నెలసరి, గర్భధారణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు సాధారణంగా గైనకాలజిస్ట్‌ని (gynecologist) సంప్రదిస్తారు. వారు సమస్యను గుర్తించి దానికి తగిన చికిత్సను అందిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే.. చాలామంది మహిళలు డాక్టర్ దగ్గరకు వెళతారు కానీ.. ఎప్పుడెప్పుడు ఆ గది నుంచి బయటకు వచ్చేస్తామా? అని ఎదురు చూస్తుంటారు.
దీనికి భయం ఓ కారణమైతే.. వారు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాస్త ఇబ్బందిని కలిగించడం మరో కారణం. ఈ హడావుడిలో వీరికున్న సందేహాలు అడగడం మరచిపోతారు. డాక్టర్ చెప్పినట్లుగా మందులు వాడతారు. సమస్య నుంచి బయటపడతారు. కానీ వారి మనసులో ఉన్న సందేహాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అలాంటి వాటిలో కొన్ని ప్రశ్నలు (questions).. వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భం దాల్చకుండా ఉండేందుకు.. నేను ఎలాంటి పద్ధతులు పాటించవచ్చు?
రెగ్యులర్‌గా కలయికలో పాల్గొనే వారికి గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మారుతున్న జీవనసరళి, ఉద్యోగ జీవితం కారణంగా ఎక్కువ మంది పిల్లలను కనడం వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారు. దానికోసం గర్భ నియంత్రణ పద్ధతులు అవలంబిస్తున్నారు. ఎక్కువ మంది గర్భ నిరోధక మాత్రలు వాడటం లేదా కండోమ్ ఉపయోగించడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇవే కాకుండా వీటి కంటే ప్రభావితంగా పనిచేసే ఆధునిక గర్భనిరోధక పద్థతులు సైతం ఉన్నాయి.
ప్యాచెస్, యూఐడీ, ఇంజెక్షన్స్ ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగించడం వల్ల గర్భం రాకుండా జాగ్రత్తపడినప్పటికీ వాటి వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. పైగా వాటిని దీర్ఘ కాలం ఉపయోగించడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈ సారి గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు మొహమాటపడకుండా ఈ ప్రశ్న అడగండి.
Shutterstock
నెల నెలా పీరియడ్స్ సరిగ్గా రాకపోతే.. దాన్ని సమస్యగా పరిగణించాల్సిందేనా?
పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం చాలామందిలో జరుగుతుంది. సాధారణంగా 28 నుంచి 40 రోజుల వ్యవధిలో నెలసరి వస్తుంది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఒత్తిడి, డిప్రెషన్ తదితర కారణాల వల్ల కాస్త అటూ ఇటూగా వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటం చాలా సులువు. అయితే కొందరిలో హార్మోన్, పీసీఓడీ సమస్యల వల్ల పీరియడ్స్ సరిగ్గా రావు. కానీ చాలామంది ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. దీనివల్ల స్థూలకాయం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు తలెత్తొచ్చు. కాబట్టి పీరియడ్స్ నెలనెలా రాకపోతే.. గైనకాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. వారు మీ సమస్యకు గల కారణం గుర్తించి మీకు తగిన చికిత్స అందిస్తారు.
పీరియడ్స్ సమయంలో.. కలయికలో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలున్నాయా?
పీరియడ్స్ సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం రాదని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే అది అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు. సాధారణంగా అండాశయం నుంచి అండం 12 నుంచి 14 రోజుల మధ్య విడుదలవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అండం త్వరగా విడుదలవుతుంది. అంటే పీరియడ్స్ వచ్చిన తొమ్మిదో రోజునే అండం విడుదలవుతుంది. పైగా వీర్యకణాలు మూడు రోజుల వరకు గర్భాశయంలో జీవించి ఉంటాయి. ఇలాంటి సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశాలుంటాయి.
Shutterstock
పునరుత్పత్తి వ్యవస్థ బాగుండాలంటే.. ఎలాంటి జాగ్రత్త పాటించాలి?
మహిళల ఆరోగ్యం బాగుండాలంటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యే హార్మోన్ల మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే మెనోపాజ్ దశలో ఉన్న మహిళలను గమనించండి. కొన్ని నెలల క్రితం వరకు సాధారణ బరువులో ఉన్నవారు మోనోపాజ్ దశలో ఊబకాయం సమస్యతో బాధపడుతుంటారు. వారీలో బీపీ స్థాయి పెరిగిపోతుంది. అండాశయ, గర్భాశయ క్యాన్సర్లకు గురవుతుంటారు.
కాబట్టి పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు. కానీ ఈ విషయంలో చాలామంది మహిళలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంటారు. ఏమీ కాదులే అనే ధైర్యంతో పాటు సరైన అవగాహన లేకపోవడమూ దీనికి కారణమే. అలాగే గర్భాశయ, రుతుక్రమ సమస్యల గురించి చెప్పుకోవడానికి సిగ్గు పడటమూ మరో కారణం.
కానీ ఏదైనా సమస్యగా అనిపిస్తే గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకున్న సందేహాలన్నీ క్లియర్ చేసుకోవడంతో పాటు పాప్ స్మియర్, మామోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోండి. అలాగే లైంగిక చర్య ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో పరీక్షలు చేయించుకోవాలి. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలున్నా.. క్లియర్ చేసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు.
బికినీ వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల.. ఏమైనా సమస్యలు తలెత్తుతాయా?
మన శరీరంలోని అతి సున్నితమైన భాగం వెజీనా. ఇంత సున్నితమైన ప్రాంతంలో వ్యాక్స్ చేయించుకోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తచ్చు. ముఖ్యంగా ఆ భాగంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాక్స్ పూయడానికి ఉపయోగించే స్పాచులా శుభ్రమైనది కాకపోతే.. ఒకరి నుంచి ఇంకొకరికి ఎస్టీడీ, ఎస్టీఐలు సోకే అవకాశం ఉంది. వ్యాక్స్ స్ట్రిప్ బలంగా లాగడం వల్ల అక్కడి కణజాలం దెబ్బతినొచ్చు. కాబట్టి బికినీ వ్యాక్స్‌కి దూరంగా ఉండటమే మంచిది.
వెజైనల్ డిశ్చార్జ్ దుర్వాసనకు కారణమేంటి?
సాధారణంగా మన శరీర భాగాలు సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం పాటిస్తాయి. ఏదైనా సమస్య వస్తే దానంతట అదే శుభ్రం చేసుకొనేలా మన శరీరం రూపుదిద్దుకుంది. వెజైనల్ డిశ్చార్జి కూడా అంతే. అక్కడ చేరిన బ్యాక్టీరియా, ఇతరమైన వాటిని డిశ్చార్జి రూపంలో బయటకు పంపిస్తుంది. ఇది అందరిలోనూ సహజంగా జరిగేదే.
కానీ కొన్నిసార్లు వెజైనల్ డిశ్చార్జి దుర్వాసన కొన్ని ఇన్ఫెక్షన్లకు సంకేతం. అయితే దీని గురించి మాట్లాడటానికి ఎవరూ సాహసించరు. కొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా వెజీనా పీహెచ్ విలువలో మార్పులు వస్తాయి. ఫలితంగా రంగు, వాసనలో మార్పులు వస్తాయి. వెజైనల్ డిశ్చార్జి నుంచి వచ్చే వాసన, రంగు ఆధారంగా మీకు ఏ రకమైన ఇన్ఫెక్షన్ సోకిందో గుర్తించి తగిన చికిత్స అందిస్తారు.
కలయిక సమయంలో నొప్పిని తగ్గించుకొనే అవకాశం ఉందా?
సరిగ్గా లూబ్రికేషన్ జరగకపోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్ల కారణంగా కొంతమంది మహిళలు కలయిక సమయంలో కొంత నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఇతరత్రా కారణాల వల్ల కూడా నొప్పి రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని చర్చించడానికి చాలామంది మహిళలు ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి గైనకాలజిస్ట్‌ను సంప్రదించినప్పుడు ఈ ప్రశ్న కచ్చితంగా అడగండి. వారు మీ సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తారు. వారు సూచించే మందులు వేసుకోవడం ద్వారా కలయిక సమయంలో.. నొప్పితో పాటు దానికి కారణమైన సమస్యను సైతం తగ్గించుకోవచ్చు.