ఆర్మీ పెరేడ్ డే.. దీన్నే రైజింగ్ డేగా కూడా పిలుస్తారు. బ్రిటిష్ ఆర్మీకి చెందిన ఆఖరి కమాండర్ ఇన్ చీఫ్ తన విధుల నుంచి వైదొలిగి ఆ బాధ్యతలను భారత లెఫ్టినెంట్ జనరల్‌కి అప్పగించిన రోజు.. దానికి గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 15న ఆర్మీ పెరేడ్ డేగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా జనవరి 15న పెరేడ్ డే సందర్భంగా సైనికులంతా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కి సైనిక వందనం సమర్పించనున్నారు.
ఈసారి వేడుకల్లో ఆర్మీ సర్వీస్ కాప్స్ (ఏఎస్సీ) బృందం ఇరవై మూడేళ్ల తర్వాత పరేడ్‌లో పాల్గొననుంది. ఇది ఈసారి వేడుకలను ప్రత్యేకంగా మార్చబోతోంది. అయితే ఇంతకంటే పెద్ద ప్రత్యేకత ఈసారి వేడుకల్లో మనకు కనిపించబోతోంది. అదేంటనుకుంటున్నారా? మొదటిసారిగా ఓ మహిళ సైనిక పటాలానికి నాయకత్వం వహించడం. అవును.. లెఫ్టినెంట్ భావనా కస్తూరి ఈసారి వేడుకల్లో తన బృందానికి నాయకత్వం వహించనుంది. దీంతో మొదటిసారి ఓ పురుషుల బృందానికి.. అదీ ఆర్మీ డే పెరేడ్లో నాయకత్వం వహించిన మహిళగా భావన చరిత్రలో నిలిచిపోనుంది.
దీని గురించి డైలీ పయనీర్ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన భావన మా సెంటర్ బెంగళూరులో ఉంది. నేను నా రెజిమెంటల్ సెంటర్ నుంచి ఇక్కడికి వచ్చాను.. ఆరు నెలల నుంచి మేమంతా ఈ పరేడ్ కోసం శిక్షణ తీసుకుంటున్నాం. నాతో పాటు మరో ఇద్దరు పురుషులు కూడా కమాండర్లుగా శిక్షణ పొందుతున్నారు. ఆర్మీ ఇలా మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
భావనా కస్తూరి (Bhavana Kasturi) గురించి మరింత సమాచారం మీకోసం..
1. భారత ఆర్మీ చరిత్రలోనే మొదటిసారి ఆర్మీ డే పెరేడ్లో 144 మంది ఉన్న పటాలానికి నాయకత్వం వహించనున్న మహిళ భావన.
2. 2015 రిపబ్లిక్ డే వేడుకల్లో పూర్తిగా మహిళలతో కూడిన పటాలానికి కెప్టెన్ దివ్య అజిత్ కుమార్ నాయకత్వం వహించారు. అయితే పూర్తిగా పురుషులున్న బృందాన్ని నడిపించిన ఘనత మాత్రం భావనా కస్తూరికే చెందుతుంది.
3. అక్టోబర్ 2015లో ఎన్సీసీ 38వ బ్యాచ్ నుంచి ఎంపికైన భావన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది.
4. తన ఎన్సీసీ బ్యాచ్‌లో నాలుగో ర్యాంక్ సాధించిన భావన మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంది.
5. జనవరి 15న నిర్వహించబోయే పెరేడ్లో పాల్గొనేందుకు లెఫ్టినెంట్ భావనా కస్తూరితో పాటు తన పటాలం మొత్తం సంవత్సరం నుంచి శిక్షణ పొందుతోంది.
ఆర్మీ డే ఎందుకు జరుపుకుంటామంటే..
రైజింగ్ డే పరేడ్.. దీన్నే ఆర్మీ డేగా పిలుస్తారు. ఈరోజున దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికులందరినీ స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తుచేసుకుంటారు. సైనికులంతా దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆర్మీ చీఫ్ జనరల్‌కి గౌరవ వందనం సమర్పిస్తారు. ఈరోజును బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ ఫ్రాన్సిస్ బచర్ నుంచి భారత లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప బాధ్యతలు తీసుకున్న రోజును గుర్తుచేసుకుంటూ నిర్వహిస్తారు. 1949 జనవరి 15న బ్రిటిష్ వారి నుంచి బారత మిలిటరీ బాధ్యతలను స్వీకరించింది.
ఈసారి వేడుకల్లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ గన్ సిస్టమ్స్, ఎం777 అల్ట్రా లైట్ ఫిరంగి, కె9 వజ్ర – టి ఫిరంగి వంటివి కూడా ప్రదర్శించనున్నారట.
భారత మహిళలు సాధిస్తున్న ఈ అద్భుత విజయాలను మనం ఆదర్శంగా తీసుకుందాం..
ఇవి కూడా చదవండి
భావన కస్తూరి గురించ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
విద్యాహక్కు బాలికలకు నిజంగానే లభిస్తోందా. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
ఇండియన్ ఆర్మీకి చెందిన ఈ వీడియో మిమ్మల్ని నిజంగానే కట్టిపడేస్తుంది.