బాడీ షేమింగ్ ప‌ట్ల.. బోల్డ్ గా స్పందించిన‌ నేహా ధూపియా..!

బాడీ షేమింగ్ ప‌ట్ల.. బోల్డ్ గా స్పందించిన‌ నేహా ధూపియా..!

బాలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ భామ‌ల జాబితా త‌యారు చేస్తే.. అందులో నేహా ధూపియా (Neha Dhupia) పేరు కూడా త‌ప్ప‌కుండా ముందువ‌రుస‌లోనే ఉంటుంది. ఏ అంశానికి సంబంధించి అయినా నిర్మొహ‌మాటంగా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్పే ఈ భామ తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా తానెవ‌రికీ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదంటూ కాస్త ఘాటుగా స్పందించింది. ఇంత‌కీ నేహా ఎందుకు అలా స్పందించింది? అస‌లు ఏం జ‌రిగిందంటే..ఫ్యాష‌న్ సెంట్ర‌ల్ అనే ఆన్ లైన్ ఫ్యాష‌న్ ప‌బ్లికేష‌న్.. ప్రెగ్నెన్సీ త‌ర్వాత నేహా బ‌రువు త‌గ్గ‌లేదంటూ ఒక ఆర్టిక‌ల్ ప్ర‌చురించింది. శ‌నివారం (ఫిబ్ర‌వరి 2) రోజున నేహా ఆ ఆర్టిక‌ల్ గురించి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది. "ధ‌న్య‌వాదాలు, త‌ర్వాత‌.." అంటూ సింపుల్‌గా ట్వీట్ చేసిన ఈ భామ ఆ పోస్ట్‌లో త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ల‌ను కూడా పంచుకుంది.


"మీకు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఈ త‌ర‌హా కామెంట్స్ న‌న్ను కొంచెం కూడా బాధ పెట్ట‌వు. కానీ ఈ తర‌హా వ్యాఖ్య‌లు కేవ‌లం సెల‌బ్రిటీలే కాదు.. సామాన్య మ‌హిళ‌లు సైతం నేడు ఎదుర్కొంటున్నారు. నిజానికి ఇది చాలా పెద్ద స‌మ‌స్య‌. ఈ విష‌యం అంద‌రికీ చెప్పాల‌నే ఇలా స్పందిస్తున్నా. సెల‌బ్రిటీల‌నే కాదు.. ఎవ్వ‌రినీ బ‌రువు లేదా అందం విష‌యంలో అవ‌మానించ‌డం త‌గ‌దు. కొద్ది రోజుల క్రిత‌మే నాకు బిడ్డ పుట్టింది. ఒక త‌ల్లిగా నా చిన్నారి కోసం నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాల‌ని అనుకుంటున్నా.


అందుకే రోజూ వ్యాయామం క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తున్నా. ఒక్కోసారి రోజుకు రెండు సార్లు జిమ్‌కి వెళ్తున్నా. అయితే నా బిడ్డ కోసం నేను ఫిట్‌గా మారాల‌నేది నా ప్రాధాన్యం మాత్ర‌మే. అంతేకానీ.. స‌మాజానికి అందంగా క‌నిపించాల‌నే ఉద్దేశంతో ఫిట్ అవ్వాల‌ని అనుకోను. రాబోయే రోజుల్లో అయినా.. మ‌రెవ‌రి గురించీ ఇలాంటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌కుండా ఉంటార‌ని ఆశిస్తున్నా.." అంటూ నేహా త‌న మ‌నోభావాల‌కు అక్ష‌ర రూపం ఇచ్చింది.బాడీ షేమింగ్ (Fat shaming) గురించి నేహా ట్వీట్ చేసిన కాసేప‌టికే.. ఆమెకు చాలామంది ప్ర‌ముఖులు, నెటిజన్ల నుంచి సానుకూల మ‌ద్ధ‌తు ల‌భించింది. ముఖ్యంగా కొత్త‌గా త‌ల్లైన ఒక స్త్రీ పట్ల మ‌రొక మ‌హిళ ఈ విధంగా వ్యాఖ్యానించ‌డంపై అంద‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాడీ షేమింగ్ గురించి నేహా స్పందించిన తీరుని ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు మెచ్చుకున్నారు. నిర్మాత‌ - ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ స్పందిస్తూ.. "నువ్వు ఒక అద్భుత‌మైన మ‌హిళ‌వు. నీ తెలివితేట‌లు, ధైర్యంతో ఎన్నో ఎదుర్కొన్నావు. బ‌రువు త‌గ్గించుకోవ‌డం గొప్పేమీ కాదు.. కానీ త‌మ‌కంటూ స‌మాజంలో ఎంతో కొంత‌ విలువను సంపాదించుకోవ‌డం చాలా ముఖ్యం. నాకు తెలిసి ఈ పోస్ట్‌తో ఇది రాసిన మ‌హిళ విలువ ఇంకా పెరుగుతుంది.. అని రాసుకొచ్చారు.
అలాగే బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా సోన‌మ్ క‌పూర్ స్పందిస్తూ- "ఎవ‌రు ఎన్ని చెప్పినా, ఏమ‌న్నా నువ్వు అంద‌గ‌త్తెవు.." అంటూ నేహాకు స‌పోర్ట్ ఇవ్వ‌గా, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ కూడా త‌న‌దైన శైలిలో స్పందించింది. "నువ్వు ఎంత బ‌రువు ఉన్నా, శ‌రీరాకృతి ఎలా ఉన్నా.. సూప‌ర్ స్టైలిష్‌గా ఎలా క‌నిపించాలో నీకు బాగా తెలుసు.." అని ట్వీట్ చేసింది. ఇక‌, టాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా నేహాకు త‌న మ‌ద్ద‌తు తెలిపింది. మ‌హిళ‌ల‌ను త‌మ వ్య‌క్తిత్వం చూసి గౌర‌వించాలే త‌ప్ప.. వారి అందం లేదా లుక్స్ బ‌ట్టి కామెంట్స్ చేయ‌కూడ‌దంటూ ఘాటుగా స్పందించింది. నేహా చేసిన ట్వీట్ తర్వాత #fatshamingmuststop అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.


నిజ‌మే.. మ‌న స‌మాజంలో ఒక స్త్రీ అంటే ఇలానే ఉండాలి.. శ‌రీరాకృతి పోత‌పోసిన‌ట్లుగా ఉండాలి..అంటూ ఇప్ప‌టికీ కొంద‌రు మూస‌ధోర‌ణుల్లోనే వెళ్తున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీల విష‌యానికి వ‌చ్చే స‌రికి వారు కాస్త లావైనా వెంట‌నే బ‌రువు త‌గ్గాలి.. నాజూగ్గా మారాలి.. అంటూ తెగ స‌ల‌హాలు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ బాడీ షేమింగ్ చేయ‌కూడ‌ద‌ని, ప్ర‌తి మ‌హిళ‌ను వ్య‌క్తిత్వం ఆధారంగా గౌర‌వించాల‌ని చెబుతోన్న ఈ క‌థానాయిక‌ల మాట‌లు విన్నాక కొంద‌రి మ‌న‌సుల్లో అయినా మార్పు రావాల‌ని ఆశిద్దాం..


ఇవి కూడా చ‌ద‌వండి


మ‌ణిక‌ర్ణిక‌పై.. మెగాస్టార్ ప్రశంసల వర్షం..!


"ప‌ల్లె కోయిల" ప‌స‌ల బేబీ నోట.. హృద్యమైన మట్టి మనిషి పాట..!


శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?