ఈ టైటిల్ చూసి తెలుగు సినిమా (Telugu Cinema) అభిమానులు చాలామందికి కోపం రావచ్చు. ఎందుకంటే సినీ పరిశ్రమ అనేది ఒక్క హిట్టుతో పొంగిపోయేదో లేక ఒక్క ఫ్లాప్‌తో పడిపోయేదో కాదు అనేది సత్యం. దీనితో నేను కూడా ఏకీభవిస్తాను. అయితే 2018లో విడుదలైన తెలుగు సినిమాలకు సంబంధించి ఒక చిన్న ప్రోగ్రస్ రిపోర్ట్ లాంటిదే ఈ సమీక్ష.
ఇక ఈ సంవత్సరం తెలుగులో మొత్తంగా 180 వరకు సినిమాలు విడుదలైతే.. అందులో 125 మాత్రమే స్ట్రెయిట్ సినిమాలు. మరో 55 చిత్రాలు వివిధ భాషల్లో నిర్మితమై తెలుగులో డబ్బింగ్ చేయబడ్డాయి. అయితే డబ్బింగ్ చిత్రాలని కాస్త పక్కకి పెట్టి తెలుగులో వచ్చిన స్ట్రెయిట్ చిత్రాలలో ఎన్ని మన ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నాయి? వాటిల్లో ఎన్ని బ్లాక్ బస్టర్స్? ఎన్ని హిట్స్? ఎన్ని యావరేజ్‌గా నిలిచాయి? ఎన్ని చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి? అనే విషయాలను కాస్త వివరంగా తెలుసుకుందాం.
ఈ ఏడాదిని ఒకసారి సమీక్షిస్తే సంక్రాంతి సీజన్లో విడుదలైన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడగా.. వేసవిలో వచ్చిన పెద్ద చిత్రాలు కాస్త నిలదొక్కుకున్నాయి. ఆ తరువాత సీజన్‌లో అప్పుడప్పుడు ఒక్కో చిత్రం మాత్రమే హిట్ అవుతూ రావడం జరిగింది. మళ్ళీ దసరా సీజన్ పర్లేదు అనిపించినా.. ఏడాది చివరికి వచ్చేసరికి విడుదలైన ఏ చిత్రం కూడా సరైన విజయంతో ఈ సంవత్సరానికి ముగింపు పలకలేదు.
ముందుగా ఈ సంవత్సరంలో వచ్చిన చిత్రాలలో విమర్శకుల ప్రశంసలతో పాటుగా రొటీన్‌కి కాస్త భిన్నంగా రూపొందిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం.
కొత్త ప్రయోగం “అ”
‘అ’ (Awe) చిత్రానికి వస్తే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సాధారణ పాయింట్‌ని అసాధారణ రీతిలో చూపించడంలో కృతకృత్యుడయ్యాడు. ఒక మనిషిలో ఉండే రకరకాల మనస్తత్వాలకి సంబంధించి ఆయా పాత్రలని నిజంగా సృష్టించి వాటిని తెరపైన చూపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అతని ప్రయత్నాన్ని అందరు మెచ్చుకున్నారు.
సామాన్య జనాలే పాత్రధారులుగా “కేరాఫ్ కంచరపాలెం”
C/o కంచరపాలెం (C/o Kancharapalem) సినిమా విషయానికి వస్తే, టైటిల్ ఎంత సహజంగా ఉందో దర్శకుడు వెంకటేష్ మహా మనకి తెరపైన ఈ కథని చూపించిన విధానం కూడా అంతకన్నా సహజంగా ఉంది. విశాఖలోని కంచరపాలెం అనే ప్రాంతంలో ఉండే సామాన్య జనాన్ని చిత్రంలో పాత్రలుగా తీసుకుని వారితో నటింపచేసి.. ఒక కొత్త ట్రెండ్‌కి దర్శకుడు తెలుగులో తెరతీశాడు అని చెప్పాలి. మొత్తానికి ఈ చిత్రం చాలా అంశాల పరంగా ఒక ట్రెండ్‌గా నిలిచింది.
సైన్స్ ఫిక్షన్‌తో ప్రేక్షకుల నాడిని పరీక్షించిన “అంతరిక్షం”
ఇక అంతరిక్షం (Antariksham) విషయానికి వస్తే, మరోసారి సంకల్ప్ తానెందుకు దర్శకులలో ప్రత్యేకమో ఈ చిత్రంతో మరోసారి నిరూపించుకున్నాడు. తెలుగులో తొలిసారిగా స్పేస్ డ్రామాని తెరకెక్కించి.. అందులో వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోని పెట్టి అందరితో శబాష్ అనిపించుకున్నాడు. తాను నమ్మే బి ది ఫస్ట్ లేదా బి ది బెస్ట్ సూత్రాన్ని నమ్ముకుని తన ప్రయాణం సాగిస్తాను అని ముందుకుసాగుతున్నాడు.
