాట్ తీసి త‌న స్టోరీ ద్వారా అంద‌రితో పంచుకుంది స‌మీర‌. అందులో డియ‌ర్ ట్రోల‌ర్స్‌.. సమీర బ్ల‌డ్ రెడ్ డ్ర‌స్‌కి ఉన్న క‌ట్ గురించి మీ కామెంట్లు చ‌దివాను. మీలో కొంద‌రు త‌న పొట్ట బ‌య‌ట‌కు క‌నిపించ‌డం ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. కానీ ఇది 2019. ఫ్యాష‌న్ విష‌యంలో మ‌నం చాలా ముందుకు వెళ్లిపోయాం. అది కాక ఒక మ‌హిళ త‌న శ‌రీరాన్ని క‌ప్పుకోవ‌డానికి ఎలాంటి డ్ర‌స్సు ధ‌రించింద‌న్న విష‌యాన్ని మ‌నం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మీ కోసం కండ‌లు తిరిగిన ఎమోజీని అంకితం చేస్తున్నా. మీరు ఇత‌ర మ‌హిళ‌ల‌ను జ‌డ్జ్ చేయ‌కుండా.. వారి అభిప్రాయాల‌ను, వారి ఇష్టాల‌ను గౌర‌వించినంత‌మాత్రాన మీలోని మ‌గ‌త‌నం ఏమాత్రం త‌గ్గ‌ద‌ని మీకు మ‌రోసారి చెబుతున్నా. అంటూ క‌ల్లోల్ ద‌త్తా పోస్ట్ చేశారు.


జులైలో త‌న బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న స‌మీర ఈ మిగిలిన నెల‌లు కూడా గ‌త‌సారిలా సిగ్గుతో ఇంట్లో ఉండిపోకుండా బ‌య‌ట‌కు రావాల‌ని కోర‌కుంటోంద‌ట‌.


ఇవి కూడా చ‌ద‌వండి.


RRR హీరోయిన్ అలియా భట్.. డిప్రెషన్ వెనుక ఉన్న కారణాలేమిటి..?


తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?


ప్రేమకు.. వయసు అడ్డంకి కాదు: మలైకా, అర్జున్ కపూర్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..!