ఈరోజుల్లో స్విగ్గీ (swiggy) & జొమాటో వంటి ఫుడ్ డెలివరీ (delivery) యాప్స్ గురించి తెలియనివారు చాలా తక్కువే. ఇంతకుముందు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫుడ్ యాప్స్ ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోనూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీన్నిబట్టి మనం ఈ ఫుడ్ యాప్స్ ప్రజల్లోకి ఎంతలా చొచ్చుకుపోయాయో అనేది అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫుడ్ యాప్స్ ని నమ్ముకుని జీవించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ ఫుడ్ యాప్స్ లో డెలివరీ బాయ్స్ గా మారి ఎంతోకొంత సంపాదిస్తున్నారు.
హైదరాబాద్ ట్రెండ్స్ : ఈ హోటల్ యజమాని నుండి ఉద్యోగుల వరకూ.. అందరూ మహిళలే..!
అయితే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ డెలివరీ చేసేవారిలో ఎక్కువగా మగవారే కనిపిస్తుంటారు. కానీ హైదరాబాద్ (Hyderabad) కి చెందిన జనని రావు (janani rao) స్విగ్గీ సంస్థకి చెందిన డెలివరీ గర్ల్ గా ఈమధ్యనే జాయిన్ అయింది. ఈ సంస్థకు సంబంధించి మన రాష్ట్రంలో మొదటి డెలివరీ గర్ల్ తనే కావడం విశేషం. ఆమె నగరం లోని విల్లా మేరీ కాలేజీ నుండి సైకాలజీ & మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తిచేసింది. అయితే తన జీవితంలో ఛాలెంజ్ అనిపించే పనులు చేయడానికి ఇష్టపడే జనని అదే తనని స్విగ్గీ లో డెలివరీ గర్ల్ గా మారడానికి ప్రేరేపించిందని చెబుతుంది.
గత ఏడాది చివరలో డెలివరీ బాయ్స్ తో పాటుగా డెలివరీ గర్ల్స్ కోసం కూడా ప్రకటన ఇచ్చింది. ఈ ఉద్యోగ ప్రకటన పట్ల ఆకర్షితురాలైన జనని తన తల్లిదండ్రులకి ఒప్పించి ఈ ఉద్యోగంలో చేరింది. రోజూ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ఫుడ్ డెలివరీ చేయడంలో బిజిబిజిగా గడిపేస్తుంటుంది జనని. ఈ సమయంలో 6 నుండి 7 వరకు ఫుడ్ డెలివరీస్ ఇస్తాను అని చెప్పుకొచ్చింది.
ఈ ఉద్యోగం చేయడం నీకు భయం అనిపించలేదా? అని అడిగితే – తాను మానసికంగా సిద్ధమయ్యే ఈ ఉద్యోగంలో చేరినట్టుగా స్పష్టం చేసింది. పైగా సంస్థ వారు కూడా ఆడవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పనివేళలు సాయంత్రం 6 గంటల వరకే ముగిసేలా ఏర్పాట్లు చేశారట. అదే సమయంలో వీరి వద్ద ఎల్లప్పుడూ పెప్పర్ స్ప్రే ఉంచడం & వీరేదైనా ప్రమాదంలో ఉంటే తెలియచేసేలా ఒక ఎమర్జెన్సీ యాప్ ని కూడా వీరి ఫోన్స్ కి అమర్చినట్టుగా తెలిపింది. ఈ సదుపాయాల కారణంగా తనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు అని తెలియచేసింది.
డ్రెస్‌కోడ్‌కి వ్యతిరేకంగా పోరాడాం.. విజయం సాధించాం : సెయింట్ ఫ్రాన్సిస్ విద్యార్థినులు
ఫుడ్ డెలివరీ చేసే సమయంలో కస్టమర్స్ తో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అని ప్రశ్నించగా – ఎప్పుడైనా కొన్నిసార్లు అడ్రస్ సరిగా దొరకక లేదా ట్రాఫిక్ కారణంగా డెలివరీ లేట్ అయితే తప్ప మిగతా సమయాల్లో చాలా వ్యవహరిస్తారు. ముఖ్యంగా డెలివరీ చేసేందుకు వచ్చింది అమ్మాయి అని గుర్తించి నా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతేకాదు.. నేను చేసే పనిని మెచ్చుకుంటూ జీవితంలో ముందుకి సాగాలని ప్రోత్సహిస్తుంటారు అని చెప్పుకొచ్చింది.
ఇతర ఉద్యోగాల్లో ఉన్నట్టు ఇక్కడ కూడా వేధింపులు ఏమైనా ఎదురయ్యాయా? అని అడిగితే – ఇప్పటివరికైతే తనకెలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదని చెప్పిన ఆమె..తోటి ఉద్యోగులు & హోటల్ యజమానులు కూడా బాగా సహాకరిస్తున్నారు అని చెప్పింది. భవిష్యత్తు గురించి అడిగితే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం వల్ల వచ్చే మొత్తాన్ని తన తల్లిదండ్రులకి ఇచ్చేస్తాను అని చెబుతూ భవిష్యత్తులో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నట్టుగా తన మనసులో మాట బయటపెట్టింది.
ఏ పనీ చిన్నదీ, పెద్దది కాదని.. చేసే ప్రతి పనిలోనూ ఓ ఛాలెంజ్ ఉండాలని.. అలా అయితేనే జీవితం ఛాలెంజింగ్ గా సాగుతూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులెదురైనా వాటిని తట్టుకునేందుకు మనల్ని సిద్ధం చేస్తుందని తన జీవితం ద్వారా అందరికీ చాటుతోంది జనని. ఆమె తనలాంటి అమ్మాయిలందరికీ ఎంతో ఆదర్శం.
ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ కొట్టేసిన.. 87 ఏళ్ల క్రికెట్ అభిమాని చారులత పటేల్ ..!