చూపులతోనే మాటలు.. పుస్తకాల్లో ప్రేమలేఖలు.. ఆనాటి ప్రేమ అద్భుతం..

చూపులతోనే మాటలు..  పుస్తకాల్లో ప్రేమలేఖలు.. ఆనాటి ప్రేమ అద్భుతం..

ఈ రోజుల్లో ప్రతీ విషయంలోనూ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు నేటి యువ‌త‌. అలాగే తీసుకున్న నిర్ణ‌యాల‌ను అంతే వేగంగా అమల్లో కూడా పెట్టేస్తున్నారు. ప్రేమ విషయంలోనూ అంతే..! అప్పటి తరంలో అయితే ప్రేమ విషయంలో చాలా నిదానంగా వ్యవహరించేవారు. దాన్ని గెలిపించుకొనే విషయంలోనూ ఎంతో ఓర్పుగా ఉండేవారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా.. తమ ప్రేమబంధాన్ని నిలుపుకోవడానికే ప్రయత్నించేవారు. ఈ రోజుల్లో అంటే వాట్సాప్, ఫేస్ బుక్ లాంటివి ఉన్నాయి. మరి, ఆ రోజుల్లో ప్రేమను ఒకరికొకరు ఎలా తెలియజేసుకొనేవారు? దాన్ని ఎలా గెలిపించుకొనేవారు? తెలుసుకొందాం.


1-old-generation-love-sathamanmbhavati


చూపులతోనే ఆరాధన..


ఇప్పుడంటే.. నచ్చిన అమ్మాయి కనిపించగానే.. వెంట పడి మరీ తమ మనసులోని మాటను చెప్పేస్తున్నారు అబ్బాయిలు. కానీ అప్పటి తరం ఇలాంటి వాటికి దూరం. చూపులతో ఆరాధించడం తప్ప తమ మనసులోని మాటను అంత త్వ‌ర‌గా బయటపెట్టేవారు కాదు. అసలు ఆ అమ్మాయిని చూస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరించేవారు.


ప్రేమ మనసులోనే..


ఒకసారి అమ్మాయి మనసుకి నచ్చితే.. ఆమె మీద ప్రేమ (Love)ను మనసులోనే దాచుకొనేవారు. కానీ బయటపెట్టేవారు కాదు. ఆనాటి సామాజిక పరిస్థితులు అలా ఉండేవి మరి. మూగగా వారిని ఆరాధించేవారే కానీ.. ఆ మాట బయట పెట్టడానికి చాలా సంశయించేవారు.


పుస్తకాల్లో ప్రేమలేఖ..


ఆ రోజుల్లో తాము ప్రేమిస్తున్న వ్యక్తికి మనసులోని మాటను చెప్పాలంటే.. చాలా ఆలోచించేవారు. నేరుగా చెప్పడానికి తటపటాయించేవారు. అందుకే అమ్మాయి దగ్గర పుస్తకం అరువు తీసుకొని.. అందులో ప్రేమలేఖ పెట్టి ఇచ్చేవారు. అది అమ్మాయి చదివి చెంప చెళ్లుమనిపించిందా.. ఇక అంతే సంగతులు. అక్కడితో ప్రేమకు పుల్ స్టాప్ పడిపోయినట్లే. కాస్త రెస్పాన్స్ వచ్చిందా ఇక ప్రియుని ఊహలకు రెక్కలొచ్చినట్టే.


2-old-gen-vs-new-gen


అటు ఇటు మారే లేఖలు..


అమ్మాయి కూడా అబ్బాయితో ప్రేమకు అంగీకరిస్తే.. ఇక అక్కడి నుంచి ఇద్దరూ ప్రేమలేఖల్లోనే కలసి విహరిస్తారు. ఆమె పుస్తకంలో అతడు.. అతడి పుస్తకంలో ఆమె.. ప్రేమలేఖలు పెట్టేవారు. వాటిని భద్రంగా దాచుకొని మళ్లీ మళ్లీ చదువుకొని మురిసిపోయేవారు. అబ్బ.. ఆలోచిస్తేనే ఎంత బాగుందో కదా..


ధైర్యంగా పెళ్లి..


ఆరోజుల్లో ప్రేమలో పడినవారు పెళ్లి చేసుకోవడమంటే కత్తి మీద సామే. అయినా ధైర్యం చేసి పెళ్లి చేసుకొన్నవారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆ రోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆదర్శ వివాహాలు చేసుకొన్న జంటలూ ఉన్నాయి. వారంతా ఇప్పటికీ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. 


3-old-gen-vs-new-gen


కష్టాలనూ ఇష్టంతోనే..


సమాజమే కాదు.. మన భావజాలమూ ఆధునికతను సంతరించుకొంటున్న ఈ రోజుల్లోనే ప్రేమ వివాహానికి పూర్తి స్థాయిలో అంగీకారం లభించడం లేదు. ఇక ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. రెండు వైపులా కుటుంబ సభ్యులు, బంధువులు వారితో తెగతెంపులు చేసుకొనేవారు. ఎలాంటి కష్టమొచ్చినా ఇద్దరూ కలసి సంతోషంగా అనుభవించేవారు. ఓర్పుగా.. నేర్పుగా వాటన్నింటినీ ఎదుర్కొని తమ జీవితాలను చక్కదిద్దుకొనేవారు.


ఆనాటి ప్రేమకు.. ఈ నాటి ప్రేమకు ఎంతో వ్యత్యాసముంది. ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న జంటలు వారిని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. 


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ "వాలెంటైన్స్ డే" కానుకలతో.. మీ మనోహరుడి మనసుని మరోసారి దోచేయండి..!


డియర్ ఎక్స్ .. నీకెలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియడం లేదు..!


#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!


మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??