ఒక మనిషిలో దాగి ఉన్న ప్రతిభ గురించి ప్రపంచానికి తెలియాలంటే ఒకప్పుడు ఎంతో సమయం పట్టేది. ఒక వ్యక్తి లేదా సంస్థ ప్రోత్సాహం లేనిదే ఆ ప్రతిభకు తగిన గుర్తింపు లభించేది కాదు. ఇలా అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ మరుగున ఉండిపోయిన కళాకారులు ఎందరో!
కానీ ప్రస్తుతం రోజురోజుకీ పెరుగుతోన్న టెక్నాలజీ పుణ్యమా అని అద్భుతమైన ప్రతిభ ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా అతి తక్కువ సమయంలోనే అది వెలుగులోకి వచ్చే అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మాటలకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల తన పాటతో, మాధుర్యమైన గొంతుతో అమితమైన పాపులారిటీ సంపాదించుకున్న పసల బేబీ (Pasala Baby)ని చెప్పుకోవచ్చు.
ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. అంటూ ఆమె పాడిన పాటతో ఆమెకే తెలియకుండా ఎంతోమంది సంగీత ప్రియులకు చేరువయ్యారు. చక్కని గాత్రంతో, అంతకుమించిన స్వరమాధుర్యంతో అందరి దృష్టినీ ఆకర్షించారామె. వాస్తవానికి మూడు నెలల క్రితం వరకు పసల బేబీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలోని సాధారణ గృహిణి. తూర్పు గోదావరి జిల్లాలోని రంగంపేట మండలం, పడసలేరు గ్రామానికి చెందిన ఆమె ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి తన జీవనాధారం కోసం పొలం పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీసిన సాదాసీదా రైతు కూలీ.
కానీ ఆమె సరదాగా పాడిన ఒక పాట బేబీ జీవితాన్నే మార్చేసింది. ఆ పాట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాదు.. ప్రముఖుల దృష్టిలోనూ పడింది. ఇంకేముంది.. ఎంతోమంది నుంచి ఆమె గొంతుకు ప్రశంసలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంగీత దర్శకుల దృష్టిలోనూ బేబీ పడ్డారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రఘు కుంచె కూడా ఆమె వీడియో చూసి, సోషల్ మీడియా వేదికగా ఆమె వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఆమెను కలుసుకొని బేబీతో ప్రత్యేకంగా ఓ పాట పాడించారు.
‘మట్టిమనిషినండి నేను..’ అంటూ సాగే ఈ పాటను జనవరి 31న యూట్యూబ్‌లో విడుదల చేశారు. “జీవితంలో గరళాన్ని మింగి, తన గొంతులోని అమృతాన్ని మన చెవుల్లో పోసిన ఒక పల్లె కోయిల పాట.. మట్టి మనిషనండి నేను..” అంటూ చక్కటి క్యాప్షన్ ఇచ్చిన ఈ పాట వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. విడుదల చేసిన కొద్ది సమయంలోనే 6 లక్షల వ్యూస్ దాటగా ఈరోజు సాయంత్రానికి 1 మిలియన్ వ్యూస్ దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల్ (Lakshmi Bhupal) ఈ పాటను రచించగా రఘు కుంచె స్వరాలు సమకూర్చారు. ఈ పాటలోని సాహిత్యాన్ని గమనిస్తే పసల బేబీ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని రచయిత ఆమె కోసం ప్రత్యేకంగా ఈ గీతాన్ని రచించారని అర్థమవుతోంది. వినసొంపుగా సాగే ఆ పాట ఎలా సాగుతుందంటే..
మట్టిమనిషినండి నేను … మాణిక్యమన్నారు నన్ను…
మట్టిమనిషినండి నేను … మాణిక్యమన్నారు నన్ను…
పల్లె కోయిలమ్మ తెల్లవారే కూసే కూతే నా పాట …
పంట చేనులో పైరుకంకి పైన గాలే నా తాళం…
ఏలేలో … ఏలేలో … నా నవ్వే… ఉయ్యాలో ….
ఈ పాటను బేబీ పాడిన విధానం.. ఆమె స్వరం.. వింటుంటే మనల్ని మనం మరోసారి మైమరచిపోవడం ఖాయం. ఈ పాట విన్న తర్వాత ఆమె జీవిత ప్రయాణాన్ని ఒక్క పాటలో చెప్పే ప్రయత్నం చేసిన లక్ష్మీ భూపాల్‌ను మనం మెచ్చుకోకుండా ఉండలేమేమో! అలాగే మట్టిలోని మాణిక్యాన్ని గుర్తించిన రీతిలో రఘు కుంచె బేబీలోని ప్రతిభను గుర్తించి.. ఆమెకు సరైన అవకాశం ఇచ్చి ప్రతిభకు పట్టం కట్టినందుకుగాను ఆయన్ని కూడా అభినందించాల్సిందే!
మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు కోటీ.. వంటి ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు బేబీ. అంతేకాదు.. ఏ.ఆర్. రెహ్మాన్ సైతం ఆమె గాత్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు తన పాటతో మరోసారి మాయ చేస్తోన్న బేబీకి ఈసారి ఇంకెన్ని ప్రశంసలు లభిస్తాయో, ఇంకెన్ని మంచి అవకాశాలు తలుపు తడతాయో చూడాలి మరి..!
ఇవి కూడా చదవండి
మణికర్ణికపై.. మెగాస్టార్ ప్రశంసల వర్షం..!