విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – ఈ రౌడీ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? తెలుగు సినీపరిశ్రమలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఈతరం కథానాయకుడు. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే ధోరణి నుంచి.. ఎలాగైనా ఉండచ్చు అంటూ తన విలక్షణమైన నటనతో చాటిచెప్పాడు. ముఖ్యంగా విజయ్ గత ఏడాది మూడు చిత్రాల్లో నటించగా ..వాటిలో రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. దాంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు.
2018లో విజయ్ నటించిన గీత గోవిందం & ట్యాక్సీవాలా (Geetha Govindam & Taxiwaala) చిత్రాలు విడుదలకి ముందే లీక్ అయ్యాయి. గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ రెండు చిత్రాలు రిలీజ్‌కు ముందే లీక్ అవ్వడం.. టాలీవుడ్‌లో కాస్త సంచలనం సృష్టించిన వార్తనే చెప్పాలి.
ఇలా విడుదలకు ముందే కొన్ని సమస్యలను ఎదుర్కొన్న ఈ చిత్రాలు కేవలం విజయ్ దేవరకొండ కారణంగానే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టగలిగాయి. సిల్వర్ స్క్రీన్‌పై విజయ్‌కు ఉన్న చరిష్మాకు మంచి కథలు కూడా తోడయ్యేసరికి ఏకంగా 2018 బ్లాక్‌బస్టర్స్ జాబితాలో చోటు సంపాదించేసుకున్నాయి.
ఇక బాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. దక్షిణాదిలో హిట్ అయిన సినిమాలను హిందీలో కూడా రీమేక్ చేసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాలను రీమేక్ చేయడం, అక్కడ అవి హిట్ అవ్వడం కూడా జరిగింది.
ఇటీవల విడుదలైన సింబా (Simbaa) చిత్రమే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ చిత్రాలను రీమేక్ చేసేందుకు కూడా అక్కడి నిర్మాతలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విజయ్ నటించిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేస్తుండగా.. అందులో షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా, కియారా అద్వాని (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అలాగే గతేడాది విజయ్ నటించిన “గీత గోవిందం” చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో విజయ్ స్థానంలో హీరోగా షాహిద్ కపూర్ తమ్ముడైన హీరో ఇషాన్ ఖత్తర్ (Ishaan Khatter) నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. అలాగే ఈ సినిమాకి సంబంధించి నటి & దర్శకుడి ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. అసలు ఈ సినిమా కథ అంతా హీరో & హీరోయిన్ పాత్రలే కేంద్రంగా సాగుతుంది కాబట్టి.. కథానాయిక పాత్ర కూడా కీలకమే.
తెలుగులో ఈ చిత్రం విజయవంతం కావడంలో నటీనటుల నటన, కథనం కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గీత గోవిందం విడుదల కావడానికి ముందు.. అర్జున్‌రెడ్డి వంటి మాస్ క్యారెక్టర్ చేసిన విజయ్ ఈ పాత్రలో ఆకట్టుకుంటాడా? లేదా? అని కాస్త సందేహించినప్పటికీ గోవిందంగా కూడా అందరినీ ఆకట్టుకోవడంలో బాగానే సక్సెస్ సాధించాడు. ఇక ప్రేక్షకులు అందించిన ఘన విజయంతో.. టాప్ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించేసుకున్నాడు విజయ్
ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏంటంటే – విజయ్ దేవరకొండ నటించిన రెండు చిత్రాలు దక్షిణాదిలో ఒకేసారి రీమేక్ బాట పట్టగా వాటిలో ఒక చిత్రంలో షాహిద్‌కపూర్ నటిస్తుండగా.. మరో చిత్రంలో తమ్ముడు ఇషాన్ ఖత్తర్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు రావడం గమనార్హం.
మరి, ఈ అన్నదమ్ములిద్దరికీ ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందిస్తాయో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి
2018 తెలుగు సినిమా ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే..!