సినీ పరిశ్రమ (Movie Industry)లో ఒక భాషలో విజయం సాధించిన నటీనటులు మరొక భాషలోనూ పని చేయడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే చాలామంది టాలీవుడ్ ఆర్టిస్ట్స్ హిందీ, తమిళం, కన్నడం వంటి భాషల్లో నటిస్తుండగా; ఇతర భాషలకు చెందిన నటీనటులు దక్షిణాది భాషల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇది నాణానికి ఒకవైపు అయితే.. పలువురు నటులు కేవలం ఒకే భాష చిత్రాల్లోనే నటించడానికి పరిమితం అయినప్పటికీ.. తమ అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉంటారు. ఈ క్రమంలో అభిమానులు సైతం తమ అభిమాన నటులు తమ ప్రాంతీయ భాషలో రూపొందించే సినిమాల్లో నటించాలని ఆశిస్తూ ఉంటారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ కోవకు చెందిన వ్యక్తే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అమితాబ్ ఇప్పటి వరకు నేరుగా తెలుగులో నటించిన చిత్రం ఒకే ఒక్కటి. అదే- ఏఎన్నార్ (ANR) ఆఖరి చిత్రం అయిన మనం (Manam). ఇందులో ఆయన ఒక అతిథి పాత్రలో కనిపించారు. పాత్ర నిడివి తక్కువే అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర నిడివి కాస్త ఎక్కువేనట! ఈ సినిమాకు పని చేసిన కొన్ని స్టిల్స్‌ను కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా అందరితోనూ షేర్ చేసుకున్నారు.
చూస్తుంటే ఆయన కుమారుడు, ప్రముఖ బాలీవుడ్ హీరో అయిన అభిషేక్ బచ్చన్ Abhishek Bachchan) కూడా దక్షిణాది సినీ పరిశ్రమపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ మంచి అవకాశాలు వస్తే తప్పకుండా సౌత్ ఇండస్ట్రీల్లో పని చేస్తా అని ఆయన గతంలో ఇచ్చిన మాటను నిజం చేస్తూ.. ప్రస్తుతం దానికి కార్యరూపం ఇచ్చే పనిలో ఉన్నారట! ఈ క్రమంలో ఇటీవలే ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని చిత్రసీమలో వార్తలు వినిపిస్తున్నాయి.
విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) & దర్శకుడు శంకర్ (Shankar) కలయికలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఇండియన్ 2 (Indian 2) చిత్రంలో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) నటించనున్నాడట! ఇందులో ఆయన చేయనున్న పాత్ర చిత్రకథకు చాలా కీలకం అని కూడా అంటున్నాయి సినీవర్గాలు. తనకు ఆఫర్ చేసిన పాత్ర అభిషేక్‌కి బాగా నచ్చడంతో వెంటనే ఈ కథకు ఓకే చెప్పేశాడట! అయితే ఇండియన్ 2లో ఆయన పాత్ర విలనా?? లేక మరేదైనా కీలక పాత్ర అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అంతేకాదు.. ఈ వార్తలకు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు.
బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమ బాట పట్టిన వారిలో అభిషేక్ కంటే ముందు చాలామంది నటీనటులు ఉన్నారు. అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన 2.0 చిత్రంతో తమిళంలో అడుగుపెట్టగా; ప‌్రస్తుతం ఇండియన్ 2లో కూడా నటించేందుకు అంగీకరించాడట! ఇక వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi), నీల్ నితిన్ ముకేశ్ (Neil Nithin Mukesh) వంటివారు ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి ఇక్కడ తమకంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇండియన్ 2 చిత్రంలో నటిస్గున్న నటీనటులపై రకరకాల వార్తలు వినిపిస్తున్న క్రమంలో అభిషేక్ బచ్చన్ గురించి హల్చల్ చేస్తోన్న ఈ వార్త ఎంత వరకు నిజమో శంకర్ చెబితే కానీ ఆయన పాత్రపై ఒక స్పష్టత రాదు. ఈ సినిమాలో కమల్ సరసన అందాల నాయిక కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా; అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తోందీ చిత్రబృందం.
ఇవి కూడా చదవండి
కమల్ “భారతీయుడు” చిత్రానికి.. వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి..?
మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో హీరో.. వైష్ణవ్ తేజ్..!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” హీరోయిన్ యజ్ఞ శెట్టి గురించి.. ఎవరికీ తెలియని విషయాలివే..!