సంక్రాంతి పండగకి నేను హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్లాను. దాదాపు అక్కడికి వెళ్లిన ప్రతిసారి నన్ను మా పక్కింటి బామ్మ బాగా ఆకర్షిస్తుంది. నా చిన్నప్పుడు నుంచి ఆవిడను చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఎంతందంగా ఉందో.. ఇప్పటికీ అంతే అందంగా ఉంది. ఆమెకి వయసు పెరిగింది కానీ ఆమె చర్మం మాత్రం ఇంకా యవ్వనంగానే కనిపిస్తుంది. ఆమె స్కిన్ మాత్రమే కాదు.. జుట్టు (Hair) కూడా అందంగానే ఉంటుంది. కాస్త నెరిసినప్పటికీ చాలా ఒత్తుగా, పొడవుగా ఉంటుంది. ఆవిడ ముడి వేస్తే పాత సినిమాలో వాణిశ్రీ ముడిలాగా ఉంటుంది. అసలు ఈ బామ్మ సౌందర్య రహస్యం ఏంటని చాలాసార్లు అనుకొనేదాన్ని. ఇక ఉండబట్టలేక ఇప్పటికీ నీ చర్మం ఇంత మెరుస్తూ ఉండటానికి కారణం ఏంటని అడిగితే.. అప్పుడు చెప్పింది తన సౌందర్య రహస్యం (Beauty Secret).
‘‘మీలా మేం బ్యూటీ పార్లర్లకు వెళ్లేవాళ్లం కాదు. మాకు అంత తీరికా ఉండేది కాదు. ప్రత్యేకించి అందం కోసం ఏమీ చేసేవాళ్లం కాదు. మా తరానికి మీలా సబ్బులు , షాంపూలు తెలియవు. వాటికి బదులుగా మేం నలుగు, కుంకుడుకాయలు వాడేవాళ్లం. అందుకే మా జుట్టు, చర్మం ఇప్పటికీ అందంగానే ఉన్నాయి. మా తరానికి మీ తరానికి ఉన్నతేడా.. మేం పసుపు (Turmeric), గంధం వంటివి ఉపయోగించేవాళ్లం. ఇప్పటికీ వాడుతున్నాం. కానీ మీరు మాత్రం వాటినే దూరంగా పెట్టి బోలెడు డబ్బులు ఖర్చుపెట్టి మార్కెట్లో దొరికేవాటిని ఉపయోగిస్తున్నారు. అదే (beauty) మీకూ మాకూ ఉన్న తేడా’’ అంది బామ్మ,
అందమైన చర్మ, కేశ రక్షణకు.. అత్యుత్తమ ప్రకృతి ఔషధాలు (Amazing Natural Ingredients To Get Beautiful Skin And Hair)
అవును బామ్మ చెప్పింది నిజమే. మన ముందు తరాల వారి మాదిరిగా కాకుండా మనం ప్రకృతికి కాస్త దూరంగానే జరిగాం. అందుకేనేమో జుట్టు రాలిపోవడం, స్కిన్ ముడతలు పడడం వంటి సమస్యలు మనల్ని చిన్నవయసులోనే పలకరిస్తున్నాయి.
అందుకే ఆ రోజుల్లో బామ్మ తన చర్మం కోసం ఏమేమి ఉపయోగించిందో అడిగి తెలుసుకొన్నా. ఆమె చెప్పినవి విన్న తర్వాత.. ఇన్ని రోజులూ వాటి గురించి తెలుసుకోనందుకు నన్ను నేనే తిట్టుకొన్నానంటే నమ్మండి. చాాలా తక్కువ ఖర్చుతో వారి చర్మం ఎంతో సున్నితంగా, ఆరోగ్యంగా మారుతుంది. వాటిని ఉపయోగిస్తే మనమూ అందంగా తయారవుతామనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: తెలుగులో ఆయుర్వేద బ్యూటీ టిప్ (Ayurvedic Beauty Tips In Telugu)
నలుగుపిండి (Besan/Gram Fl our)
మన ముందు తరాల వారు సబ్బుని ఉపయోగించేవారు కాదు. దానికి బదులుగా నలుగుపిండి ఉపయోగించేవారు. దానికోసం పెసరపిండి, శెనగపిండి (Besan Powder), పసుపు కలిపి ఉపయోగించేవారు. ఇది చర్మ రంధ్రాల్లోని మురికిని వదిలిస్తుంది. చర్మంపై చేరిన మృతకణాలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పైగా చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు (Unwanted Hair) సైతం తగ్గుముఖం పడతాయి.
బామ్మ చిట్కా: ఈ మిశ్రమంలో పాలు లేదా పెరుగు కలిపి ఉపయోగిస్తే చర్మం శుభ్రపడటం మాత్రమే కాదు మాయిశ్చరైజ్ కూడా అవుతుంది.
