కొన్ని పాటలు వింటుంటే.. అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. తెలుగు సినీ ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమో ఏమో కానీ.. ఈ ఏడాది అన్ని మంచి పాటలకే.. మన సంగీత దర్శకులు బాణీలు సమకూర్చారు. అవన్నీ మన చెవుల్లో తేనె పోశాయనే చెప్పాలి. అయితే వాటిలో కొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. అందులోనూ కొన్ని రొమాంటిక్ సాంగ్స్‌ను (Romantic songs) మాత్రం.. అలా రీప్లే మోడ్‌లో వింటూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది విడుదలైన అలాంటి పాటల్లో.. టాప్ 10 అని చెప్పుకోదగిన మంచి రొమాంటిక్ సాంగ్స్ గురించి మీకోసం..
కడలల్లె వేచె కనులె
డియర్ కామ్రేడ్ సినిమాలోని ఈ పాటకు యువతరం ఫిదా అయిపోయింది. ఈ పాట వింటుంటే.. మనలో ఏదో తెలియని చిత్రమైన అనుభూతి కలుగుతుంది. ‘విరహం పొంగెలే.. హృదయం ఊగెలే..’ అనే వాక్యాలు వచ్చినప్పుడు.. మనకు తెలియకుండానే మన శరీరంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ అనుభూతి మీరు కూడా పొందే ఉంటారు కదా. సిద్ శ్రీరాం, ఐశ్వర్య రవిచంద్రన్ ఈ పాటకు.. తమ అద్భుతమైన వాయిస్‌తో ప్రాణం పోశారు. రెహ్మాన్ కలం నుండి జాలువారిన ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
ప్రియతమా ప్రియతమా – మజిలీ
చిన్మయి గొంతులో ప్రాణం పోసుకున్న ఈ పాట చాలా హృద్యంగా సాగుతుంది. మనసు పడిన అబ్బాయిపై ప్రేమను, ఆ ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని ప్రేమిస్తే కలిగే బాధను.. ఒకే పాటలో వివరించడం గొప్ప విషయమే. చిన్మయి కూడా ఈ పాటకు తగిన భావాలను తన గొంతులో పలికించింది. చిన్మయి పాటకు సమంత అభినయం కూడా తోడవడంతో.. పాట సూపర్ హిట్‌గా నిలిచింది. మజిలీ సినిమాలోని ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. గోపీ సుందర్ బాణీలు సమకూర్చారు.
మెల్ల మెల్లగా గుండెల్లో – ఏబీసీడీ
అల్లు శిరీష్ హీరోగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. ఈ సినిమాలోని ఈ పాట మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించడం ఈ పాట ప్రత్యేకత. వినసొంపైన సంగీతం, ఆకట్టుకునే లిరిక్స్‌కి సిద్ శ్రీరాం గొంతు తోడవడంతో ఈ పాట తెలుగు యువతరానికి చేరువైంది.
చందమామే చేతికందే – 118
ఈ ఏడాది విడుదలై బాగా పాపులరైన రొమాంటిక్ పాటల్లో 118 సినిమాలోని ఈ పాట కూడా ఒకటి. కల్యాణ్ రామ్, షాలినీ పాండేల మధ్య వచ్చే ఈ పాటలో ఫీల్ చాలా సూపర్బ్‌గా ఉంటుంది. యాజిన్ నిజర్ గొంతులో ఈ పాట చాలా మధురంగా ఉంటుంది.
అదేంటో గానీ – జెర్సీ
జెర్సీ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. నాని, శ్రద్ధ శ్రీనాథ్ మధ్య వచ్చే ఈ ప్రేమ గీతం మన మనసుని కట్టి పడేస్తుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే.. వారికి మీ మనసులోని మాటను చెప్పడానికి ఈ పాటను ఉపయోగించుకోవచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించి.. తానే స్వయంగా పాడిన ఈ పాటకు చాలామంది అభిమానులే ఉన్నారు.
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. – డియర్ కామ్రేడ్
డియర్ కామ్రేడ్ సినిమాలోని మరో ప్రేమ గీతం ఇది. వింటున్నంత సేపు మనసు.. మరో లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే ఈ పాట కూడా ఎక్కువ మంది యువతకు చేరువైంది. వారి ఫేవరెట్ పాటల్లో ఒకటిగా మారిపోయింది. ఈ పాట పాడిన గౌతమ్ భరద్వాజ్ గొంతులో మహిమో.. సాహిత్యంలోని గొప్పదనమో కానీ.. ఈ పాట ఒకసారి వింటే.. రోజంతా హమ్ చేస్తూనే ఉంటాం.
ప్రేమ వెన్నెల – చిత్ర లహరి
‘రంగు రంగు పువ్వులున్న తోటలో..’ అంటూ మొదలయ్యే ఈ పాట చాలా కూల్‌గా సాగిపోతుంది. వింటున్నంత సేపు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఓ అమ్మాయిపై కథానాయకుడికి ఉన్న ప్రేమను ఆవిష్కరించే పాట ఇది. సుదర్శన్ అశోక్ పాడిన ఈ పాటను శ్రీమణి రచించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
తలపు తలుపు – బ్రోచేవారెవరురా
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం బ్రోచేవారెవరురా. ఈ సినిమాలోని ఓ మంచి పాట ‘తలపు తలుపులే’.. నివేథా పెతురాజ్, సత్యదేవ్‌లపై చిత్రీకరించిన ఈ పాట వింటుంటే.. మనసులో ఏదో తెలియని తియ్యని అలజడి రేగుతుంది.
సైయ్యా సైకో – సాహో
‘ఆగదిక సైయ్యా సైకో..’ అంటూ రీసెంట్‌గానే విడుదలైన ఈ పాట.. చాలా తక్కువ సమయంలో అందరికీ చేరువైంది. సగం ఇంగ్లీషు, సగం తెలుగులో ఉన్నట్టనిపించే ఈ పాట చాలా వినసొంపుగా ఉంటుంది. మొదటిసారి విన్నప్పుడే ఇది ఏదో డబ్బింగ్ పాటలా అనిపిస్తుంది. కానీ ఏదో మ్యాజిక్ మాత్రం ఈ పాటను మళ్లీ మళ్లీ వినేలా చేస్తుంది. తన్సిక్ బాగ్చీ, అనిరుధ్ రవిచంద్రన్, ధ్వని భన్సాలీ పాడిన ఈ పాట మీకు కూడా నచ్చే ఉంటుంది కదా.
నా గుండెల్లో – మజిలీ
మజిలీలోని మరో రొమాంటిక్ సాంగ్ ఇది. కోపం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారే సమయంలో ఇద్దరి మనసు ఎలా ఉంటుందో తెలిపే పాట ఇది. యాజిన్ నిజార్, నిఖితా గాంధీ పాడిన ఈ పాటను నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్ పై చిత్రీకరించారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది