తల్లి పక్కలో ఆదమరిచి నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకు పోయి అత్యాచారం (Rape) చేసి ఆ చిన్నారి ప్రాణాలు తీసేశాడో దుర్మార్గుడు. తప్ప తాగిన మైకంలో విచక్షణ మరచి కామంతో కళ్లు మూసుకుపోయి.. ఇంత కర్కశానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఈ దుర్మార్గుడికి ఉరిశిక్ష (death sentence) వేయడమే సరైనదని అనుకోనివారు లేరు. తాజాగా కోర్టు కూడా అతగాడికి అదే సరైన శిక్ష అని తీర్పిచ్చింది. నిజమే.. వరంగల్ జిల్లాలో జరిగిన పసిపాప అత్యాచారం కేసులో నిందితుడైన ప్రవీణ్‌కు.. ఆ జిల్లా అదనపు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఓ తల్లిగా నేను ఈ తీర్పును సమర్థిస్తున్నాను. ఎందుకంటే.. తన బిడ్డను కోల్పోయి ఓ తల్లి అనుభవిస్తున్న బాధేమిటో మరో తల్లికే తెలుస్తుంది కాబట్టి.
సరిగ్గా 53 రోజుల క్రితం.. టీవీలో ఈ సంఘటన గురించి వచ్చిన వార్త నన్ను బాగా కలిచివేసింది. ఆ పాపను పట్టుకుని ఏడుస్తున్న తల్లిదండ్రులను చూసి బాధగా అనిపించింది. ఒక్క క్షణం వారి స్థానంలో నన్ను ఊహించుకుంటే… “అమ్మో.. వెన్నులో వణుకు పుట్టింది. ఇక నా వల్ల కాలేదు. ఎంత ఆపుకుందామన్నా నా కళ్లలోంచి వచ్చే కన్నీటిని ఆపలేకపోయాను. ఎందుకో ఆ క్షణం చాలా భయమేసింది.”
మన చుట్టూనే తిరుగుతూ.. మంచి మనుషుల్లా నటిస్తూ.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న తోడేళ్ల లాంటి మనుషులు ఎవరున్నారో తెలియక.. ఇంకెంతమంది చిన్నారులను మేక వన్నె పులుల రూపంలో దుర్మార్గులు బలి తీసుకుంటారో తెలియక భయమేసింది. ఇప్పటికీ ఆ భయం వెంటాడుతూనే ఉంది. రోడ్డు మీద ఎవరైనా ఓ ఆడపిల్ల కనిపిస్తే.. ‘దేవుడా.. ఈ అమ్మాయి ఇంటికి క్షేమంగా చేరుకునేలా చూడు.. తండ్రీ’ అని మనసులో అనుకుంటూనే ఉంటాను. శ్రీహితలా మరో చిన్నారి ఇలాంటి దుశ్చర్యలకు బలికాకూడదనే కోరుకుంటాను.
వరంగల్ ఘటనలో ముద్దాయి ప్రవీణ్‌ని.. కామోన్మాది అనాలా.. మద్యం మత్తులో విచక్షణ మరచిపోయాడు అనాలా? ఏమో నాకు తెలియదు. కానీ అతను చేసిన తప్పు మాత్రం క్షమార్హమైనది కాదు. క్షమార్హం కాకూడదు కూడా. ఇది ఓ తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న మరో తల్లిగా చెబుతున్నాను. అభం శుభం తెలియని ఓ పసిపాపను చిదిమేసిన.. ఓ కామాంధుడిపై ఉన్న కసితో మాట్లాడుతున్నాను.
కనీసం ఆ ఉరిశిక్షకైనా భయపడి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా ఉంటారని ఓ చిన్న ఆశ నాది. నాదే కాదు.. ఇది ఎంతోమంది తల్లిదండ్రుల ఆశ. ఎప్పుడు ఏ క్షణం.. ఎటు వైపు నుంచి తమ పిల్లలకు ఎలాంటి ఆపద వస్తుందోనని అనునిత్యం భయపడుతూ బతుకుతోన్న నాలాంటి తల్లుల ఆశ. అది అడియాస కాకుండా ఉండాలంటే.. ఇలాంటి కఠినమైన చట్టాలు రావాల్సిందే.
ఈ కేసులో మొత్తం 51 మంది సాక్షులుంటే.. 30 మంది కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. పోలీసులు 20 రోజుల్లోనే నిందితుడిపై నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. విచారణ సమయంలో ప్రవీణ్ కూడా తాగిన మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. కాలయాపన లేకుండా ఈ కేసు విచారణ ఇంత త్వరగా ముగించి.. నిందితుడికి శిక్ష వేసిన న్యాయస్థానంపై, పోలీసు వ్యవస్థపై నాకు నమ్మకం పెరిగింది. రెండు నెలల్లోనే విచారణ పూర్తి చేసి దోషిగా నిర్ధరించి శిక్ష విధించడం అభినందించదగ్గ విషయమే.
మిగిలిన అత్యాచార కేసుల విషయంలోనూ.. ఈ వేగం ఇలానే ఉండాలని.. కోర్టులు ఇలానే వ్యవహరించాలని కోరుకుంటున్నా. మరో అభినందించదగిన విషయమేంటంటే.. జిల్లాలోని న్యాయవాదులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రవీణ్ తరఫున కేసు వాదించబోమని కచ్చితంగా చెప్పడం.
ఆ రోజు ఆ వార్త చూసినప్పుడు కళ్లల్లో కన్నీళ్లు. ఈ రోజు ఈ వార్తను చూస్తున్నప్పుడు సంతోషం. నేనేమీ శాడిస్టును కాదు. ఓ సగటు మధ్యతరగతి తల్లిని. సురక్షితమైన వాతావరణంలో పిల్లలు పెరగాలని కోరుకునేదాన్ని. కన్నబిడ్డకు ఎలాంటి కష్టం రాకూడదని కోరుకునేదాన్ని. అందుకే ఈ కామాంధుడికి ఉరే సరైన శిక్ష అంటున్నా.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది