డ్రెస్‌కోడ్‌కి వ్యతిరేకంగా పోరాడాం.. విజయం సాధించాం : సెయింట్ ఫ్రాన్సిస్ విద్యార్థినులు

డ్రెస్‌కోడ్‌కి వ్యతిరేకంగా పోరాడాం.. విజయం సాధించాం : సెయింట్ ఫ్రాన్సిస్ విద్యార్థినులు

గత కొంత కాలంగా అమ్మాయిలు లేదా స్త్రీలు.. ఎటువంటి దుస్తులు ధరించాలన్న టాపిక్ పై పెద్ద ఎత్తున్న చర్చలు నడుస్తున్నాయి. కొందరు అమ్మాయిల వస్త్రధారణ కారణంగానే వారి పైన అత్యాచారాలు జరుగుతున్నాయని వాదిస్తుంటే.. మరికొందరేమో అమ్మాయిల దుస్తుల వల్ల కాదని.. అలా ఆలోచించే వారి మానసిక స్థితి వల్ల అరాచకాలు పెరుగుతున్నాయని వాదిస్తున్నారు.

హైదరాబాద్ ట్రెండ్స్ : ఈ హోటల్‌ యజమాని నుండి ఉద్యోగుల వరకూ.. అందరూ మహిళలే..!

దాదాపు ఇలాంటి ఒక అంశమే.. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ప్రముఖ మహిళా కళాశాలైన సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో (St Francis Womens College) రోజుల పాటు తీవ్ర దుమారం రేపింది. అసలేం జరిగిందంటే - గత నెలలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ప్రిన్సిపాల్.. అన్ని సంవత్సరాల విద్యార్థినులకు సర్క్యులర్ పంపించారు.

తమ మోకాళ్ళ క్రింద వరకు ఉండే కుర్తీలను ధరించడం తప్పనిసరి అంటూ ఒక డ్రెస్ కోడ్ (Dress Code) అమలు చేస్తూ.. దానిని రూల్‌గా పెట్టించారు. ఈ అంశంపై  భిన్న స్వరాలు వినిపించినప్పటికి.. విద్యార్థినులు ఈ రూల్‌ని పాటించేందుకు ఒప్పుకుని కళాశాలకు వస్తున్నారు.

అయితే ఈ తరుణంలో ఓ లేడి సెక్యూరిటీ గార్డుని కాలేజీ ముందు నియమించి.. ఆమె ద్వారా కళాశాలకు వచ్చే విద్యార్థినులు డ్రెస్‌కోడ్‌కి లోబడే వస్త్రధారణలో వస్తున్నారా? లేదా? అనేది పర్యవేక్షిస్తున్నారు. 

అయితే సదరు సెక్యూరిటీ లేడీ.. కళాశాలకు వస్తున్న విద్యార్థినుల పట్ల దురుసుగా వ్యవహరించడమే కాకుండా.. కుర్తి మోకాళ్ళ పైకి కొద్దిగా ఉన్నా కూడా వాళ్లను అనుమతించడం లేదని.. ఆ విధంగా తమపై జులుం ప్రదర్శిస్తుందని విద్యార్థినులు తెలిపారు. ఈ క్రమంలో కళాశాల విద్యార్థినులందరూ.. నిరసనకు దిగి తరగతులని బహిష్కరించారు.

ఒక్క సారిగా పెల్లుబికిన ఈ నిరసనలు.. ఒక్కరోజులోనే మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఇదే అంశంపై పలు కథనాలు కూడా టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి.

దీంతో ఈ విద్యార్థినులకు దేశవ్యాప్తంగా మద్దతు రావడం జరిగింది. ఇక ఈ నిరసనలో భాగంగా విద్యార్థినులు ప్రదర్శించిన ప్లకార్డ్స్‌కి మంచి స్పందన వచ్చింది. అందులో కొన్ని -

* ఎడ్యుకేట్ నాట్ రెగ్యులేట్

* ది ఓన్లీ ఇష్ష్యు ఈజ్ యువర్ మెంటాలిటీ

* రిమూవ్ ది డ్రెస్ కోడ్

* డ్రెస్ కోడ్స్ ప్రమోట్ రేప్ కల్చర్

* మై బాడీ.. మై ఛాయస్

* అవర్ బాడీస్, అవర్ మైండ్స్, అవర్ పవర్, అవర్ ఛాయిస్

మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

ఇలాంటి ఆకట్టుకొనే ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ.. ఈ విద్యార్థినులు తమ నిరసనని దాదాపు రెండు రోజుల పాటు నిర్వహించారు. ఇక నిన్నటి రోజున ఈ అంశానికి మీడియా నుండి కవరేజ్ రావడంతో.. సోషల్ మీడియాలో సైతం వీరికి మద్దతు తెలుపుతూ చాలామంది పోస్టులు పెట్టారు. 

దీనిపై సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ యాజమాన్యం స్పందించింది. ప్రిన్సిపాల్ కూడా ఈ డ్రెస్ కోడ్ రూల్‌ని నిలిపివేస్తున్నట్లు మైక్‌లో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే విద్యార్థినులు అందరూ కాలేజ్ అడ్మిషన్ తీసుకునే సమయంలోనే.. అభ్యంతరకరమైన బట్టలని వేసుకోమని అండర్ టేకింగ్ ఫారమ్ పై సంతకాలు చేశారట. కాబట్టి.. అందుకు అనుగుణంగా ఈ డ్రెస్ కోడ్‌ని పాటించకపోయినా ఫర్వాలేదని.. కాకపోతే అభ్యంతరకర దుస్తుల్లో మాత్రం రాకూడదని కాలేజీ యాజమాన్యం తెలిపింది.

ఇక ఈ నిర్ణయం తరువాత.. విద్యార్థినులు పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరికి మద్దతు తెలిపిన వారికి కూడా తమ అభినందనలు తెలియచేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా సెయింట్ ఫ్రాన్సిస్ విద్యార్థినులు తమ హక్కు కై పోరాడి సాధించుకున్న తీరుని అభినందించడం జరిగింది.

అలా ఈ డ్రెస్ కోడ్ రూల్‌కి సంబంధించిన వార్త.. తొలుత బేగంపేట్ (Begumpet) సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుండి మొదలై.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. అయితే ఇదే అంశం పై భిన్న స్వరాలు.. వాదనలు ఉన్నప్పటికి.. సెయింట్ ఫ్రాన్సిస్ విద్యార్థినులు మాత్రం తమ పోరాటంలో విజయం సాధించారు.

మహిళలు ఇంకా మహారాణులు కాలేదు..

Featured Image: Instagram.com/Campuslly