ఒక సగటు విద్యార్థి జీవిత ప్రయాణం “నీది నాది ఒకే కథ”
ఓ సగటు సామాన్యుడి కథని కూడా ఎంతో ఆసక్తిని తెరకెక్కించవచ్చని నిరూపించిన దర్శకుడు వేణు ఉడుగుల. జీవితంలో సక్సెస్ అనేది మనలో ఉంటుంది తప్ప ఎదుటివాడి గుర్తింపులో ఉండదు అనే పాయింట్‌ని చాలా చక్కగా తెరకెక్కించాడు నీది నాది ఒకే కథ (Needi Naadi Oke Katha) అనే చిత్రంలో దర్శకుడు వేణు. ఈ సినిమాలో హీరో పాత్ర, అతని చుట్టూ ఉండే పాత్రలు.. అలాగే సినిమాలో మనం చూసే పరిస్థితులు కూడా నిజజీవితానికి దగ్గరగా ఉండడంతో ఈ చిత్రం ఎక్కువమంది ప్రేక్షకులని చేరుకోగలిగింది.
ఇవే యావరేజ్ సినిమాలు
ఇక ఈ సంవత్సరంలో వచ్చిన చిత్రాల్లో నిర్మాతలకి నష్టం తేకుండా.. అలాగని చెప్పి పెద్ద స్థాయిలో లాభాలు కూడా తెచ్చిపెట్టని చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ యావరేజ్ చిత్రాలు జాబితాలో – జై సింహ (Jai Simha), ఎమ్యెల్యే (MLA), ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Yemaindi), చి.ల.సౌ (ChiLaSow), దేవదాస్ (Devadas)& హలో గురు ప్రేమ కోసమే (Hello Guru Prema Kosame) మొదలైన చిత్రాలకు చోటు దక్కింది. ఈ చిత్రాలలో దాదాపు అన్ని కమర్షియల్ చిత్రాలు కావడంతో.. నిర్మాతలు కొంత వరకు సేఫ్‌లో పడ్డారు అనే చెప్పాలి.
లాభాల బాటలో నడిచిన చిత్రాలివే..!
అలాగే బ్లాక్ బస్టర్ అవుతాయి అనుకున్న చిత్రాలు.. “ఆ రేంజ్”ని అందుకోకుండా ఆగిపోయిన చిత్రాలు కూడా దాదాపు 6 వరకూ ఉన్నాయి. వీటికి లాభాలు వచ్చినా కూడా నిర్మాతలు పెట్టుకున్న బ్లాక్ బస్టర్ అంచనాలని అవి అందుకోలేకపోయాయి. అవే – భాగమతి (Bhaagamathie), ఛలో (Chalo), తొలిప్రేమ (Tholiprema), భరత్ అనే నేను (Bharat Ane Nenu), సమ్మోహనం (Sammohanam), అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava).
ఇవే బ్లాక్ బస్టర్స్
ఆఖరుగా ఈ ఏడాది వచ్చిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుని నిర్మాతలకు మాత్రమే కాకుండా పరిశ్రమకి సైతం లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాలు ఒక 6 ఉన్నాయి. ఆ చిత్రాలు ఇవే – రంగస్థలం (Rangasthalam), గూఢచారి (Goodachari), RX 100, గీత గోవిందం (Geetha Govindam), మహానటి (Mahanati) & ట్యాక్సీవాలా (Taxiwaala).
ఈ జాబితాలో మొత్తం 22 చిత్రాలుండగా… అందులో కేవలం 12 చిత్రాలు మాత్రమే హిట్ & బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అంటే దాదాపు 125 స్ట్రెయిట్ సినిమాల్లో కేవలం 12 మాత్రం గుర్తింపు తెచ్చుకోగలిగాయి. దీన్నిబట్టి చూస్తే ఒక 10% మాత్రమే సక్సెస్ రేట్ ఈ ఏడాది నమోదైంది.
రాబోయే 2019లో సక్సెస్ శాతం పెరగాలని కోరుకుందాం…
ఇవి కూడా చదవండి
2018 మెగా హిట్ చిత్రం “రంగస్థలం”.. దర్శకుడిదే క్రెడిట్..!
2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
2018 టాలీవుడ్ సినిమాల్లో.. హాస్యపు జల్లులు కురిపించిన వారెవరంటే..?