ఆ తల్లీ, కొడుకుల బంధం.. ఎంతో స్ఫూర్తిదాయకం (టాలీవుడ్ కమెడియన్ 'అలీ'కి మాతృవియోగం)

ఆ తల్లీ, కొడుకుల బంధం.. ఎంతో స్ఫూర్తిదాయకం (టాలీవుడ్ కమెడియన్ 'అలీ'కి మాతృవియోగం)

(Tollywood Comedian Ali's mother Jaithan Bibi passes away)

అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అద్దమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిదే.. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే.. అవతార పురుషుడైనా .. ఓ అమ్మకు కొడుకే..  అమ్మప్రేమను గురించి అలతి అలతి పదాలతో చక్కగా వర్ణించిన సినారె గారి ఈ గీతం అందరికీ సుపరిచితమే.  ఈపాటలోని పల్లవి మనకు అమ్మ ప్రేమను గురించి చెప్పకనే చెబుతుంది. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు, సినీ ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో.. తమ మాతృమూర్తితో తమ అనుబంధం గురించి బహిరంగంగా వెల్లడించినవారే. తమ సక్సెస్ వెనుక తమ తల్లి పాత్ర ఎంత ఉందో తెలియజేసినవారే. అలా ఎప్పటికీ తమ జీవితంలో తల్లికి అగ్రతాంబూలం ఇవ్వాల్సిందేనని నమ్మే వ్యక్తులలో ప్రముఖ హాస్యనటుడు అలీ ఒకరు. ఎన్నో పర్యాయాలు ఆయన వేదికలపై, ఇంటర్వ్యూలలో తన జీవితంలో.. ఆయన తల్లి జైతన్ బీబీకి ఉన్న ప్రత్యేకమైన స్థానం గురించి తెలిపారు.

మై విలేజ్ షో ఫేమ్ "గంగవ్వ" గురించి.. ఎవ్వరికి తెలియని 10 ఆసక్తికర విషయాలు

అయితే విషాదకరమైన విషయమేమిటంటే - అలీ మాతృమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు రాజమహేంద్రవరంలోని తన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే అలీ.. హుటాహుటిన తాను చేస్తున్న సినిమా షూటింగ్ నుండి బయల్దేరారని సమాచారం. 

నటుడు అలీకి తన తల్లి అంటే ఎంతో ఇష్టం. షూటింగ్‌లలో ఎంత బిజీగా ఉన్నా.. తన తీరిక వేళలలో  వీలైనంత ఎక్కువ సమయం ఆమెతో గడపడానికే ఇష్టపడేవాడు. ఒకవేళ షూటింగ్ హైదరాబాద్‌లోనే ఉంటే.. సాయంత్రం ఆరు గంటలకే దానిని పూర్తిచేసి.. ఇంటికి చేరుకొని తన తల్లితో మాట్లాడుతూ.. ఆమెకి సపర్యలు చేసేవాడు అలీ. 

గత కొంతకాలంగా అంతర్జాలంలో ఓ ఫోటో వైరల్ అవుతూ వస్తోంది. ఆ చిత్రంలో అలీ.. కింద కూర్చొని తన తల్లి జైతన్ బీబీ కాళ్ళని నొక్కుతూ కనిపిస్తారు. ఈ విషయం గురించి పలువురు సెలబ్రిటీలు.. ఆయన వ్యాఖ్యాతగా చేస్తున్న షోలో ప్రస్తావించడం కూడా జరిగింది. 

ఇక అలీ తన కుటుంబం కోసం చిన్నతనం నుండే కష్టపడుతూ వచ్చారు. సినీ పరిశ్రమలో దాదాపు 40 ఏళ్ల కెరీర్ కలిగిన అలీ.. ఎంత ఎత్తుకి ఎదిగినా.. కొన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట జవదాటకపోవడమే తన సక్సెస్ సీక్రెట్ అని పలుమార్లు తెలిపారు. "అలీ తన తల్లి మాటకి విలువిచ్చే విషయంలో.. ఎన్నటికీ మారలేదు" అంటూ ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Darbar Trailer Talk : 'ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్' అంటూ రెచ్చిపోయిన 'సూపర్ స్టార్' రజినికాంత్

అలాగే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం వంటి ఎందరో స్టార్స్.. అలీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి.. అన్నిటికి మించి ఆయన తన తల్లి పట్ల చూపించే అణకువ, గౌరవం గురించి ప్రముఖంగా పేర్కొనడం విశేషం. ఇంతమంది అలీకి తన తల్లి పట్ల ఉన్న ప్రేమని గురించి ప్రస్తావించగలిగారంటే.. వారి అనుబంధం ఎంత గట్టిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అలాగే ఒక ఇంటర్వ్యూలో అలీ తన కుటుంబం గురించి మాట్లాడుతూ  "నేను కష్టపడేది నా కుటుంబం కోసమే అయినప్పుడు, నాకు దొరికిన ఖాళీ సమయాన్ని వారికి మాత్రమే కేటాయించడం సమంజసం. అలాగే వారు కూడా ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టే.. నేను ఈ రోజు చిత్రపరిశ్రమలో ఇలా నిలదొక్కుకోగలిగాను" అని తన మనసులోని భావాలను పంచుకున్నాడు.

చివరిగా.. వెండితెర పైనే కాకుండా బుల్లితెర పై కూడా.. ఎన్నో సార్లు మనకి తన నవ్వులని పంచిన అలీకి ఈరోజు తన మాతృమూర్తి భౌతికంగా దూరమవ్వడం నిజంగా బాధాకరం. ఈ సమయంలో ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ.. ఆయన మనోధైర్యంతో ముందుకు సాగాలని మనమూ కోరుకుందాం. 

దీపిక ప‌దుకొణే 'ఛపాక్' చిత్రం ఎందుకు చూడాలంటే ..?

Photos Courtesy: Twitter.com/Siva Mallala