'RRR' లో ముచ్చటగా మూడో హీరోయిన్.. తనెవరో మీకు తెలుసా..?

'RRR' లో ముచ్చటగా మూడో హీరోయిన్.. తనెవరో మీకు తెలుసా..?

RRR -  రాజమౌళి (rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం ఇది. గతేడాది ఈ సినిమాను ప్రకటించిన రోజు నుండీ అభిమానులు.. దాని విడుదల కోసం ఎంతో ఆత్రుతతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న అప్ డేట్ వచ్చినా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా లక్షా యాభై వేల మంది ఫాలోవర్లు.. ట్విట్టర్‌లో తమ RRR చిత్ర పేజీని ఫాలో అవుతుండడంతో.. వారికి ధన్యవాదాలు తెలుపుతూ చిత్ర యూనిట్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది.

పిరియడ్ డ్రామా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ కథానాయికగా కనిపిస్తుండగా.. ఎన్టీఆర్‌కి జంటగా హాలీవుడ్ తార ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించి మరో అప్ డేట్‌ని అందించింది. ఈ సినిమాలో వీరిద్దరూ కాకుండా మరో కథానాయిక కూడా కనిపించనుందట. ఆమె మరెవరో కాదు.. అందాల తార శ్రియా సరన్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ వంటి భాషల సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది శ్రియ. శివాజీ, పవిత్ర, మనం వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రియ. ఆమె ఈ సినిమాలో మరో కథానాయికగా కనిపించనుందట.

ఎన్టీఆర్ సరసన విదేశీ హీరోయిన్ ... 'RRR' చిత్రంలో హాలీవుడ్ నటుల సందడి

RRR చిత్రంలో అజయ్ దేవగణ్ ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన షూటింగ్ ప్రారంభించిన విషయం కూడా ఇటీవలే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. అజయ్ దేవగణ్ సరసన శ్రియ కథానాయికగా కనిపించనుందని.. RRR సినిమా యూనిట్ వెల్లడించింది. ఇంతకుముందు అజయ్, శ్రియ ఇద్దరూ 'దృశ్యం' హిందీ రీమేక్‌లో కలిసి నటించారు. అజయ్ లాగానే ఈ సినిమాలో శ్రియది కూడా చాలా ముఖ్యమైన పాత్ర అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ రాకపోయినా.. వీరిద్దరూ షూటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో అధికారిక ప్రకటన కోసం అంతా వేచి చూస్తున్నారు.

తాజాగా అజయ్ ఈ సినిమాకు సంబంధించి తొలి రోజు షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాజమౌళితో తన అనుబంధం గురించి ట్వీట్ చేశారు. "రాజమౌళి గారితో నా అనుబంధం 2012 నాటిది. అప్పటి నుంచి మేం చాలా విధాలుగా కలిసి పనిచేశాం. ఆయనతో కలిసి RRR సినిమాలో కలిసి నటించడం చాలా గౌరవంగా ఉంది. ఆనందంగా అనిపిస్తోంది" అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ RRR చిత్ర యూనిట్ కూడా మేమందరం "అజయ్ గారితో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తున్నాం. మాక్కూడా ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా, ఉత్సాహంగా అనిపిస్తోంది. ఆయనతో కలిసి మొదటి రోజు షూటింగ్ చాలా అద్భుతంగా సాగింది" అంటూ ట్వీట్ చేసింది.

RRR కి మరో బాలీవుడ్ టచ్.. షూటింగ్ ప్రారంభించిన అజయ్ దేవగణ్

రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్న ఈ సినిమా 2020 జులై 30న విడుదలవుతుందని ముందు చెప్పినా.. కొన్ని కారణాల వల్ల చిత్ర విడుదల ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.