అర్ధం కానిది ... అందమైనది .... అమ్మాయి మ‌న‌సు

అర్ధం కానిది ... అందమైనది .... అమ్మాయి మ‌న‌సు

ఒక చల్లటి సాయంత్రం నేను, రఘు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో బైక్ మీద వెళుతున్నాం. మా ఇద్ద‌రికీ సినిమాలు చూడ‌డం అంటే చాలా ఇష్టం. అంతేకాదు.. నాకైతే ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయాలని కూడా కోరిక. అందుకే కొన్ని ఫిల్మ్ బేస్డ్ కోర్సులు కూడా చేశా. త‌న‌తో క‌లిసి బైక్ పై వెళ్తున్న స‌మ‌యంలోనే.. ఎప్ప‌ట్నుంచో నేను అనుకుంటున్న ఒక స్టోరీ లైన్‌ని త‌న‌కు చెప్పి, నా స్నేహితుడి అభిప్రాయం కూడా తెలుసుకోవాల‌ని అనుకున్నాను.


వెంట‌నే.. ర‌ఘుతో  "నేనో మంచి ప్రేమ‌ క‌థ (love story) రాశాను... వింటావా" అని అడిగాను. ఫ్రెండ్ క‌దా.. కాద‌ని ఎలా అన‌గ‌ల‌డు పాపం..! అందుకే వింటానన్నాడు. ఇక ఆల‌స్యం చేయ‌కుండా నేను కూడా వెంట‌నే క‌థ చెప్ప‌డం మొద‌లుపెట్టాను.


"ఓ అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఓ అమ్మాయి, అబ్బాయి. వారిద్ద‌రూ చిన్న‌ప్పట్నుంచీ మంచి స్నేహితులు. కానీ అనుకోకుండా అబ్బాయి మ‌న‌సులో  అమ్మాయి ప‌ట్ల ప్రేమ చిగురిస్తుంది. అయితే అమ్మాయి మాత్రం ఆ ప్రేమ‌కు ససేమిరా అంటుంది. మ‌రి, ఈ జంట క‌థ ఏమైన‌ట్లు? వారి జీవితాలు ఎలాంటి మ‌లుపు తీసుకుంటాయి? వారికి పెళ్ల‌వుతుందా?? ఇదీ స్టోరీ లైన్" అన‌గానే ర‌ఘు వెంట‌నే బైక్ ఆపేశాడు.


"ఏమైందిరా మామా.. బైక్ ఎందుకు ఆపావు? క‌థ న‌చ్చ‌క‌పోతే ఇక చెప్ప‌నులే! ఇంటికి పోదాం పద" అని తనతో అన్నాను నేను. కానీ ర‌ఘు మాత్రం రోడ్డు ప‌క్క‌న ఉన్న ప‌చ్చ‌ని లాన్‌లో కూర్చొంటూ.. "రేయ్.. నువ్వు చెప్పిన లైన్ నాకు బాగా న‌చ్చింది. ఆ క‌థ మ‌రింత వివ‌రంగా విందామ‌ని బైక్ ఆపాను. అంతే.." అన‌డంతో నా ముఖంలో ఒకేసారి వెయ్యి ఓల్టుల విద్యుత్ ప్ర‌వ‌హించిన‌ట్లైంది. వెంట‌నే వెళ్లి వాడి ప‌క్క‌న కూర్చొని క‌థ‌ను మ‌రింత వివ‌రంగా చెప్ప‌డం ప్రారంభించాను.


ఇంట‌ర్ వ‌ర‌కు పుస్త‌కాలనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా భావించే అబ్బాయిలు, అమ్మాయిల‌కు.. కాలేజీ జీవితం మొద‌లు కాగానే ఒక్క‌సారిగా వారి ప్ర‌పంచం మారిపోతుంది. వాళ్ల క‌ల‌ల‌కు రెక్క‌లు రావ‌డ‌మే కాదు.. వూహ‌ల‌కు అంత‌న్న‌ది కూడా ఉండ‌దు. ఇంకొంద‌రైతే మ‌రో అడుగు ముందుకేసి త‌మ జీవితానికి కాబోయే భాగ‌స్వామిని కూడా వెతుక్కునే ప‌నిలో ప‌డ‌తారు.


అందుకే.. ఇంట‌ర్మీడియ‌ట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ మాత్రమే లోకంగా మార్చుకున్న వారు.. ప్రేమలో పడితే ఇక అంతే. మంచి ఫిజిక్ ఉన్న అబ్బాయి కోసం అమ్మాయిలు.. చ‌క్క‌ని కెమిస్ట్రీ కుదిరే అమ్మాయి కోసం అబ్బాయిలు వెతుక్కుంటారు.


అమ‌ర్, రుక్మిణిలు కూడా ఈ కోవ‌కు చెందిన జంటే. వీరిద్ద‌రూ చిన్న‌ప్ప‌ట్నుంచీ మంచి స్నేహితులు. ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్లేవారు. రోజుకి ఒక‌సారైనా గొడ‌వ ప‌డందే ఇద్దరికీ నిద్ర పట్టేది కాదు. ఇద్ద‌రూ క‌లిసే చ‌దువుకునేవారు. క‌లిసే బ‌య‌ట‌కు వెళ్లేవారు. అంత‌టి గాఢ‌మైన స్నేహం వీరిది.


కానీ అమ‌ర్ మ‌న‌సులో మాత్రం రుక్మిణి ప‌ట్ల ఇష్టం ఏర్ప‌డింది. అది క్ర‌మంగా ప్రేమ‌కు దారి తీసింది. ఇంకేముంది.. మ‌నోడు క‌ల‌ల్లో విహ‌రించ‌డం మొద‌లుపెట్టాడు. వాస్త‌వ లోకంలో కంటే స్వ‌ప్న‌లోకంలోనే ఎక్కువగా విహ‌రిస్తూ ఉండేవాడు. ఫ‌లితంగా మార్కులు త‌గ్గాయి. అయితే ఈ మార్పులేవీ రుక్మిణి గ‌మ‌నించ‌లేదు. కానీ ఎప్పుడైతే మార్కులు త‌క్కువ వ‌చ్చాయో.. వెంట‌నే అందుకు కార‌ణం ఏంట‌ని ఆరా తీయ‌డం ప్రారంభించింది. దాంతో అస‌లు విష‌యం చెప్ప‌లేక‌.. ప్ర‌స్తుత సంద‌ర్భాన్ని మాట‌ల‌తో క‌వ‌ర్ చేయ‌లేక ఆఖ‌రుకి "ఐ ల‌వ్ యూ.." అంటూ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టేశాడు అమ‌ర్.


అస‌లు ఈ ప్ర‌స్తావ‌నే ఊహించ‌ని రుక్మిణి షాకైంది. వెంట‌నే కాస్త తేరుకొని "ఏంటి.. లవ్వా?? మందేమైనా కొట్టావా? లేక నిన్న రాత్రి తాగింది ఇంకా దిగ‌లేదా? ల‌వ్వేంటి ల‌వ్వు?? కొవ్వు కాక‌పోతే..." అంది. ఆమె స‌మాధానాన్ని ముందుగానే ఊహించిన అమ‌ర్ వెంట‌నే.. "నిజం రుక్మిణి.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను బాగా చూసుకుంటా. నీ గురించి నాకు, నా గురించి నీకు బాగా తెలుసు. మ‌నం త‌ప్ప‌కుండా మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అవుతాం.." అంటూ ఆమెని ఒప్పించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించ‌డం మొద‌లుపెట్టాడు.


కానీ ఆమె నుంచి తిర‌స్కార‌మే ఎదురైంది. దాంతో ఇద్ద‌రూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. కాసేపటి త‌ర్వాత "అస‌లు ఇప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియ‌డం లేదు. నీ ద‌గ్గర నుంచి ఇలాంటి ఒక ప్ర‌తిపాద‌న వ‌స్తుంద‌ని నేను ఊహించ‌లేదు. ఒక్క‌సారి నీ మ‌న‌సులో ప్రేమ అనే భావ‌న మొద‌లైన త‌ర్వాత, తెలిసి తెలిసి దానిని మ‌రింత‌గా పెంచి పెద్ద‌ది చేయ‌లేను. అందుకే ముందే చెప్పేస్తున్నా. నేను నిన్ను ప్రేమించ‌డం లేదు. నువ్వు ఎప్ప‌టికీ నా బెస్ట్ ఫ్రెండ్ అంతే.." అంటూ నిట్టూర్చింది రుక్మిణి.

దాంతో అమ‌ర్ కూడా "నా మ‌న‌సులో నువ్వు త‌ప్ప ఇంకెవ‌రూ లేరు. ఉండరు కూడా" అని మ‌రోసారి త‌న‌కు న‌చ్చ‌చెప్తూ త‌న మ‌న‌సు విప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక చేసేది లేక రుక్మిణి..  " నువ్వు చాలా మంచివాడివి అమ‌ర్. కానీ నీకు ఇది త‌గ‌దు. నా మ‌న‌సులో నీ ప‌ట్ల ఇలాంటి ఉద్దేశం లేద‌ని చెప్తున్నా.. నువ్వు న‌న్ను ఒప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నావు.. ఇది ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు??" అని అడ‌గ్గా.. అమ‌ర్ ఏమీ మాట్లాడ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లేందుకు సిద్ధ‌మైపోతాడు.


దాంతో రుక్మిణి అమ‌ర్‌ను పిలిచి స‌మాధానం అడ‌గ్గా " నేను ప్రేమ అంటున్నా.. నువ్వు స్నేహం అంటున్నావు.. నీ కోసం.. నీతో మాట్లాడ‌డం కోసం నా ప్రేమ‌ను మ‌న స్నేహం ముసుగులో క‌ప్పేస్తూ న‌న్ను నేను మోసగించుకోలేను. నిన్ను మోసం చేయ‌లేను. దాని బ‌దులు నిన్ను విడిచి నేను దూరంగా వెళ్లిపోవ‌డం క‌రక్ట్.." అని తన మనసులోని విషయాన్ని తేటతెల్లం చేస్తాడు అమ‌ర్.


"మ‌రి, మ‌న స్నేహం సంగ‌తేంటి ?? నీ స్నేహితురాలిని ఇలానే వ‌దిలేస్తావా ??" అంటూ ప్ర‌శ్నిస్తుంది రుక్మిణి. వెంట‌నే స్క్రీన్ పై "అమ్మాయి మ‌న‌సు అంద‌మైన‌దే కానీ.. అంత త్వ‌ర‌గా అర్థం కాదు.. అని వ‌స్తుంది" అంటూ నేను క‌థ చెప్ప‌డం ముగించా.


ఇదంతా విన్న ర‌ఘు.. "క‌థ చాలా బాగుంది. నువ్వు ఈ క‌థ‌ను డైరెక్ట్ చెయ్యి. నేను ప్రొడ్యూస్ చేస్తా. పాత్ర‌ల‌కు త‌గిన విధంగా ఉన్న న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకుందాం.. ఇంత‌కీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?? వ‌చ్చే ఏడాది ప్రేమికుల దినోత్స‌వం రోజున‌.." అంటుంటే నా ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఆ వెంట‌నే మా ప‌క్క నుంచి ఓ అంద‌మైన అమ్మాయి న‌డుచుకుంటూ వెళ్తుంటే మా ఇద్ద‌రి దృష్టి అటే వెళ్లిపోయింది..


ఇవి కూడా చ‌ద‌వండి


చూపులతోనే మాటలు.. పుస్తకాల్లో ప్రేమలేఖలు.. ఆనాటి ప్రేమ అద్భుతం..


వాలెంటైన్స్ డే నాడు.. ప్రేయ‌సి నుంచి ప్రియుడు కోరుకునేవి ఇవే..!


వాలెంటైన్ వీకే కాదు.. యాంటీ వాలెంటైన్ వీక్ కూడా ఉందండోయ్..!