గుర్రం పై వెళ్లి పదో తరగతి పరీక్ష రాసింది... అందరి మనసూ దోచేసింది..!

గుర్రం పై వెళ్లి పదో తరగతి పరీక్ష రాసింది... అందరి మనసూ దోచేసింది..!

సాధారణంగా ఇప్పుడు మార్చి, ఏప్రిల్ వస్తోందంటే మనం ఎండల గురించి భయపడుతున్నాం.. కానీ మన చిన్నతనంలో మాత్రం మార్చి వచ్చేస్తుందంటే చాలు.. పరీక్షల (Exam) గురించి ఎంతో భయపడిపోయేవాళ్లం. అయితేనేం.. పరీక్ష రోజు అమ్మ ఉదయాన్నే లేపితే నిద్ర లేచి చక్కగా చదువుకొని, టకటకా సిద్ధమై పోరాట యోధుల్లా వెళ్లి పరీక్ష రాసొచ్చేవాళ్లం. అప్పట్లో అవే పెద్ద కష్టాలుగా అనిపించేవి మరి. ఎందుకు కాదు.. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించని పదో తరగతి పరీక్షలంటే అందరికీ హడల్. ఇక ఇంటర్, డిగ్రీ పరీక్షలైతే ఇంకాస్త ఎక్కువగానే టెన్షన్ ఉండేది. కానీ కేరళకి చెందిన ఓ అమ్మాయి మనలా భయపడే రకం కాదు. పరీక్ష కోసం ఏకంగా గుర్రపు స్వారీ చేసుకొని మరీ వచ్చింది. ఆమెలా మనకూ చిన్నప్పుడూ గుర్రపు స్వారీ (Horse riding) వచ్చి ఉంటే.. మనమూ ఎంచక్కా ఎలాంటి ఇబ్బందీ లేకుండా గుర్రంపై వెళ్లి పరీక్ష రాసి వచ్చేవాళ్లం అనిపిస్తోంది కదా..!
అవును.. కేరళలోని త్రిసూర్కి చెందిన ఓ పదో తరగతి అమ్మాయి గుర్రపు స్వారీ చేస్తూ వెళ్లి పదో తరగతి పరీక్ష రాయడంతో ప్రస్తుతం దేశమంతా ఆ వార్త వైరల్‌గా మారిపోయింది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని మొదట మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు నా వాట్సాప్ వండర్ బాక్స్‌లో వచ్చిన వీడియో కూడా ఇది. ఇది నా కాఫీ రుచిని మరింత పెంచింది. ఎందుకంటే అరకు కాఫీ అంటేనే ప్రత్యేకతకు కేరాఫ్ అడ్రస్... అంటూ రాయడం విశేషం. అక్కడి నుంచి ట్వీట్లు రీట్వీట్లతో ఈ వీడియో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కంటబడింది. వెంటనే ఆయన దీన్ని పోస్ట్ చేయడం విశేషం.


అద్భుతం.. ఈ వీడియో చూస్తుంటే మన దేశంలో బాలికల విద్య ఎంత వేగంగా ముందుకెళ్తుందో అర్థమవుతోంది. ఈ వీడియో క్లిప్ దేశంలోనే కాదు.. ప్రపంచమంతా వైరల్‌గా మారాల్సిందే.. అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన మరో ట్వీట్ చేయడం చూస్తే ఈ వీడియో ఆయనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో అర్థమవుతోంది. మరో ట్వీట్‌లో భాగంగా "కేరళ, త్రిసూర్‌లో ఈ అమ్మాయి గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే నాకు తన ఫొటో ఒకటి పంపించగలరా? నేను తన ఫొటోని నా ఫోన్ స్క్రీన్ సేవర్‌గా సేవ్ చేసుకుంటాను. తనని చూసినప్పుడల్లా మన దేశంలోని అమ్మాయిల భవిష్యత్తు గురించి నాలో ఆశ పెరుగుతోంది" అంటూ ట్వీట్ చేశారు.
కేవలం ఆనంద్ మహీంద్రానే కాదు.. స్కూల్ యూనిఫాంలో గుర్రంపై కూర్చొని వీపున బ్యాగ్ వాయువేగంలో ముందుకు వెళ్తోన్న ఈ అమ్మాయి వీడియోని చాలామంది లైక్ చేశారు. కొందరు ఆమెను వండర్ ఉమన్‌గా అభివర్ణిస్తే మరికొందరు.. ఆమె పవర్‌ని హార్స్ పవర్‌తో పోల్చారు. ఇంకొందరు పదో తరగతి పరీక్షలు యుద్ధం కంటే తక్కువేమీ కాదు. అందుకే ఆమె గుర్రంపై వెళ్తోంది అంటూ ట్వీట్స్ చేయడం విశేషం. ఆ తర్వాత కేరళకి చెందిన ఫేస్ బుక్ యూజర్ అనంత్ నారాయణ్ ఆ అమ్మాయి గురించి కొన్ని వివరాలు వెల్లడించారు.


ఆ అమ్మాయి పేరు సి. ఎ. క్రిష్ణ అని.. తను స్థానిక మందిర పూజారి కూతురని చెప్పిన ఆ వ్యక్తి.. ఆమెకు ఓ తెల్లని గుర్రం కూడా ఉందని చెప్పారు. తన ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలిలో హోలీ గ్రేస్ హై స్కూల్లో ఆ బాలిక పదో తరగతి చదువుతోందట. అంతేనా.. రోజూ స్కూల్‌కి ఈ అమ్మాయి ఆ గుర్రంపైనే వెళ్లి వస్తుందట. గుర్రం పేరు రానాక్రిష్‌గా వెల్లడించాడు ఆ వ్యక్తి. దీని తర్వాత చాలామంది కేరళలో చాలామంది.. టీవీల్లో వచ్చిన ఆమె వీడియోలను షేర్ చేసి తను అక్కడ ఎప్పటి నుంచో పాపులర్ అని చెప్పడం విశేషం.
ఇక ఆనంద్ మహీంద్రా అడిగిన వివరాలను ఆయనకు అందించిన వ్యక్తి.. మహీంద్రా అడిగినట్లుగా గుర్రంతో ఉన్న ఆ అమ్మాయి ఫొటోను షేర్ చేస్తూ తన పేరు, వివరాలు కూడా చెప్పడం గమనార్హం. మొత్తానికి ఆనంద్ మహీంద్రా గుర్తించడంతో ప్రస్తుతం ఈ గుర్రమెక్కిన సాహస నారి దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది.


ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు పోస్ట్ చేయడం ఆనంద్ మహీంద్రాకి ఇది మొదటిసారేమీ కాదు. గతంలోనూ కేరళకు చెందిన ఓ చేపలు పట్టే అమ్మాయి ఫొటోని షేర్ చేసి.. ఆపై ఆమెకు చేపలు అమ్ముకోవడానికి ఓ వాహనం కూడా కొనివ్వడం మనకు తెలిసిందే.


ఇవి కూడా చదవండి.


క్యూట్ కౌబాయ్ తైమూర్‌.. జంతువులంటే ఈ స్టార్‌కిడ్‌కి ఎంత ప్రేమో..!


కోడిపిల్ల‌ను బ‌తికించాల‌ని.. హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లిన చిన్నారి..!


నిద్రంటే మీకు ఇష్ట‌మా? అయితే ఈ నాసా ఉద్యోగం మీ కోస‌మే ..!