అమ్మ కంటే అమ్మాయిలకు బెస్ట్ ఫ్రెండ్ మరొకరు ఉండరేమో. మనం ఆధారపడేందుకు.. మనకు అందుబాటులో ఉండే గొప్ప స్నేహితురాలు ఎవరైనా ఉన్నారంటే తను అమ్మ మాత్రమే. మన బాధల్లో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. మన సమస్యలను పరిష్కరిస్తూ.. మనకో సలహాదారుగానే కాకుండా.. ఓ మంచి గైడ్‌గా కూడా సపోర్ట్‌ను అందిస్తుంది అమ్మ. అలాంటి అమ్మే సైఫ్ అలీఖాన్ మాజీ భార్య అమృతా సింగ్ (Amritha Singh). బాలీవుడ్ కూలెస్ట్ మామ్స్‌లో ఆమె కూడా ఒకరు.
తన పిల్లలు సారా, ఇబ్రహీంలతో ఎంతో క్లోజ్‌గా ఉండే అమృత.. తన కుటుంబాన్ని ఒక్కచోట చేర్చడంలో కూడా బాగానే సఫలమైంది. సాధారణంగా ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటే.. తమ మధ్యకు వచ్చే ఆ కొత్త వ్యక్తితో అతని మొదటి భార్య పిల్లలు ఎడమొహం, పెడమొహంగా వ్యవహరించడాన్ని మనం చూస్తుంటాం. అలా కాకుండా సైఫ్, కరీనాలతో.. తన పిల్లలు సారా, ఇబ్రహీం బాగా కలిసిపోయేందుకు కారణం అమృత ముందుచూపే అని చెప్పుకోవచ్చు.
ఈ విషయాన్ని సారా (sara ali khan) కూడా చాలాసార్లు వెల్లడించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సైఫ్ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు.. తనని తల్లి అమృత స్వయంగా రెడీ చేసిందని తెలిపింది సారా. ఇప్పుడు తాజాగా హలో మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన తల్లి అమృతకి, తనకూ మధ్యనున్న బంధాన్ని గురించి కూడా చెప్పుకొచ్చింది. అలాగే సైఫ్ పెళ్లి సమయంలో.. అమృత ఎలా రియాక్టైందో కూడా చెప్పుకొచ్చింది సారా.
“మా నాన్న, కరీనాను పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసినప్పుడు.. వెంటనే అమ్మ నన్ను తనవెంట తీసుకెళ్లింది. లాకర్‌లో ఉన్న నగలన్నింటినీ చూపించింది. వాటిలో నాకు నచ్చినవి ఎంచుకోమని కూడా చెప్పింది, అంతేకాదు.. డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లాకి ఫోన్ చేసింది. “సైఫ్, కరీనాల పెళ్లి కాబోతోంది. ఆరోజు సారా వేసుకోవడానికి ఓ అద్భుతమైన లెహెంగాని డిజైన్ చేయండి అని చెప్పింది”. అమ్మ అలా చెప్పడం చూసి నేను అవాక్కయ్యాను” అని తెలిపింది సారా. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నా కూడా.. అమృత ఆ సమయంలో ఏమాత్రం.. ఇబ్బంది పడలేదనడానికి ఈ ఘటనే నిదర్శనం అనుకోవచ్చు.
అంతేకాదు.. సైఫ్, కరీనాలతో తాను, సోదరుడు ఇబ్రహీం అంత క్లోజ్‌గా వ్యవహరించడానికి కూడా తన తల్లే కారణమని అంటోంది సారా. “కరీనాని మా నాన్నకి భార్యగా ఒప్పుకోవడం.. తనని ప్రేమించడం, తనతో క్లోజ్‌గా ఉండడం మా అమ్మ వల్లే సాధ్యమైంది. మా అమ్మ ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే తీరును నేర్పిస్తుంది. నాన్న పెళ్లికి తనే నన్ను రడీ చేసింది. “ఈ ఇయర్ రింగ్స్ అంతగా బాగా లేవు. ఇవి పెట్టుకో”.. అంటూ నాన్న పెళ్లికి తనే నన్ను సంతోషంగా సిద్ధం చేసింది. అలాంటప్పుడు నేను వాళ్ల పెళ్లి గురించి బాధపడాల్సిన అవసరం ఏముంటుంది? అంతేకాదు.. కరీనాకి దూరంగా ఉండాలన్న ఫీలింగ్ కూడా ఉండదు. మా ఇంట్లో అందరూ ఈ పెళ్లిని చాలా కంఫర్టబుల్‌గా ఒప్పుకున్నారు” అంటూ చెప్పింది సారా.
“మా అమ్మానాన్నలు విడిగా ఉండడంలోనే.. ఆనందాన్ని వెతుక్కున్నారని నాకు అర్థమైంది. వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేవారో నాకు తెలీదు. కానీ కలిసుండి గొడవలు పడుతూ.. వారి జీవితాన్ని నాశనం చేసుకొని.. మాకు సంతోషం లేకుండా చేయలేదు. కలిసుండి సంతోషంగా లేని ఇంట్లో పెరగడం కంటే.. ఇలా అమ్మానాన్నలు విడిగా ఉన్నా.. సంతోషంగా ఉన్న ఇంట్లో పెరగడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పెళ్లి మాకు జీవితంలో కూడా చాలా నేర్పించింది” అని తన మనసులోని భావాలను పంచుకుంది సారా.
హలో మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన సోదరి సారాతో కలిసి పాల్గొన్న ఇబ్రహీం.. వారిద్దరి బంధం గురించి చెప్పుకొచ్చాడు. “చాలామంది తోబుట్టువులు ఎక్కువగా పోట్లాడుతూ ఉంటారు. కానీ మేమిద్దరం దానికి పూర్తిగా భిన్నం. మేమిద్దరం చాలా తక్కువగా గొడవలు పడతాం. అందుకే.. మా ఇద్దరి బంధం పర్ఫెక్ట్ అనే నేను చెబుతాను. మా ఇద్దరి మధ్య ఐదేళ్ల తేడా ఉన్నందుకేమో.. మా మధ్య పెద్దగా అభిప్రాయ భేదాలు రావు. ఒకవేళ వచ్చినా.. అవి చాలా చిన్న చిన్న విషయాల గురించే అయి ఉంటాయి. వాటిని కాసేపటిలోనే మర్చిపోయి.. తిరిగి ఒక్కటైపోతాం. మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అలాంటిది” అని తెలిపాడు ఇబ్రహీం.
మరో ఇంటర్వ్యూలో భాగంగా తన పిల్లలు సారా, ఇబ్రహీంల గురించి అమృత తన అభిప్రాయాన్ని పంచుకుంది. “సారా దేవుడిని చాలా ఎక్కువగా నమ్ముతుంది. ప్రతి జీవికి జీవించే అవకాశం ఇవ్వాలనేది తన కోరిక. చిన్నవారైనా.. పెద్దవారైనా.. అందరికీ గౌరవమిచ్చి మాట్లాడుతుంది. మంచి క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయి. తన నటనతో పాటు.. తను చేసే పనులను చూసినా.. నాకు ఎందుకో ముచ్చటేస్తుంది. ఇక ఇబ్రహీం విషయానికి వస్తే.. తన వయసు తక్కువే కానీ.. కాస్త పాత కాలం మనిషి. అన్ని విషయాలు సరైన పద్ధతిలో జరగాలని కోరుకుంటాడు.
కానీ ఎలాంటి విషయాన్నైనా సరే.. నవ్వుతూ స్వీకరించే బలమైన మనస్తత్వం తన సొంతం. తన లోపాలు ఎవరైనా ఎత్తి చూపితే.. వాటిని సరిచేసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కానీ నా పిల్లలిద్దరితో నాకున్న సమస్య ఒక్కటే. వారిద్దరూ తమ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. శుభ్రత తక్కువ. అదే నాకు వారిపై కోపం తెప్పిస్తుంది” అని తెలిపింది అమృత
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.