పసుపు (Turmeric)
పసుపు (Turmeric) ముఖ వర్ఛస్సుని పెంపొందిస్తుంది. దీనిలో ఉన్న యాంటిబయోటిక్, యాంటి సెప్టిక్ గుణాల వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. మన ముందు తరం వరకు అంటే బామ్మ, అమ్మ తలస్నానం చేసిన ప్రతిసారి ముఖానికి పసుపు రాసుకొంటారు. అందుకే వారి ముఖంపై మొటిమలు కనిపించవు. పైగా చర్మం ఛాయ సైతం మెరుగుపడుతుంది. పసుపు శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది.
బామ్మ చిట్కా: శెనగ పిండిలో కొద్దిగా పసుపు కలిపి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే స్కిన్ అందంగా తయారవుతుంది.
Also Read: మచ్చలు తొలగించేందుకు క్రీములు, ట్రీట్మెంట్స్ (Cream And Treatments To Remove Acne Spots)
కుంకుడుకాయలు, షీకాయ (Shikakai, Ritha)
మన చిన్నతనంలో షాంపూకి బదులుగా కుంకుడుకాయలను కేశాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవాళ్లం. కొందరు షీకాయలను వాడేవారు. అయితే షాంపూల రాకతో వాటి వినియోగం కనుమరుగైపోయింది. కానీ తలను శుభ్రం చేసుకోవడానికి ఇప్పటికీ మా బామ్మ కుంకుడుకాయలనే వాడుతుంది. దీనివల్ల జుట్టుపై రసాయనాల ప్రభావం పడదు. అంతేకాదు తలస్నానం చేసేముందు కుదుళ్లకు కొబ్బరి నూనె (Coconut oil) బాగా పట్టించేవారు. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు (Hair) సైతం అంత త్వరగా తెల్లబడదు. జుట్టు రాలడమూ తగ్గుతుంది.
బామ్మ చిట్కా: వేడి నీటిలో కుంకుడుకాయలు, షీకాయ, పెద్ద ఉసిరి గింజల పొడి కలిపి నానబెట్టి దీంతో తలస్నానం చేస్తే.. జుట్టు ఎప్పటికీ నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.
వెన్న (Butter)
ఇప్పుడంటే మనం చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకొంటున్నాం. కానీ ఒకప్పుడు దానికోసం తాజావెన్నను ఉపయోగించేవారు. దీనివల్ల స్కిన్ పాపాయి చర్మం అంత లేతగా మారిపోతుంది. పైగా ఒకసారి రాసుకొంటే.. ఆ రోజంతా చర్మం పొడిబారకుండా ఉంటుంది. పొడిబారిన, పగిలిన పెదాలను తిరిగి మామూలుగా మార్చడానికి మనం లిప్ బామ్ (Lip balm) ఉపయోగిస్తాం. కానీ ఆ రోజుల్లో వెన్నను ఉపయోగించేవారు. దీనివల్ల పెదవులు అందంగా కనిపిస్తాయి. బామ్మ కూడా ఇప్పటికీ రోజూ ఇలానే చేస్తుంది. పెరుగు చిలికినప్పుడు.. కవ్వానికి మిగిలిపోయిన కాస్త వెన్న రాసుకొంటుందంట బామ్మ.
బామ్మ చిట్కా: రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు వెన్న రాసుకొంటే.. మరుసటి రోజు లిప్ బామ్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు.
చర్మాన్ని మెరిపించే నేచురల్ టిప్స్ (Homemade Beauty Tips In Telugu)
చందనం.. (Sandalwood)
గంధం కూడా చర్మానికి మేలు చేసే వాటిలో ఒకటి. దీన్ని కూడా మన బామ్మల కాలంలో ఉపయోగించేవారు. గంధపు చెక్కను సానపై అరగదీసి దాన్ని ముఖానికి రాసుకొనేవారు. చందనం చర్మంపై ఉండే ట్యాన్‌ను తొలగిస్తుంది. స్కిన్‌ను ముడతలు పడకుండా చేసి ఎప్పటికీ యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. మొటిమలు రాకుండా సంరక్షిస్తుంది.
బామ్మ చిట్కా: చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా తయారవ్వడానికి పచ్చిపాలతో గంధపు చెక్కను అరగదీసి ముఖానికి రాసుకొని పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఛాయ కూడా పెరుగుతుంది.
