home / వినోదం
సంబ‌రాల సంక్రాంతి.. ఈసారి టాలీవుడ్‌కి ఎలాంటి విజయాలను అందిస్తోంది..?

సంబ‌రాల సంక్రాంతి.. ఈసారి టాలీవుడ్‌కి ఎలాంటి విజయాలను అందిస్తోంది..?

సంక్రాంతి మ‌న తెలుగువారి పెద్ద పండగ.. అంద‌రికీ ఎంతో ఇష్టమైన పండగ. మూడురోజుల పాటు ఎంతో సంతోషంగా జరుపుకొనే ఈ పండగకి గొబ్బెమ్మ‌లు, రంగ‌వ‌ళ్లులు, పిండివంట‌లతో పాటు సినిమాలు కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటాయి. సంక్రాంతి పండ‌క్కి కొత్త సినిమాలు విడుద‌ల‌వ్వ‌డం ప్రేక్ష‌కులు.. కూడా పండ‌గ సంబ‌రాల్లో భాగంగా కుటుంబంతో పాటు సినిమాలు చూడడం జరుగుతూ ఉంటుంది.

అయితే గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడడంతో సినీ అభిమానులకి పోయిన సంక్రాంతి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది అనే చెప్పాలి. ప్రేక్షకులు ఆ స్థాయిలో నిరాశ చెందడానికి కారణం – భారీ అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి & జైసింహ చిత్రాలు అంచనాలు అందుకోలేకపోవడమే. ఇవి ఇండ‌స్ట్రీలో పెద్ద హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నటసింహం బాలకృష్ణ (Balakrishna) చిత్రాలు కావడం వ‌ల్ల.. అభిమానులు వాటిపై భారీ అంచ‌నాలు పెంచుకోవ‌డం వల్ల కూడా బాక్సాఫీస్‌ వద్ద తీవ్ర ప్రభావమే చూపింద‌ని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

అంతకుముందు ఏడాది మాత్రం విడుదలైన మూడు చిత్రాలూ బాక్సాఫీస్‌ వద్ద హిట్స్‌గా నిలిచాయి. చిరంజీవి ఖైదీ నెం 150, బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి .. ఈ మూడు చిత్రాలు హిట్ అవ్వడంతో 2017లో తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా తన ప్రయాణాన్ని ఆరంభించింది. అయితే ఆ పరిస్థితి 2018లో లేదు. అందుకనే ఇప్పుడు మరోసారి 2018 పునరావృతం అవ్వకూడదని తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సినీ అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

ఇక ఈ సంవత్సరం బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న‌ ఎన్ఠీఆర్ కథానాయకుడు చిత్రం సంక్రాంతికి ముందే విడుదలై.. ఇప్పటికే హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప‌లువురు ప్ర‌ముఖ సినీన‌టులు.. అప్ప‌టి ప్రముఖుల పాత్రల్లో నటించడం విశేషం. ఈ చిత్రానికి క్రిష్ (Krish) దర్శకత్వం వహించగా.. బాలకృష్ణ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్‌ని ఇప్పటికే బాగా ఆకట్టుకుంది.

 

ఇక సంక్రాంతికి విడుదల అవ్వబోయే మరో చిత్రం రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ”. ఈ చిత్రం విషయానికి వస్తే, బోయపాటి శ్రీను వంటి మంచి యాక్షన్ సినిమాలు తీయగలిగే దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం పక్కా మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంద‌న్న అంచనాలున్నాయి. ఇక F2 (Fun & Frustration) సినిమా విషయానికి వస్తే, దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసినట్టుగా మనకి అర్ధమవుతుంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) & వరుణ్ తేజ్ (Varun Tej) లు హీరోలుగా చేస్తుండగా వారి పక్క‌న తమన్నా & మెహరీన్‌లు హీరోయిన్లుగా నటించారు.

 

వీటితో పాటుగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన పెట్ట (Petta) చిత్రం కూడా ఈ సంక్రాంతికి ముందే విడుదల కానుంది. ఈ సినిమాలో రజినీకాంత్ చాలా మామూలుగా కంటే యంగ్‌గా కనిపించారని టాక్. పైగా ఆయన సరసన త్రిష & సిమ్రాన్‌లు హీరోయిన్స్‌గా నటించడం ఇంకా ఆసక్తిని పెంచుతోంది. ఈ తరుణంలో 2019 బాక్సాఫీస్ ఘనంగానే ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఎన్ఠీఆర్ బయోపిక్‌లో విడుదల అయిన తొలి భాగం ఇప్పటికే నందమూరి అభిమానుల్లో క్రేజ్ సంపాదించగా.. రామ్ చరణ్ “వినయ విధేయ రామ” చిత్రం పక్కా కమర్షియల్ చిత్రం విడుదలవుతుంది. ఈ రెండింటికి తోడుగా పండగ పూట కుటుంబమంతా చూసే F2 వంటి ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్‌ కూడా ఈసారి విడుదలకి సిద్దమవుతోంది. 

ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో.. ఏ చిత్రం కూడా మరో దానికి పోలిక లేకుండా ఉన్నాయి. దాదాపు దేనికదే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలే కావ‌డంతో దేని సంద‌డి దానిదేనంటున్నారు అభిమానులు. సంక్రాంతి సీజన్‌కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఏడాది బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించే సీజన్‌లలో సంక్రాంతి ఒకటి కావడంతో.. దానితో పాటే సంవత్సరం ప్రారంభంలోనే మంచి హిట్స్ వస్తే.. ఆ ఏడాది మొత్తం బాగుంటుంది అనే ఒక ఇండస్ట్రీ నమ్మకం కూడా ఉండడమే దీనికి కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

ఈ అంచనాలు & ఊహాగానాలు పక్కనపెడితే, 2019 సంక్రాంతి సీజన్ తెలుగు చిత్ర పరిశ్రమకి కలిసి రావాలని కోరుకుందాం…

ఇవి కూడా చదవండి

రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ “కథానాయకుడు” (సినిమా రివ్యూ)

ఈ సంక్రాంతికి.. ఈ టాలీవుడ్ చిత్రాలు చాలా స్పెషల్

 

06 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this