శృతీ హాసన్ (Shruti Haasan).. విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan), మునుపటి తరానికి చెందిన ప్రముఖ నటీమణి సారిక ఠాకూర్ (Sarika Thakur)ల ముద్దుల కూతురిగా సినీ పరిశ్రమకు పరిచయమైన అందాల భామ. తల్లిదండ్రుల సినీవారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సినీరంగంలో అడుగుపెట్టినప్పటికీ తనదైన నటప్రతిభతో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది శృతి.
తెలుగులో తన తొలిచిత్రం “అనగనగా ఓ ధీరుడు” వూహించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. తన తదుపరి చిత్రమైన ఓ మై ఫ్రెండ్ సినిమాలో సిరి పాత్రలో ఒదిగిపోయింది శృతి. ఇక ఆ తర్వాత విడుదలైన “గబ్బర్ సింగ్” సినిమాతో ఈ భాగ్యలక్ష్మి కెరీర్ గ్రాఫ్ అంతా మారిపోయింది. అప్పటివరకు ఆమెను విమర్శించిన ఎంతోమంది సైతం ఆమె నటనను ప్రశంసించకుండా ఉండలేకపోయారంటేనే శృతి నట ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆమె నటించిన బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు.. మొదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఎంతగా సక్సెస్ సాధించాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. శృతిహాసన్ 2017లో విడుదలైన “కాటమరాయుడు” సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు తెలుగులో కనిపించింది లేదు.
ఈ అందాల భామ కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో సైతం తన సత్తా చాటుతోంది. తెలుగు కంటే ముందు 2009లో “లక్” అనే సినిమాతో తన సినీకెరీర్‌ను ప్రారంభించిదీ ముద్దుగుమ్మ. ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు హిందీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దిల్ తో బచ్చా హై జీ, రామయ్య వస్తావయ్య. డీ డే, రాకీ హ్యాండ్సమ్.. మొదలైన చిత్రాల్లో నటించిన శృతి హిందీలో బెహెన్ హోగా తేరి సినిమాలో చివరిగా మెరిసింది.
శృతి తండ్రి వారసత్వాన్ని కేవలం నటన విషయంలోనే కాదు.. ఆయనలానే విభిన్న రంగాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ మల్టీ టాలెంటెడ్ గర్ల్ అని అనిపించుకుంది. ఆమె కేవలం మంచి నటి మాత్రమే కాదు.. చక్కని గాయని కూడా! తెలుగులో కమల్ హాసన్ నటించిన “ఈనాడు” సినిమాలో పాటలు పాడడం మాత్రమే కాదు.. సినిమాకు సంగీత దర్శకత్వం సైతం వహించింది శృతి. అంతేకాదు.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఎన్నో హిట్ పాటలను సైతం ఆలపించింది. పలు రాక్ బ్యాండ్స్‌తో కలిసి పని చేస్తోంది కూడా! ఈరోజు (జనవరి 28) శృతి తన 33వ పుట్టినరోజు (Birthday) జరుపుకొంటున్న సందర్భంగా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం..
* శృతి ఒక నటిగా తన కెరీర్ మొదలుపెట్టకముందే.. గాయనిగా తనని తాను వెండితెరకు పరిచయం చేసుకుంది. 1992లో తన తండ్రి కమల్ హాసన్ నటించిన తేవర్ మగన్ (Tevar Magan) అనే తమిళ చిత్రంలో ఒక పాట పాడింది. దీనికి మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతాన్ని అందించారు. అప్పటికి ఆమె వయసు కేవలం ఆరేళ్ళు మాత్రమే.
* చిన్న వయసులోనే గాయనిగా మారిన శృతి ప్రొఫెషనల్ సింగర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టింది మాత్రం “చాచి 420” చిత్రంతోనే! విశాల్ భరద్వాజ్ (Vishal Bharadwaj) స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలో ఆమె తండ్రి కమల్ హాసన్ కథానాయకుడు కావడం విశేషం.
* శృతి కేవలం మంచి గాయని మాత్రమే కాదు.. సమర్థురాలైన సంగీత దర్శకురాలు కూడా! ఈ విషయం కూడా ఆమె తండ్రి నటించిన ఈనాడు (Eenadu) చిత్రంతోనే రుజువు చేసుకుందీ ముద్దుగుమ్మ.
* కేజే ఏసుదాస్ (KJ Yesudas) వంటి ప్రఖ్యాత గాయకుడితో కలిసి పాట పాడిన రికార్డు శృతి హాసన్ సొంతం. ఇళయరాజా స్వర సంకల్పన చేసిన యెన్ మాన వాణిల్ అనే చిత్రంలో వీరిరువురూ ఓ పాటను ఆలపించారు.
* పలు రాక్ బ్యాండ్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం శృతి సొంతం. ఇప్పటికీ కొన్ని రాక్ బ్యాండ్స్‌తో కలిసి ఆమె పని చేస్తుంటుంది.
* చెన్నై టైమ్స్ (Chennai Times) నిర్వహించిన ఒక ఇంటర్నెట్ పోల్‌లో 2018 సంవత్సరంకి గాను ఆమె మోస్ట్ డిజైరబుల్ విమెన్ (Most Desirable Women)గా ఎన్నుకోబడింది.
* సినిమాల్లో అడుగుపెట్టకముందు శృతి క్యాలిఫోర్నియా (అమెరికా)లోని మ్యుజీషియన్స్ ఇనిస్టిట్యూట్‌లో (Musicians Institute)లో మ్యూజిక్ కోర్స్ పూర్తి చేసింది.
* నటన, గాత్రంలోనే కాదు.. ప్రత్యేక గీతాల్లో నర్తించడంలో కూడా శృతి శైలే చాలా వేరుగా ఉంటుంది. తెలుగులో “శ్రీమంతుడు” చిత్రంలో ఆమె చేసిన జంక్షన్లో.. అనే పాట, హిందీలో అర్జున్ కపూర్ నటించిన తేవర్‌లో ఆమె చేసిన సాంగ్స్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.
* లండన్‌లో తన తొలి మ్యూజిక్ కాన్సర్ట్‌ని విజయవంతంగా ముగించుకున్న ఈ భామ తన పుట్టినరోజుని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి ఇండియా చేరుకుంది.
* శృతి హాసన్ ప్రస్తుతం లండన్‌కి చెందిన స్టేజ్ ఆర్టిస్ట్ అయిన మైఖేల్ కోర్సల్ (Michael Corsale) తో ప్రేమలో ఉంది. త్వరలోనే వీరు వివాహం చేసుకుంటారు అని సమాచారం. ఈ వివాహానికి కమల్ హాసన్ & సారికలు ఇప్పటికే తమ సమ్మతిని తెలియచేశారట!
శృతి హాసన్ ప్రస్తుతం “శభాష్ నాయుడు” అనే త్రిభాషా చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందనున్న మరొక సినిమాలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నటిగా, గాయనిగా, పాప్ సింగర్ గా.. తనలోని ప్రతిభను నిరూపించుకుంటున్న శృతికి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం కావాలని కోరుకుంటూ..
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతి హాసన్‌కి మా POPxo తెలుగు తరపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
ఇవి కూడా చదవండి
రాణీ లక్ష్మీబాయి పాత్రకు వన్నె తెచ్చిన.. కంగనా రనౌత్ చిత్రం “మణికర్ణిక” (సినిమా రివ్యూ)
అందరిలోనూ ఆసక్తి రేపుతున్న.. “లక్ష్మీస్ ఎన్టీఆర్” వర్కింగ్ స్టిల్స్..!
కమల్ హాసన్, అక్షయ్ కుమార్ బాటలోనే.. మాధవన్ కూడా..!