ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల(freedom fighters) త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛాజీవితం. మరి వారు ఎలాంటి పరిస్థితుల్లో సమరానికి పూనుకొన్నారు? ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? ఇవి తెలుసుకొంటే.. నరనరాన దేశభక్తి ఉప్పొంగుతుంది. అందుకే ఆనాటి పరిస్థితులను మన కళ్లకు కట్టే పుస్తకాలు(books) చదవాలి. అందులోనూ స్వాతంత్య్ర సమరంలో తమ ప్రాణాలను లెక్కచేయని యోధులు రాసిన పుస్తకాలు చదివితే.. ఆనాటి పరిస్థితులు మనం తెలుసుకోవడం మాత్రమే కాదు.. సమరయోధులకు నివాళి అర్పించినట్లవుతుంది.
1. ఇండియా విన్స్ ఫ్రీడం, మౌలానా అబుల్ కలాం ఆజాద్
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పేరెన్నిక గన్న నాయకుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. విద్యావేత్త కూడా. ఈ పుస్తకంలో స్వాతంత్య్ర సమర కాలంలో చేపట్టిన ఉద్యమాలు.. దానికోసం దేశ పౌరులు చేసిన త్యాగాల గురించి దీనిలో వివరించారు ఆయన. క్రిప్స్ మిషన్ దగ్గర నుంచి దేశ విభజన వరకు అన్ని విషయాలను ఇందులో అక్షరీకరించారు ఆజాద్. ప్రస్తుతం ఈ పుస్తకం దొరకడం కష్టమే అయినా కిండల్ వెర్షన్ అందుబాటులో ఉంది.
2. ఆనంద్ మఠ్, బంకిం చంద్ర ఛటర్జీ
బంకిం చంద్ర ఛటర్జీ మన జాతీయ గేయం వందేమాతరం రచయిత. ఈ గేయాన్ని ఆయన రచించిన ఆనంద్ మఠ్ నుంచి సంగ్రహించారు. ఆ రోజుల్లో ఈ పుస్తకంలోని గేయాలు భారతీయ పౌరుల్లో స్వాతంత్య్రోద్యమ కాంక్షను రగిలించాయి. వాసుదేవ బల్వంత్ ఫడ్కే తాను నడిపిన సన్యాసి ఉద్యమంలో ఈ గేయాలను పాడుతూ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. అందుకే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆనంద్ మఠ్ పై నిషేధాన్ని ఎత్తివేశారు.
3. వై ఐయామ్ ఏన్ ఎతీస్ట్, భగత్ సింగ్
భగత్ సింగ్ నాడు పూరించిన విప్లవ శంఖానాదం నేటికీ యువతలో స్ఫూర్తిని రగిలిస్తోంది. భారత మాత కోసం తన ప్రాణాలను అర్పించిన ధీరుడాయన. బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్‌ను ఉరితీయడానికి ఏడాది పూర్వం ఆయన ఈ పుస్తకం రచించారు. దేవునిపై నమ్మకాన్ని కోల్పోవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఇందులో వివరించారు. ఇది ఆయన రచించిన దీర్ఘవ్యాసం. దీనిలో ఆయన విప్లవ భావాలను కలిగిన వ్యక్తిగా.. దేశ సేవ కోసం పాటుపడేవారిని ఆరాధించే వ్యక్తిగా ప్రకటించుకొన్నారు. దీన్ని 1930కు పూర్వమే రచించారు కాబట్టి.. ఆనాటి సామాజిక పరిస్థితులను సైతం తెలుసుకోవచ్చు. దీని ప్రింటెడ్ వర్షన్ ఇప్పుడు దొరకడం అరుదు. కానీ కిండెల్ వర్షన్ అందుబాటులో ఉంది.
4. హింద్ స్వరాజ్, మహాత్మా గాంధీ
యావద్భారతావనిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. స్వాతంత్య్రం దిశగా నడిపించి దాన్ని సాధించిన మహనీయుడు మహాత్మాగాంధీ. ఈ ప్రయాణంలో ఆయన చూపించిన తెెగువ, పాటించిన అహింసా సిద్ధాంతమే ఆయన్ను మహనీయుడిగా, మహాత్ముడిగా మార్చాయి. స్వాతంత్య్రానికి పూర్వం ఆయన గుజరాతీలో ఈ పుస్తకాన్ని రచించారు. స్వాంతత్య్ర ఉద్యమం గురించి ప్రజల్లో ఉన్న సందేహాలకు దీని ద్వారా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. 1909లో ప్రచురితమైన ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత దీన్ని ఆంగ్లంలోకి అనువదించి మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లారు గాంధీజీ. ఈ గణతంత్ర దినోత్సవానికి కచ్చితంగా చదవాల్సిన పుస్తకాల్లో ఇదొకటి. దీనిలో హోంరూల్ ఉద్యమం గురించి రీడర్ సందేహాలకు ఎడిటర్ సమాధానమిచ్చినట్టుగా రచించారు. అంటే పుస్తకం ప్రశ్నలు సమాధానాల రూపంలోనే ఉంటుంది.
5. ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857, వీర్ సావర్కర్
1857లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర ఉద్యమం గురించి వినాయక దామోదర్ సావర్కర్ ఈ పుస్తకాన్ని రచించారు. మరాఠీలో రచించిన ఈ పుస్తకాన్ని తర్వాత ఆంగ్లంలోకి అనువదించారు. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతో స్ఫూర్తి పొందిన వీర్ సావర్కర్ దీన్ని రచించారు.
కానీ ఈ పుస్తకం ప్రచురించడానికి ముందే దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1908లో పూర్తయిన మరాఠీ రాత ప్రతుల్ని ప్రచురించడానికి చాలా ప్రయత్నాలు చేశారాయన. చివరకు 1909లో హాలెండ్ లో ముద్రించారు. ఈ పుస్తకం రెండో ఎడిషన్ ను గదర్ పార్టీకి చెందిన లాల్ హర్ దయాల్, మూడో ఎడిషన్ ను సర్దార్ భగత్ సింగ్, నాలుగో ఎడిషన్ ను సుభాష్ చంద్రబోస్ ముద్రించారు. ఈ పుస్తకాన్ని ఉర్దూ, హిందీ, పంజాబీ, తమిళ భాషల్లోకి అనువదించారు. మరి ఇంతటి గొప్ప పుస్తకాన్ని మనమూ చదవాలి కదా..!
ఇవి కూడా చదవండి
దేశభక్తిని ఆవిష్కరించిన.. అద్భుత సినీ ఆణిముత్యాలు ఇవే..!
జయహో మహిళ… “నారీ శక్తి”కి అసలైన నిర్వచనం.. ఈ గణతంత్ర దినోత్సవం