కొబ్బరి నూనె (Coconut Oil)
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కానీ ఒకప్పుడు తలకు రాసుకోవడానికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె (Coconut Oil)ను ఉపయోగించేవారు. దాన్ని కూడా మార్కెట్లో కొనేవారు కాదు. కానీ కొబ్బరి కాయలను ఎండబెట్టి వాటిని ఆడించి నూనె తీసేవారు. అంత స్వచ్ఛమైన నూనెను ఉపయోగించేవారు కాబట్టే వారి జుట్టు (Hair) దృఢంగా, ఒత్తుగా ఉండేది. ఇప్పటికీ పల్లెటూళ్లలో కొనుగోలు చేసిన కొబ్బరినూనె కంటే.. స్వయంగా తయారుచేసుకొన్నది వాడటానికే ప్రాధాన్యమిస్తారు. ఈ కొబ్బరి నూనె వినియోగాన్ని కేవలం జుట్టుకే పరిమితం చేయలేదు మన బామ్మలు. స్నానానికి ముందు చర్మానికి రాసుకొనేవారు. కొంతమంది అయితే దీనిలో పచ్చకర్పూరం కలిపి శరీరానికి రాసుకొనేవారు. దీనివల్ల స్కిన్ పొడిబారకుండా ఉంటుంది. కర్పూరం వినియోగించడం ద్వారా కూడా.. కొన్ని చర్మసంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.
బామ్మ చిట్కా: జుట్టు బలంగా, ఒత్తుగా మారడం కోసం కొబ్బరి నూనెలో గోరింటాకు, మందార ఆకు, మందార పువ్వు, గుంటగలగర వేసి మరిగించి చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసి జుట్టుకి రాసుకొంటే జుట్టు దృఢంగా, ఒత్తుగా మారుతుంది.
Also Read: చర్మానికి ఆముదం అందించే ప్రయోజనాలు (Castor Oil Benefits)
గోరింట (Henna)
మన శరీరంలో ఎక్కువ ఒత్తిడి పడేది పాదాలపైనే. అందుకే వాటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు పండగలు, పబ్బాలతో పాటు ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా.. లేదా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినా కచ్చితంగా గోరింటాకు పెట్టుకొనేవారు. చేతులకే కాదు.. పాదాలకు కూడా దాన్ని పెట్టుకొనేవారు. గోరింట అరచేతులు, పాదాలను అందంగా మార్చడం మాత్రమే కాదు… దానిలోని ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్లు రానీయకుండా చేస్తాయి.
సామాను తోమడం, నీరు తీసుకురావడం, బట్టలు ఉతకడం వంటివి చేయడం వల్ల వారి పాదాలు, అరచేతులు వాటి మృదుత్వాన్ని కోల్పోయి కళావిహీనంగా కనిపించేవి.. ఇలా జరగకుండా ఉండటానికి గోరింటను వాడేవారు. గోరింట పాదాల పగుళ్లను సైతం తగ్గిస్తుంది. రుతువులు మారే సమయంలో కలిగే వాతావరణ మార్పుల వల్ల పాదాలు పగలకుండా గోరింట పెట్టుకొనేవారు. అంతేకాదు.. గోరింటాకు కుదుళ్లకు పోషణ ఇస్తుంది. ఇది స్కాల్ఫ్ పీహెచ్ విలువను సమతౌల్యం చేస్తుంది. దీని వలన చుండ్రు తగ్గడంతో పాటు, జుట్టు తెల్లగా మారడం, జుట్టు రాలే సమస్యలు సైతం రాకుండా ఉంటాయి.
బామ్మ చిట్కా: గోరింటను మెత్తగా నూరి తలకు ప్యాక్‌లా అప్లై చేసుంటే.. జుట్టు కుదుళ్ల నుంచి బలపడుతుంది. దీన్ని మనం తలకు అప్లై చేసుకొనే హెన్నాకు బదులుగా వాడొచ్చు.
వేప (Margo)
ఒకప్పుడు స్నానం చేసే నీళ్లలో వేపాకులు వేసి బాగా కాచేవారు. దీనిలోని ఔషధ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. దీనివల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మ సంబంధమైన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వేప చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది.
బామ్మ చిట్కా: వేపాకులను మెత్తగా నూరి దాన్నుంచి రసాన్ని వేరు చేసి.. తలకు రాసుకొంటే చుండ్రు తగ్గిపోతుంది.
ఇవీ బామ్మ నాకు చెప్పిన కొన్ని సౌందర్య చిట్కాలు. చూశారా ఎంత సులభంగా ఉన్నాయో కదా..! అందుకే నేను కూడా వాటిని ఇప్పటి నుంచే పాటించాలనుకొంటున్నాను. మరి మీరు?
Images: Shutterstock
ఇవి కూడా చదవండి
కాలేజీ అమ్మాయిలూ.. ఈ 10 రకాల పర్ఫ్యూమ్స్ మీకోసమే..
15 రకాల బెస్ట్ బీబీ క్రీమ్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి..
అదిరేటి లుక్ కావాలంటే.. ఆరెంజ్ బ్లష్ అప్లై చేయాల్సిందే..
బాడీస్క్రబ్స్ వల్ల ప్రయోజనాలు (Benefits Of Homemade Body Scrubs)